తిరుమల వివాదానికి ‘ఆజ్యం’పోస్తున్న బీజేపీ

తెలంగాణాలోని గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్, హైదరాబాదు ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన మాధవీలత తమ ఇష్టంవచ్చినట్లు ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు.

Update: 2024-09-26 09:28 GMT
Raja singh and Madhavi latha

తిరుమల శ్రీవారి దేవాలయం వివాదానికి బీజేపీ నేతలు యథాశక్తి ఆజ్యంపోస్తున్నారు. తెలంగాణాలోని గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్, హైదరాబాదు ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన మాధవీలత తమ ఇష్టంవచ్చినట్లు ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి టార్గట్ గా వీళ్ళిద్దరు ఆరోపణలతో రెచ్చిపోయారు. ఆరోపణలు, విమర్శలు సరిపోవన్నట్లుగా మాధవీలత తన మద్దతుదారులతో తిరుమల శ్రీవారి దర్శనంకు బయలుదేరారు. మాధవి మాటలు చూస్తుంటే శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం తిరుమలకు చేరుకుంటున్న జగన్ను అడ్డుకోవటం లాగే అనుమానాలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం జగన్ తిరుమలకు చేరుకుంటుంటే మాధవి తన మద్దతుదారులతో గురువారం రాత్రే తిరుమలకు చేరుకుంటున్నారు.

విచిత్రం ఏమిటంటే వీళ్ళిద్దరు జగన్ వల్ల తిరుమల శ్రీవారి దేవాలయంతో పాటు లడ్డూ, అన్నప్రసాదాలు అపవిత్రం అయిపోయాయని తీర్పిచ్చేయటం. లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడటంతో పాటు జంతుకొవ్వును కలిపి భక్తులకు పంపిణీ చేసినట్లు చంద్రబాబునాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు ఆరోపణలను టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు బలంగా జనాల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లోనే జగన్ వల్ల తిరుమల శ్రీవారి దేవాలయానికి అపచారం జరిగిపోయిందనే ముద్రేసేశారు.

ఇదే విషయమై రాజాసింగ్ మాట్లాడుతు అధికారంలో ఉన్నపుడు తిరుమల శ్రీవారి దేవాలయాన్ని అపవిత్రం చేసిన జగన్ కు ఇపుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఘోరమైన పాపంచేసి ఇపుడు తిరుమల దేవాలయానికి వెళ్ళటానికి సిగ్గుందా అని మండిపోయారు. జగన్ కనిపిస్తే చింపేయాలన్న కసితో తెలుగు ప్రజలున్నట్లు చెప్పారు. ఇంతే కాకుండా జగన్ కు వ్యతిరేకింగా రాజాసింగ్ తన నోటికొచ్చినట్లు మాట్లాడేశారు.

మాధవీలత మాట్లాడుతు తిరుమల దేవాలయానికి జగన్ ఘోరమైన అపచారం చేసినట్లు ఆరోపించారు. కలియుగ వైకుంఠంగా పిలుచుకునే తిరుమలలో అకృత్యాలు జరగటం దురదృష్టమన్నారు. కల్తీనెయ్యి, జంతుకొవ్వుతో శ్రీవారి ప్రసాదం కలుషితం కావటం ధౌర్భాగ్యమని మండిపోయారు. జరిగిన పాపానికి ప్రాయశ్చితంగానే తాను మద్దతుదారులతో తిరుమల శ్రీవారి దర్శనంకు వెళుతున్నట్లు ఆమె చెప్పారు. తిరుపతి చేరుకుని అలిపిరి నుండి తిరుమలకు కాలినడకన చేరుకుంటామన్నారు.

ఒకవైపేమో కొందరు ప్రముఖులు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని వివాదంచేసి హిందువుల మనోభావాలను గాయపరచద్దని చెబుతున్నారు. తప్పు జరిగుంటే దాన్ని సరిచేయమని సూచిస్తున్నారు. తప్పుచేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాని కల్తీజరిగిందనే అనుమానాలతో, ఆరోపణలతో శ్రీవారిని, ప్రసాదాలను వివాదాస్పదం చేయద్దని మొత్తుకుంటున్నారు. అయితే వీళ్ళ మొత్తుకోళ్ళని ఏమాత్రం లెక్కచేయకుండా టీడీపీ, జనసేన నేతల బాటలోనే బీజేపీ నేతలు కూడా వీలైనంత వివాదాస్పదం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే శ్రీవారి ప్రసాదాల విషయంలో ఏపీ బీజేపీ నేతలు పెద్దగా స్పందించకపోయినా తెలంగాణాలోని రాజాసింగ్, మాధవీలత లాంటి నేతలు పదేపదే రెచ్చిపోతున్నారు.

Tags:    

Similar News