రేవంత్-కేసీఆర్ ఒకే అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారా ?

బీసీ అస్త్రాన్ని పాజిటివ్ గా ప్రయోగించాలని రేవంత్ ప్లాన్ చేస్తుంటే ఇదే బీసీ అస్త్రాన్ని నెగిటివ్ గా ఉపయోగించాలని బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు.;

Update: 2025-02-08 06:02 GMT
Revanth and KCR

తెలంగాణలో విచిత్రమైన పరిస్ధితులు కనబడుతున్నాయి. ఈనెలాఖరులో జరగబోతున్న ఎంఎల్సీ ఎన్నికలతో పాటు తొందరలోనే జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లోనూ విజయంసాధించాలని రేవంత్ రెడ్డి(Revanth) నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు పన్నుతున్నది. ఇదేసమయంలో 14 మాసాల కాంగ్రెస్ పాలనలో జనాలంతా ఇబ్బందులకు గురవుతున్నారనే ఆరోపణలతో స్ధానికసంస్ధల ఎన్నికల్లో గెలిచి బలం పుంజుకోవాలని బీఆర్ఎస్(BRS) ప్రయత్నిస్తోంది. అటు కాంగ్రెస్(Congress) వ్యూహానికైనా ఇటు బీఆర్ఎస్ ప్రయత్నానికైనా ఒకటే అస్త్రం ఉంది. అదేమిటంటే ‘బీసీ అస్త్రం’. బీసీ(BC weapon)లను కాంగ్రెస్ పార్టీ అణగదొక్కేస్తోందని కేటీఆర్(KTR), హరీష్ పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమహయాంలో బీసీలకు వేసిన ప్రాధాన్యతను గుర్తుచేస్తు కాంగ్రెస్ హయాంలో రాజకీయంగా జరుగుతున్న అన్యాయాలను ప్రతిరోజు ప్రస్తావిస్తున్నారు. బీసీ అస్త్రాన్ని పాజిటివ్ గా ప్రయోగించాలని రేవంత్, కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తుంటే ఇదే బీసీ అస్త్రాన్ని నెగిటివ్ గా ఉపయోగించాలని బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు.

ఇదేసమయంలో బీసీలకు కేసీఆర్ పదేళ్ళపాలనలో జరిగిన అన్యాయాలపై రేవంత్, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh), కొందరు మంత్రులు మండిపడుతున్నారు. కేసీఆర్(KCR) హయాంలోకన్నా బీసీల జనాభా 5 శాతం పెరిగినట్లుగా రేవంత్, బొమ్మ తదితరులు చెబుతున్నారు. కులగణన వల్లే బీసీల జనాభా ఎంతో తేలిందని రేవంత్ తదితరులు చెప్పుకుంటున్నారు. రాబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో(Local body elections) పార్టీపరంగా బీసీలకు కచ్చితంగా 42శాతం రిజర్వేషన్ సీట్లు కేటాయిస్తామని రేవంత్ ప్రకటించారు. బీఆర్ఎస్, బీజేపీలు బీసీలకు 42 శాతం టికెట్లను కేటాయించగలవా ? అని రేవంత్ సవాలు కూడా విసిరారు. రేవంత్ సవాలుకు ప్రతిపక్షాల నేతలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనచేయలేదు.

అలాగే ఈనెలలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీ అస్త్రంగా గజ్వేలు(Gajwel)లో భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తున్నట్లు పై పార్టీ వర్గాల సమాచారం. గజ్వేలు అనగానే చాలామందికి కేసీఆరే గుర్తుకొస్తారు. ఎందుకంటే చాలాకాలంగా కేసీఆర్ గజ్వేలు అసెంబ్లీ నియోజకవర్గం నుండే గెలుస్తున్నారు. గజ్వేలంటేనే బీఆర్ఎస్ కు కంచుకోటలాంటిదని చెప్పాలి. ఇలాంటి గజ్వేలులో కాంగ్రెస్ బహిరంగసభ నిర్వహించి తన 14 మాసాల పాలనలో బీసీలకు చేసిన మేలుతో పాటు వివిధ వర్గాలకు అందించిన సంక్షేమపథకాలను వివరించాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. రేవంత్ ఆలోచనలకు తగ్గట్లుగా కాంగ్రెస్ పార్టీ బహిరంగసభకు అవసరమైన ఏర్పాట్లు మొదలుపెట్టబోతోంది.

ఇదేపద్దతిలో బీఆర్ఎస్ కూడా గజ్వేలులోనే భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నది. 14 మాసాల కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎండగట్టేందుకే బహిరంగసభ నిర్వహించబోతోంది. బీసీలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని జనాలందరికీ వివరించాలని కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలను ఆదేశించారు. ఈనెలాఖరులో జరుగబోతున్న ఎంఎల్సీ ఎన్నికలను వదిలేసి తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. స్ధానికఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా కేసీఆర్ రాష్ట్రవ్యాప్త పర్యటనలు ప్లాన్ చేస్తున్నారు. ఈ పర్యటనలకు ముందుగా గజ్వేలుతోనే శ్రీకారం చుట్టాలన్నది కేసీఆర్ ఆలోచన.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగబోయే గజ్వేలు, సూర్యాపేట బహిరంగసభలను నూరుశాతం విజయవంతంచేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మ ప్లాన్ చేస్తున్నారు. రెండు బహిరంగసభలకు ముఖ్యఅతిధులుగా పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధి(Rahulgandhi), ప్రియాంకగాంధి(Priyankagandhi), ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(AICC Mallikarjuna Kharge)ను పిలిపించాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత ఢిల్లీ పర్యటనలో ఈవిషయాన్ని పైముగ్గురితో రేవంత్ ప్రస్తావించినట్లు పార్టీవర్గాల సమాచారం. అలాగే సొంతనియోజకవర్గం గజ్వేలు బహిరంగసభకు లక్షలాదిమందిని సమీకరించాలని నేతలను కేసీఆర్ ఆదేశించారు. గజ్వేలుకు ఆనుకునే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల, హరీష్ రావు నియోజకవర్గం సిద్ధిపేట ఉండటంతో జనసమీకరణ సులభంగా ఉంటుందన్న వ్యూహంతోనే కేసీఆర్ గజ్వేలులో బహిరంగసభకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి బీసీ అస్త్రంతోనే రేవంత్, కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి దూకబోతున్నారన్న విషయంలో క్లారిటి వచ్చేసింది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News