డీలిమిటేషన్ చర్చకు బీజేపీ, బీఆర్ఎస్ దూరం
అన్ని పార్టీల నుంచి ఒక్కొక్కరు ఈ సమావేశానికి హాజరవుతారు. కొన్ని పార్టీల గైర్హాజరు తాత్కాలికమే. భవిష్యత్తులో అందరూ కలిసి వస్తారని జానారెడ్డి అన్నారు.;
కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ప్రణాళికలకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమవుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో అన్ని పార్టీల సమావేశం నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. నియోజకవర్గాల పునర్విభజనపై సోమవారం అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్ లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం, సిపిఎం, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, రిపబ్లిక్ కన్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేశారు. ఈ అఖిలపక్ష సమావేశం సోమవారం డిప్యూటీ సీఎం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలు తెలియజేయాలని, డీలిమిటేషన్ వల్ల రాష్ట్రానికి వాటిల్లే నష్టంపై కేంద్రానికి వివరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కోరింది. కాగా ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గౌర్హాజరయ్యారు. కాగా కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో పలు అంశాలపై చర్చించారు.
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు ప్రధానంగా తెలంగాణ నష్టపోతుందని, ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై చర్చలు, ఆలోచనలు చేయాలని సమావేశానికి హాజరైన రాజకీయ పక్షాలను డిప్యూటీ సీఎం కోరారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు క్రమంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర అనివార్యంగా ఉండేలా నియోజకవర్గాల పునర్విభజన ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అభిప్రాయపడ్డారు. మన గౌరవం, ప్రాధాన్యత కాపాడుకుంటూ భారత దేశంలో మన అందరి పాత్ర ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశానికి బీ ఆర్ఎస్ నేతలను సైతం ఆహ్వానించినప్పటికీ వారు ప్రత్యేక రాజకీయ కారణాల తో సమావేశానికి హాజరు కాలేమని తెలిపారని డిప్యూటీ సీఎం వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్లమెంటు సమావేశంలో బిజీగా ఉండడం, ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారు హాజరు కాలేదని డిప్యూటీ సీఎం వివరించారు. సమావేశానికి హాజరైన నేతలంతా ఇచ్చిన సమాచారం మేరకు భవిష్యత్తులో ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలో ప్రణాళిక తయారు చేసుకొనే అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం వివరించారు.
ఈ సమావేశం ముగిసిన అనంతరం ఈ సమావేశంపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడారు. ఇటువంటి సమావేశాలు మరిన్ని జరుగుతాయని చెప్పారు. ‘‘డీలిమిటేషన్‌పై ఇలాంటి సమావేశాలు ఇంకా కొనసాగుతాయి. తమిళనాడు నిర్వహించే జేఏసీ సమావేశానికి రాష్ట్ర ప్రతినిధుల బృందం వెళ్తుంది. అన్ని పార్టీల నుంచి ఒక్కొక్కరు ఈ సమావేశానికి హాజరవుతారు. కొన్ని పార్టీల గైర్హాజరు తాత్కాలికమే. భవిష్యత్తులో అందరూ కలిసి వస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ డీలిమిటేషన్ అంశంపై మార్చి 7న సీఎం రేవంత్ రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ డీలిమిటేషన్.. దక్షిణాది రాష్ట్రాలపై కక్షసాధించడానికి చేసి కుట్ర మాదిరిగానే ఉందన్నారు.
‘‘కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సక్సెస్ ఫుల్‌గా అమలు చేశాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో డీలిమిటేషన్ అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ స్థానాలు గణనీయంగా తగ్గుతాయి. కాబట్టి డీలిమిటేషన్‌ను మరో 30 ఏళ్లు వాయిదా వేయాలి. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా ఎంతలా పెరుగుతుందో చూడాలి. జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రో రేటా విధానంలో సీట్ల పెంపు చేపట్టాలి. అలా చేస్తే యూపీలో ఇప్పుడు ఉన్న 8 సీట్లు 120కి పెరుగుతాయి. తమిళనాడులో ఉన్న 39 సీట్లు 60కి పెరుగుతాయి. కేంద్రం తీసుకొస్తానంటున్న డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకే కాకుండా ఉత్తరాదిలోని పంజాబ్ రాష్ట్రాలకూ నష్టం జరుగుతుంది. యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి బిమారీ రాష్ట్రాలకు మాత్రమే ఈ డీలిమిటేషన్‌తో లబ్ధి చేకూరుతుంది’’ అని అన్నారు రేవంత్.