తెలంగాణలో అందాల పోటీల హోరు..విదేశీ పర్యాటకుల జోరు
హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగనుండటంతో తెలంగాణ పర్యాటక రంగానికి ప్రపంచ గుర్తింపు లభించనుంది.దీంతో పర్యాటక స్థలాలకు విదేశీ పర్యాటకుల రాక పెరగనుంది.;
By : The Federal
Update: 2025-05-04 23:43 GMT
హైదరాబాద్ నగరంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనుండటంతో తెలంగాణ పర్యాటక రంగానికి కొత్త ఊపు వచ్చినట్లయింది. మిస్ వరల్డ్ పోటీలను (Miss World)తెలంగాణ టూరిజంను ప్రమోట్ చేసేందుకు వీలుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందించారు. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను ప్రచారం చేసేందుకు ప్రభుత్వ పర్యాటక శాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.
ముగ్గురు అందాల భామల రాక
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్ జన్సెన్ వాన్ రెన్స్ బర్గ్ ఆదివారం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇప్పటివరకు కెనడా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా కు చెందిన సుందరాంగులు హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మిస్ సౌత్ ఆఫ్రికా కు తెలంగాణ ప్రభుత్వ అధికారుల బృందం స్వాగతం పలికింది.
పర్యాటక కేంద్రాలను సందర్శించనున్న అందాలభామలు
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లుసందర్శించనున్నారు. దీంతొ ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రచారం దక్కనుంది.ప్రపంచ అందాల భామల రాకతో దేశీయ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులను తెలంగాణ పర్యాటక ప్రాంతాలకు పెద్ద ఎత్తున ప్రచారం లభించనుంది. దీనివల్ల తెలంగాణ పర్యాటక వృద్ధితో ఉద్యోగావకాశాల కల్పనకు ఊతం ఇచ్చినట్లవుతుందని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు.
రూ15వేల పెట్టుబడులు లక్ష్యంగా...
అద్భుత చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలంగాణను దేశంలో ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా రూపుదిద్దాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే తెలంగాణ తొలి టూరిజం పాలసీనీ రూపొందించింది. ఇందుకోసం మిస్ వరల్డ్ పోటీలను సరైన వేదికగా ఉపయోగించుకోనుంది.
120 దేశాల ప్రతినిధులు హాజరు
మిస్ వరల్డ్ (Beauty Pageants)ఈవెంట్ లో తెలంగాణకు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం కల్పించి తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రముఖంగా ప్రమోట్ చేసేందుకు తద్వారా ప్రపంచ పర్యాటకంలో తెలంగాణను ప్రముఖంగా నిలిపేందుకు చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున విదేశీ పర్యాటకులను ఆకర్షించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. 2024 సంవత్సరంలో తెలంగాణలో 1,55,113 మంది విదేశీ పర్యాటకులు (Foreign Tourists)సందర్శించారు.ఈ ఏడాది విదేశీ పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెరిగేందుకు ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ ను ఉపయోగించుకోనుంది.
తెలంగాణ పర్యాటక కేంద్రాల ముస్తాబు
మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్ నగరంతోపాటు, వరంగల్ వేయి స్తంభాల ఆలయం, ఖిలా వరంగల్, భద్రకాళి , రామప్ప, నాగార్జున సాగర్, పోచంపల్లి, పిల్లలమర్రి వృక్షం ప్రముఖ పర్యాటక ప్రదేశాలను మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లు సందర్శించనున్నారు.దీని కోసం పర్యాటక కేంద్రాలను ముస్తాబు చేశారు. ఈ నెల 12 వతేదీన హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వం గొప్పదనం ప్రపంచానికి తెలియజేసేలా చార్మినార్ ,లాడ్ బజార్ లలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లు హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు.ఈ నెల 13 న హైదరాబాద్ కే తలమానికంగా నిలుస్తున్న చౌమహల్లా ప్యాలెస్ ను సందర్శించి ఓల్డ్ సిటీ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి తెలియ చేయనున్నారు.ఈ నెల 14 వతేదీన చారిత్రక, ఆధ్యాత్మిక నగరం వరంగల్ లోని వేయి స్తంభాల గుడి, వరంగల్ పోర్ట్ ను సందర్శిస్తారు.ఇదే రోజు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సుందరాంగులు సందర్శిస్తారు. కాకతీయులు యుద్ధ రంగానికి వెళ్లే ముందు ప్రదర్శించే పేరిణి నృత్యాన్ని రామప్పలో అందాల భామలు తిలకించనున్నారు.
ఆధ్యాత్మిక టూరిజం
నెల15 న మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు ఆధ్యాత్మిక టూరిజం లో భాగంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శిస్తారు. హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్సల్ టూర్ లో భాగంగా పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీని, ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకిస్తారు.ఈ నెల 16 న మెడికల్ టూరిజం పరిచయ కార్యక్రమంలో భాగంగా మెడికల్ టూరిజం ను చేపడతారు. మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రి వృక్షాన్ని , హైదరాబాదు నగరానికే ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఎక్స్పీరియంపార్కును సందర్శిస్తారు.ఈ నెల 17న ప్రపంచంలోనే పెద్ద ఫిలిం సిటీలలో ఒకటిగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీని మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు సందర్శిస్తారు.
తెలంగాణ ప్రగతి తెలియచెప్పేలా...
18వతేదీన మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించి తెలంగాణ ప్రభుత్వం పౌరుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను , ప్రభుత్వం సేఫ్టీ టూరిజం ఇనిషియేటివ్స్ ను పరిశీలిస్తారు. ఇదే రోజు సాయంత్రం మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లకు అధికారులు తెలంగాణ రాష్ట్ర గ్రోత్ స్టోరీ, చరిత్రను తెలియజేస్తారు. ట్యాంక్ బండ్ పై ప్రతి ఆదివారం ఏర్పాటు చేసే సండే ,ఫండే కార్నివాల్ ను సందర్శిస్తారు.
ఐపీఎల్ మ్యాచ్ ను వీక్షించనున్న అందాల భామలు
ఈ నెల 20 లేదా 21వతేదీన ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కు కంటెస్టెంట్లు హాజరవుతారు. 21న శిల్పారామం లో తెలంగాణ కళాకారులతో నిర్వహించే ఆర్ట్స్ , క్రాఫ్ట్స్ వర్క్ షాప్ అందాల భామలు హాజరవుతారు. స్వయంగా వాటి తయారీలో భాగమై ప్రత్యక్షంగా తయారీ గురించి తెలుసుకుంటారు.మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రచారం దక్కనుంది. తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక గాథలు, ఆధునిక అభివృద్ధి, పర్యాటక ప్రాముఖ్యత ను ప్రపంచానికి తెలుపడంతో పాటు రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఒక "మల్టీడైమెన్షనల్ టూరిజం హబ్"గా నిలిపే అవకాశం లభిస్తుంది.