‘సృష్టి’ కేసులో బిగ్ ట్విస్ట్
డాక్టర్ నమ్రత కాదు డాక్టర్ అట్లూరి నీరజ;
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ పచ్చిపాల నమ్రత అసలు పేరు డాక్టర్ అట్లూరి నీరజ అని సిట్ అధికారులు వెల్లడించారు. 1989లో ఆమె ఆంధ్ర మెడికల్ కాలేజి నుంచి ఆమె ఎంబిబిఎస్ పట్టా తీసుకుంది ఈ పేరు మీదే. కానీ అక్రమ సరోగసీ వ్యాపారంలో దిగినప్పుడు ఆమె పేరు మార్చుకుంది. డాక్టర్ అట్లూరి నీరజ కాస్త డాక్టర్ పచ్చిపాల నమ్రతగా పేరు మార్చుకుని తన అక్రమ వ్యాపారాన్ని కొనసాగించింది. తన అక్రమ వ్యాపారాన్ని మూడు పూవులు ఆరు కాయలుగా విస్తరించింది. ఇటీవలె డాక్టర్ నమ్రతను పోలీసులు జ్యుడిషియల్ కస్టడీలో తీసుకున్నప్పుడు డాక్టర్ నమ్రత కన్ఫెషన్ రిపోర్టు (నేరాంగికార నివేదిక)లో ఈ విషయాలను అంగీకరించింది.
రాంగోపాల్ పేట పోలీసులు డాక్టర్ నమ్రతపై చైల్డ్ ట్రాఫికింగ్ కేసు నమోదు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై కేసును సిట్ ( Special Investigation Team)కు బదిలీ చేసింది. నార్త్ జోన్ పోలీసులు ఈ కేసును పూర్తిగా సిట్ కు అప్పగించారు.
సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇపుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. కాగా ఈ కేసులో సిట్ తన విచారణ స్పీడ్ పెంచింది. అందులో భాగంగా ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను విచారించింది .ఆమె ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టు చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. విచారణలో తాను నేరం చేసినట్లుగా డాక్టర్ నమ్రత పోలీసుల ఎదుట అంగీకరించింది. అంతేకాదు తను సరోగసీ పేరిట 80 మంది దంపతులను మోసం చేసినట్లు కూడా అంగీకరించింది.
మహిళా ఏజెంట్లు కీలకం
కేవలం ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసి తన వద్దకు వచ్చే దంపతులను నమ్మించి వంచించినట్టు ఒప్పుకుంది. మహిళా ఏజెంట్లు ఎక్కువ సంఖ్యలో పెట్టుకున్నట్టు వివరించింది. ఒక్కో బిడ్డకు 20 నుంచి 50 లక్షల రూపాయల వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలిపింది.
పిల్లల కొనుగోలు వ్యవహారంలో ఆమె అనుచరులు సంజయ్‌తో పాటు.. విశాఖపట్నంకు చెందిన సంతోషీ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
లీగల్ గా సమస్యలు వస్తే తన రెండో కుమారుడు జయంత్ కృష్ణ సహకరించేవాడని డాక్టర్ నమ్రత కన్ఫెషన్ రిపోర్టులో అంగీకరించింది. సరోగసీ పేరిట మోసం చేసిన డాక్టర్ నమ్రతను నిలదీయడానికి ఆమె దగ్గరకు వచ్చిన దంపతులను తన రెండోకుమారుడు బెదిరించేవాడని పోలీసులకు చెప్పింది. సరోగసీ చట్టవిరుద్దమని అడ్వకేట్ అయిన రెండోకుమారుడు బెదిరించిన సందర్బాలున్నాయని పోలీసులు తెలిపారు. రెండో కుమారుడి ఆఫీసు కూడా సృష్టి ఆస్పత్రిలోనే కొనసాగడం బట్టి చూస్తే అడ్వకేట్ కుమారుడిని సైతం చట్టవిరుద్ద కార్యకలాపాల్లో డాక్టర్ నమ్రత ఇన్వాల్వ్ చేసిన తీరు బయటపడుతోంది.
విశాఖపట్నంలోనే డెలివరీలు
విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో నీరజ మెడిసిన్ చదివింది. ఇదే విశాఖపట్నంలోనే డాక్టర్ నమ్రత యువతులకు పిల్లలను డెలివరీ చేసేది.తన క్లాస్ మేట్స్ తో కూడా డెలివరీ చేయించేది. సరోగసీ కేసులో దొరికితే తన పేరు బయటకు బయటకు రాకుండా ఉండేందుకే ఆమె పేరు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే సరోగసీ డాక్టర్ నమ్రత పేరుతోనే చెలామణి అయ్యింది. మరోవైపు పచ్చిపాల నమ్రతపై తెలుగు రాష్ట్రాల్లో 15 కేసులు నమోదయ్యాయి. సృష్టి కేసులో ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రభుత్వ డాక్టర్లను దందాలో భాగస్వామ్యం
డాక్టర్ నమ్రత ప్రభుత్వ డాక్టర్లను కూడా వదల్లేదు. గాంధీ ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ సదానందం, డాక్టర్ విద్యుల్లతలను వాడుకుంది. అనేస్తిషియా కోసం డాక్టర్ సదానందం, గైనకాలజిస్ట్ డాక్టర్ విద్యుల్లతను ఈ అక్రమదందాలో భాగస్వాములను చేసింది.
సృష్టి అకౌంట్లను, డాక్టర్ నమ్రత వ్యక్తిగత అకౌంట్లను ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. ఈ అకౌంట్లలో దాదాపు 30 కోట్ల రూపాయలవరకు డిపాజిట్ అయినట్టు పోలీసులు వెల్లడించారు.
డాక్టర్ నమ్రత తాను చదివిన మెడికల్ కాలేజి క్లాస్ మేట్స్ తో ఈ అక్రమ దందాలో భాగస్వాములను చేసినట్టు కూడా అంగీకరించింది.1998లో విజయవాడలో, 2007లో సికింద్రాబాద్ లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభించింది. విశాఖపట్నంలో సృష్టి హాస్పిటల్ ప్రారంభించినప్పటికీ కేవలం డెలివరీల కోసమే వాడుకునేది. అబార్షన్ కోసం వచ్చే యువతులకు మాయమాటలు చెప్పి డైవర్ట్ చేసేది.డబ్బులు ఇస్తానని కౌన్సిలింగ్ చేసేది. డెలివరీ తర్వాత వారికి ఎంతో కొంత ముట్టజెప్పేది. కేవలం 90వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునేదని సిట్ విచారణలో వెల్లడైంది.పిల్లలు లేని దంపతులకు కూడా ఇక్కడే బిడ్డలను అప్పగించేది
డాక్టర్ నమ్రత 30 ఏళ్ల నుంచి సరోగసీ పేరుతో పిల్లలు లేని దంపతులను మోసం చేస్తోంది. తన వద్ద లేదా ఇతర ఆస్పత్రుల్లో గర్బ స్రావం చేయించుకోవడానికి వచ్చే యువతుల వివరాలు తెప్పించుకుని వారితో డాక్టర్ నమ్రత మాట్లాడేది. ‘‘మీ కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపకండి. గర్బిణీగా ఉన్నప్పట్నుంచి డెలివరీ అయ్యే వరకు ఖర్చులు మేమే భరిస్తాం’’ అని డాక్టర్ నమ్రత వారిని సముదాయించేది.
సరోగసీ క్వీన్
గిరిజన తండాల్లో గర్బిణీ మహిళలకు ఎంతో కొంత ముట్టజెప్పి డెలివరి కాగానే ఆ బిడ్డను తీసుకుని పిల్లలు లేని దంపతులకు విక్రయించేది. వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసేది. డాక్టర్ నమ్రత అసలు పేరు పక్కకు పెడితే ఆమె ఇంతవరకు సరోగసీ ఎవరికీ చేయలేదు. ఏ ఒక్కరికీ సరోగసీ చేయకపోయినప్పటికీ సరోగసీ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం పిల్లలను కొనుగోలు చేసి అమ్మడమే ఆమె వృత్తి ప్రవృత్తి అయిపోయింది. డాక్టర్ నమ్రత ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టు లో కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగు చూశాయి.
విశాఖపట్నం మహరాణిపేటలో నాలుగుకేసులు, విశాఖపట్నం టూటౌన్ పిఎస్ లో రెండు కేసులు, గుంటూరు కొత్త పేటలో ఒక కేసు, సికింద్రాబాద్ రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో ఐదు కేసులు నమోదయ్యాయి.
అందరి కాపురాల్లో అనుమానాలు
రాజస్థాన్ కు చెందిన దంపతులను సరోగసీ పేరిట మోసం చేసిన కేసులో డాక్టర్ నమ్రత కేసు వెలుగు చూసింది. జులై 27న ఈ కేసు వెలుగు చూడటంతో డాక్టర్ నమ్రత చేత సరోగసీ ట్రీట్ మెంట్ చేయించుకున్న దంపతులకు అనుమానాలు మొదలయ్యాయి. తాము పెంచుకుంటున్న బిడ్డలకు డిఎన్ఏ టెస్టులు చేయించుకోవడానికి క్యూ కడుతున్నారు. తమ డిఎన్ఏతో పెంచుకునే బిడ్డకు పోలిక లేకపోవడంతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఢిల్లీలో డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్న రాజస్థాన్ దంపతులు డాక్టర్ నమ్రత ఇచ్చిన బిడ్డ పెంపకం బాధ్యత తీసుకోలేదు. బిడ్డకు క్యాన్సర్ అని తేలడంతో పెంపకం బాధ్యతను పూర్తిగా వదిలించుకుని స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారులకు బిడ్డను అప్పగించారు.