బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి..

నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.;

Update: 2025-01-07 10:09 GMT

నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని, ఇరువర్గాలను వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఇరు వర్గాల్లో ఎవరూ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని ఉద్దేశించి బీజేపీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మూలంగా మారాయి. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కేంద్ర మంత్రులను అడ్డుకోవాలని యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యూత్ కాంగ్రెస్ ప్రయత్నించింది. రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. అంతేకాకుండా రమేష్ బిదురి దిష్టిబొమ్మను దహనం చేశారు. యూత్ కాంగ్రెస్ చేసిన దాడిలో బీజేపీ నేత ఒకరికి తలకు గాయమైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బీజేపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.

ఈ ఘర్షణ, దాడులకు సంబంధించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాగా తమ నేత ప్రియాంకను ఉద్దేశించి రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని యూత్ కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ ఘర్షణలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒక్కరు కూడా బయటకు తిరగరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రైడీల్లా కాంగ్రెస్ కార్యకర్తలు

‘‘బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రైడీల్లా వ్యవహరిస్తున్నారు. రాళ్లతో, కర్రలతో దాడులు చేయాన్ని ఖండిస్తున్నాం. ఇది పిరికిపందల చర్య. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్. ఇప్పటికైనా కాంగ్రెస్ తన తీరు మార్చుకోకుండా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం గేటుపై దాడికి పాల్పడటం దుర్మార్గం. ఇంతటి స్థాయిలో దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలకు స్థానం లేదు. ఇలాంటి రాజకీయాలకు మేము పూర్తిగా వ్యతిరేకం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హింస పెట్రేగిపోతోంది. కక్షపూరిత, ద్వేషపూరిత రాజకీయాలు పెరిగిపోయాయి. గతంలో సొంతపార్టీకి చెందిన ముఖ్యమంత్రులను గద్దెదించడానికి మతకల్లోలాలు సృష్టించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ సొంతం’’ అని కిషన్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కాంగ్రెస్ చేష్టలకు సహనం కోల్పోయి బీజేపీ కార్యకర్తలు తిరగబడితే దేశంలో కాంగ్రెస్‌కు ఉన్న కొద్దిపాటి నాయకులు కూడా బయట తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు.

రమేష్ బిదురి ఏమన్నారంటే..

ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి.. ప్రియాంకను ఉద్దేశించి అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపిస్తే రోడ్లను ప్రియాంక బుగ్గల మాదిరి చేస్తానంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో క్షమాపణుల కూడా చెప్పారు. ‘‘నేను అలా ఉండకూడదు. నా వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నా’’ అని రమేష్ క్షమాపణలు చెప్పారు.

Tags:    

Similar News