రేవంత్‌కు భారీ ఊరట.. పిటిషనర్‌కు సుప్రీంకోర్టు మొట్టికాయలు
పిటిషన్‌ను గుడ్డిగా వేస్తే ఎలా కుదురుతుందని న్యాయవాదిని ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై 2016లో నమోదైన ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్, ఆయన తరపు న్యాయవాది రితేష్ పాటిల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్లు దాఖలు చేసిన పిటిషన్‌లో ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తిపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని సీజేఐ జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. ఒక న్యాయవాది అయ్యుండి న్యాయమూర్తిపై వ్యాఖ్యలు చేస్తూ పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రితేష్ సహా పెద్దిరాజుకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు పిటిషనర్ పెద్దిరాజు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలిచ్చింది.
అసలు కేసు ఏంటంటే..
రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, లక్ష్మయ్య కలిసి సొసైటీ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేశారంటూ పెద్దిరాజు 2016లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రేవంత్ సహా మిగిలిన నిందితులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి 2020లో హైకోర్టు ఆశ్రయించారు. రేవంత్ పిటిషన్‌పై విచారణ జరిగిన ఉన్నత న్యాయస్థానం.. ఫిర్యాదు దారు ఆరోపణల్లో సరైన సాక్షాధారాలు లేవని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. హైకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం.. కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ పెద్దిరాజు.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారించింది.
చర్యలు ఎందుకు తీసుకోకూడదు: సుప్రీం
కాగా పిటిషన్‌లో న్యాయమూర్తి గురించి ఉన్న వ్యాఖ్యల నేపథ్యంలో రితేష్ పాటిల్.. కోర్టుకు క్షమాపణ కోరారు. అందుకు సీజేఐ బీఆర్ గవాయ్ నిరాకరించారు. అసలు పిటిషన్ రాసే సమయంలో కానీ, దాఖలు చేసే సమయంలో కానీ వెరిఫై చేసుకోరా? అంత గుడ్డిలా ఎలా పిటిషన్ వేశారు? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పిటిషన్ ఉపసంహరించుకోవడానికి రితేష్ చేసిన అభ్యర్థనకు కూడా బీఆర్ గవాయ్ నో చెప్పారు. పిటిషన్ దాఖలు చేసే ముందు న్యాయవాదిగా అన్ని విషయాలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోవద్దంటూ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. కోర్టు ధిక్కరణ నోటీసుపై లిఖిత పూర్వకంగా సమాధానం ఆదేశించారు. సమాధానం ఆమోదయోగ్యంగా ఉంటేనే కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టం చేస్తూ... విచారణ ఆగస్టు 11కు వాయిదా వేశారు.