బేకరీ పేరులో ‘కరాచి’ ఉండటమే తప్పయిపోయిందా ?

యుద్ధం నేపధ్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పదేపదే కరాచి బేకరీపైన దాడులు చేస్తున్నారు.;

Update: 2025-05-12 07:32 GMT
BJP leaders attacked Karachi Bakery

పేరులో ఏముంది అని చాలామంది అంటుంటారు. కాని పేరులోనే అంతా ఉంది లేకపోతే పేరులోనే చాలావుంది అన్న విషయం అర్ధమవుతోంది. ఇపుడిదంతా ఎందుకంటే ఇండియా-పాకిస్తాన్ మధ్య ‘ఆపరేషన్ సిందూర్’ ఉద్రిక్తతలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. యుద్ధ(India-Pakistan War) నేపధ్యంలో రెండుదేశాల ప్రజల్లోను భావోద్వేగాలు పొంగుకొస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ లోని ఒక పాపులర్ బేకరీపైన పదేపదే బీజేపీ నేతలు దాడులుచేస్తున్నారు. ఎందుకు బీజేపీ నేతలు దాడులుచేస్తున్నారంటే బేకరీ పేరులో కరాచి అని ఉండటమే తప్పయిపోయింది. హైదరాబాదులో కరాచి బేకరీ(Karachi Bakery) చాలా పాపులర్. యుద్ధం నేపధ్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పదేపదే కరాచి బేకరీపైన దాడులు చేస్తున్నారు. ఎందుకంటే బేకరీకి కరాచి అనే పేరుండటమే పాపమైపోయింది.

పాకిస్తాన్ లోని కరాచి అనే పేరుతో హైదరాబాదు(Hyderabad)లో బేకరీకి కరాచి అనే పేరుండకూడదని బీజేపీ నేతలు యజమానికి వార్నింగ్ ఇచ్చారు. మనదేశంలో పాకిస్తాన్(Pakistan) లోని కరాచి పేరుతో బేకరీ ఉండటం ఏమిటంటు కమలంపార్టీ నేతలు విచిత్రమైన వాదనకు దిగారు యజమానులతో. వాగ్వాదం పెట్టుకోవటమే కాకుండా బేకరీ అద్దాలు, ఫర్నీచర్ ను ధ్వంసంచేసేశారు. ఒక్కసారిగా పెద్దగుంపుగా బీజేపీ నేతలు, కార్యకర్తలు మీదపడటంతో బేకరీలోని జనాలంతా భయపడిపోయారు. కొందరు బీజేపీనేతలు కర్రలతో అద్దాలను, ఫర్నీచర్, బేకరీ నేమ్ బోర్డుపై దాడిచేసి ధ్వంసంచేసేశారు. తాము ముస్లింలము కాము, బేకరీ ముస్లింలది కాదు మహాప్రభో అని యాజమానులు మొత్తుకుంటున్నా బీజేపీ నేతలు వినిపించుకోవటంలేదు.

శనివారం బేకరీపైన జరిగిన దాడితో యాజమానులు భయపడిపోతున్నారు. నాలుగురోజుల క్రితం కూడా అబిడ్స్ లోని బేకరీతో పాటు విశాఖపట్నంలోని బేకరీపైన కూడా దాడులు జరిగాయి. శనివారం శంషాబాదులోని కరాచి బేకరీపైన మరోసారి బీజేపీ నేతలు దాడులు చేయగా వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సర్దిచెప్పి పంపేశారు. పోలీసులు వచ్చేలోగానే నేతలు, కార్యకర్తలు బేకరి ఫర్నీచర్, అద్దాలు, నేమ్ బోర్డును ధ్వంసంచేసేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరాచిబేకరీ ముస్లింలది కాదు, పాకస్తాన్ కు సంబందించిన వాళ్ళది అంతకన్నా కాదన్న విషయం బీజేపీ నేతలకు బాగాతెలుసు. అయినా సరే యుద్ధం నేపధ్యంలో పాకిస్తాన్ మీదున్న కోపాన్ని కొందరు కరాచిబేకరీపైన ఉద్దేశ్యపూర్వకంగానే చూపిస్తున్నారు.

1953లో హైదరాబాద్ లో తమ ముత్తాత కాన్ చంద్ రమ్నాని కరాచిబేకరీ పేరుతో బేకరీని స్ధాపించినట్లు యజమాని చెబుతున్నారు. తాము ముస్లింలము కామని, సింధీలమని మొత్తుకంటున్నాడు. దేశవిభజన తర్వాత 1953లో తమ పూర్వీకులు పాకిస్తాన్ లోని కరాచి నుండి ఇండియాకు వచ్చేసినట్లు చెప్పాడు. తమ ముత్తాత హైదరాబాదుకు వచ్చి కరాచి బేకరీని ఏర్పాటు చేశారన్నారు. పాకిస్తాన్ లోని కరాచిలో ఉండేవారు కాబట్టి ఆ అనుబంధంతోనే బేకరీకి కరాచి అనే పేరు పెట్టుకున్నట్లు యజమాని చెప్పాడు. యజమాని చెప్పిన విషయాలన్నీ బీజేపీ నేతలకు బాగా తెలిసినా కావాలనే టార్గెట్ చేసి పదేపదే దాడులు చేస్తున్నారు. వెంటనే బేకరీ పేరును మార్చకపోతే మళ్ళీ దాడులుచేస్తామని బీజేపీ నేతలు హెచ్చరించటమే ఆశ్చర్యంగా ఉంది. ఇదే విషయాన్ని శంషాబాద్ పోలీసు సీఐ బాలరాజ్ మాట్లాడుతు కొందరు బీజేపీ నేతలు కరాచి బేకరీపైన దాడులు చేసినట్లు చెప్పారు. గొడవ పెద్దది కాకుండా తాము ఆందోళనకారులకు సర్దిచెప్పి పంపించేశామన్నారు. కరాచి బేకరీ అనే పేరు కనబడకుండా నల్లని బట్టను కప్పేయటంతో గొడవ సద్దుమణిగినట్లు సీఐ చెప్పారు.

విద్వేషాలు రెచ్చగొట్టవద్దు : సీతక్క

మంత్రి సీతక్క మాట్లాడుతు కరాచి బేకరీపై దాడులు అన్యాయమన్నారు. కరాచి బేకరి అనే పేరున్నంత మాత్రాన బేకరీపైన బీజేపీనేతలు, కార్యకర్తలు దాడులుచేయటం ఏమిటని మంత్రిప్రశ్నించారు. రాజకీయ లబ్దికోసం విద్వేషాలను రెచ్చగొట్టడం తగదని బీజేపీ నేతలకు మంత్రి సూచించారు. నరేంద్రమోడి, అమిత్ షా సొంతరాష్ట్రం గుజరాత్ లోనే కరాచి బేకరి ఉన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. చాలారాష్ట్రాల్లో కరాచిబేకరీ పేరుతోనే యజమానులు బేకరీని నిర్వహిస్తున్నట్లు సీతక్క(Minister Seetakka) చెప్పారు. ఎక్కడా జరగని గొడవలు హైదరాబాదులో మాత్రమే జరుగుతున్నాయంటే కేవలం రాజకీయ ప్రేరేపితమని అర్ధమవుతున్నట్లు మంత్రి సీతక్క మండిపడ్డారు.

Tags:    

Similar News