దసరా నవరాత్రి వేడుకల్లో డీజేపై నిషేధం

హైదరాబాద్ లో దసరా నవరాత్రి ఉత్సవాల్లో డీజే సంగీతాన్ని పోలీసులు నిషేధించారు.అక్టోబరు 3నుంచి 12వతేదీ వరకు జరగనన్న ఉత్సవాల్లో డీజే పెట్టవద్దని పోలీసులు ఆదేశించారు.

Update: 2024-09-28 12:20 GMT

హైదరాబాద్ నగరంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో డీజే సంగీతాన్ని పోలీసులు నిషేధించారు. గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పండుగల తర్వాత హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ నిర్వహించిన సమావేశంలో డీజేను నియంత్రించాలని నిర్ణయించారు. అక్టోబరు 3 నుంచి 12వతేదీ వరకు జరగనన్న నవరాత్రి దసరా ఉత్సవాల్లో డీజే సౌండ్ సిస్టమ్‌ను సరఫరా చేయవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మిలాద్-ఉన్-నబీ పండుగ సందర్భంగా డీజే కోసం ఏర్పాటు చేసిన జనరేటర్‌లో మంటలు చెలరేగడంతో వారు పోలీసులు డీజే నిషేధ నిర్ణయాన్ని వేగవంతం చేశారు.


డీజేలపై పెరిగిన ఫిర్యాదులు
డీజే సౌండుతో వెలువడే శబ్ధ కాలుష్యంతో తాము అసౌకర్యానికి గురవుతున్నామని సాధారణ ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి. ఊరేగింపుల్లో డీజే సౌండుత పోలీసులకు వాకీటాకీల్లో వచ్చే సూచనలు కూడా వినలేక పోతున్నామని నగరానికి చెందిన ఓ పోలీసు అధికారి చెప్పారు. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ మ్యూజిక్ ను అనుమతించరాదని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దసరా ఉత్సవాల సందర్భంగా దాండియా సమావేశాల్లో డీజేలు పెట్టరాదని గోషామహల్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ కె వెంకట్ రెడ్డి సౌండ్ సిస్టమ్ ప్రొవైడర్లను ఆదేశించారు.

శబ్ధ కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది : సీపీ సీవీ ఆనంద్
శబ్ధ కాలుష్యం చాలా బాధాకరం,ఆందోళన కలిగించే విషయమని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. కాలనీల్లో డీజే మోగుతోందని, దీన్ని ఆపించాలని కోరుతూ ప్రజల నుంచి తమకు మెసేజులు, ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ‘‘అమ్మకు ఆపరేషన్ అయింది ఈ సౌండుకు మరణిస్తుందేమోనని’’ మరో వ్యక్తి ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందరూ కలిసి శబ్ధ కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సీవీ ఆనంద్ కోరారు.

విద్యార్థుల చదువుకు ఆటంకం
ఇతరులకు అసౌకర్యం కలిగించే పనులు చేయరాదని, శబ్ధకాలుష్యంపై డయల్ 100కు వచ్చే ఫిర్యాదులు పెరిగాయని,డీజేల వల్ల విద్యార్థులు చదువుకోలేక పోతున్నారని సీపీ చెప్పారు. డీజే సౌండులపై పలు ఫిర్యాదులు వచ్చాయి.డీజేల వల్ల ఫోన్లు, వైర్ లెస్ సెట్లు వినిపించవని, శబ్ధ కాలుష్యం వల్ల బ్రెయిన్ హెమరైజ్‌తో ఓ వ్యక్తి మరణించారని సీపీ చెప్పారు. శబ్ధ కాలుష్యం, బాణసంచా కాల్చడాన్ని నివారించాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు. సిటీ పోలీసు యాక్ట్ ప్రకారం శబ్ధ కాలుష్యాన్ని నివారించేందుకు చట్టాలున్నాయని సీపీ చెప్పారు. బాణసంచా కాల్చడం వల్ల పలు ప్రమాదాలు వాటిల్లుతున్నాయని సీపీ వివరించారు.


Tags:    

Similar News