బీసీ 42% రిజర్వేషన్లకు అసెంబ్లీ ఆమోదం

మంత్రి ధనసరి సీతక్క(Minister (Seethakka)ప్రవేశపెట్టిన బిల్లుకు ఓటింగ్ ద్వారా సభ ఆమోదం తెలిపింది;

Update: 2025-08-31 07:15 GMT
T Assembly approves BC Reservations bill

స్ధానికసంస్ధలఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లబిల్లు సవరణలకు అసెంబ్లీ ఆదివారం ఆమోదం తెలిపింది. ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth)ప్రభుత్వం సవరణల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ ఎంఎల్ఏలతో పాటు ప్రతిపక్షాల ఎంఎల్ఏలు మాట్లాడిన తర్వాత ప్రభుత్వం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. మంత్రి ధనసరి సీతక్క(Minister Seethakka)ప్రవేశపెట్టిన బిల్లుకు ఓటింగ్ ద్వారా సభ ఆమోదం తెలిపింది. దీంతో తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42శాతం(BC Reservations)రిజర్వేషన్ అమలుచేయటానికి మార్గం సుగమమైంది. అయితే ఇక్కడ న్యాయపరమైన సమస్య ఉంది.

అదేమిటంటే మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని గతంలో సుప్రింకోర్టు తీర్పుంది. దీని ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 10శాతం, బీసీలకు 22శాతం రిజర్వేషన్లు అమల్లో ఉంది. అమల్లో ఉన్న రిజర్వేషన్లు 50శాతానికి మించటంలేదు కాబట్టి ఎలాంటి సమస్యలు ఎదురుకావటంలేదు. అలాంటిది 2023 ఎన్నికల సమయంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుచేస్తామని రేవంత్ ఇచ్చిన హామీ అమలుపై పెద్దగొడవ జరుగుతోంది. అందుకనే ఏదోపద్దతిలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే బిల్లు రెడీచేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపింది. ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగులో ఉంది.

బిల్లుతో లాభంలేదని డిసైడ్ తర్వాత అసెంబ్లీలో రెండోసారి బిల్లు పాస్ చేయించి ఆర్డినెన్సు జారీచేసి గవర్నర్ దగ్గరకు పంపితే అది కూడా ఢిల్లీలోనే పెండింగులో పడిపోయింది. స్ధానికఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలున్నాయి. హైకోర్టు విధించిన గడువు దగ్గరకు వచ్చేస్తున్న నేపధ్యంలో ఏమిచేయాలో దిక్కుతోచకే చివరకు తాజా అసెంబ్లీ సమవేశాల్లో మళ్ళీ మూడోసారి బిల్లును ప్రవేశపెట్టి పంచాయితీరాజ్ చట్టానికి ఏకంగా సవరణే చేసేశారు. తాజా సవరణ ప్రకారం బీసీలకు ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లు అమలుచేసేందుకు అవకాశం దక్కింది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే ప్రభుత్వం చేసిన చట్ట సవరణపై ఎవరైనా కోర్టులో కేసువేస్తే చట్టసవరణ వీగిపోతుంది. ప్రభుత్వంచేసిన చట్టం ఆగిపోతుంది. అప్పుడు బీసీలకు 42శాతం రిజర్వేషన్ బదులు 22శాతమే అమల్లోకి వస్తుంది మళ్ళీ. ఈవిషయం రేవంత్ తో పాటు మంత్రులు, సభలోని సభ్యులందరికీ తెలుసు. అయినా సరే బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుపై తాము చిత్తశుద్దితో ఉన్నామని చెప్పుకోవటానికి రేవంత్ ప్రయత్నించారు.

తెలంగాణలో బీసీవాదన చాలా బలంగా వినబడుతున్న నేపధ్యంలో ప్రభుత్వం చేసిన చట్టంపై ఏ పార్టీ కోర్టులో చాలెంజ్ చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఏ పార్టీ అయినా చట్టానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తే సదరు పార్టీని బీసీల ద్రోహిగా చిత్రీకరించేందుకు రేవంత్ అండ్ కో సిద్ధంగా ఉన్నది. ఇదేజరిగితే రాబోయే స్ధానిక ఎన్నికల్లోనే కాదు తర్వాత జరిగే ఏ ఎన్నికలో కూడా బీసీ సామాజికవర్గం కేసు వేసిన పార్టీకి దూరమయ్యే అవకాశముంది. బీసీల మద్దతులేకుండా ఏపార్టీ కూడా అధికారంలోకి రావటం జరిగేపనికాదు. కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీసీల ఛాంపియన్ తామంటే కాదు తామే అని కీచులాడుకుంటున్నాయి.

భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కోర్టులో కేసు వేయటానికి బీఆర్ఎస్ సాహసించకపోవచ్చు. ఇక బీజేపీ అయితే ముస్లింలను బీసీల్లో చేర్చటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మొదటినుండి చెబుతున్నది. ఇదేవాదనతో 42శాతం రిజర్వేషన్ కు వ్యతిరేకంగా కమలంపార్టీ నేతలు లేదా వాళ్ళ మద్దతుదారులు కోర్టులో కేసువేసే అవకాశాలున్నాయి. రాబోయేఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందనే భ్రమలో ఎవరూలేరు. ఈరెండుపార్టీలు కాకుండా ఇంకేపార్టీకి కేసులు దాఖలు చేసేంత అవసరంలేదు. అయినాసరే ఏదోరూపంలో కోర్టులో కేసుదాఖలకు అవకాశాన్ని కొట్టిపారేయలేము.

పంచాయితీరాజ్ చట్టంతో పాటు మున్సిపల్ చట్టానికి చేసిన సవరణలను కూడా అసెంబ్లీ ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదంతో బీసీలకు 42శాతం రిజర్వేషన్లానికి చట్టం రూపంవచ్చింది కాబట్టి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏమిచేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే అసెంబ్లీ చేసిన చట్ట సవరణలను, తర్వాత ప్రభుత్వం జారీచేయబోయే ఉత్తర్వులపైన గవర్నర్ సంతకం చేయాల్సిందే. గవర్నర్ సంతకం చేయకపోతే చట్టమైనా, ఉత్తర్వైనా చెల్లదు. అందుకనే గవర్నర్ స్పందన ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News