నాలుగో స్థానానికి పడిపోయిన బీఆర్ఎస్

జాతీయ రాజకీయాల్లో మాదే బిగ్ రోల్ అంటూ భింకాలు పోయిన కేసీఆర్ కి లోక్ సభ ఫలితాలు తలెత్తుకోలేని పరాభవం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాలుగో స్థానానికి పడిపోయింది.

Update: 2024-06-06 10:55 GMT

తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టి అధికారం నిలబఎత్తుకుంటామని ధీమాగా ఉంది. కానీ 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు సాధించి కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. 64 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఓట్ పర్సెంటేజ్ 39.40 ఉండగా బీఆర్ఎస్ ఓట్ పర్సెంటేజ్ 37.35 పాలైంది. ఓడినా గౌరవప్రదమైన స్థానాలు, ఓట్ పర్సెంటేజ్ తెచుకోగలిగింది. కానీ ఆరు నెలలు తిరిగేసరికి అంతా తారుమారైంది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరాతిఘోరంగా ఓటమి చవిచూసింది. ఇది జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతాం, మాదే బిగ్ రోల్ అంటూ భింకాలు పోయిన కేసీఆర్ కి తలెత్తుకోలేని పరాభవం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఒక్క స్థానంలో పోటీ చేసి గెలిచిన ఎంఐఎం కంటే బీఆర్ఎస్ పరిస్థితి దిగజారడం పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యంపై బలమైన దెబ్బ. 

నాలుగో స్థానానికి బీఆర్ఎస్ 

బీఆర్ఎస్ కి అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు రాగా... లోక్ సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే ఆధిక్యం పొందగలిగింది. అవి కూడా మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోవే కావడం గమనార్హం. ఆఖరికి మజ్లిస్ కూడా పోటీ చేసిన ఒక్క హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ సాధించి పట్టు నిలబెట్టుకోగా, బీఆర్ఎస్ మాత్రం మూడు స్థానాల్లోనే మెజారిటీ దక్కించుకుంది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీల పరంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ నాలుగో స్థానానికి పడిపోయింది. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక సెగ్మెంట్లలో మాత్రమే బీఆర్ఎస్ మెజార్టీ సాధించింది.

కేసీఆర్ ప్రాతి నిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 1,11,648 ఓట్లు రాగా లోక్ సభ ఎన్నికల్లో 85,432 ఓట్లే వచ్చాయి. 26,216 ఓట్లు తగ్గినా గులాబీ పార్టీకే ఆధిక్యం లభించింది. హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 1,05,514 లోక్ సభ ఎన్నికల్లో 65,501 ఓట్లు వచ్చాయి. 40,013 ఓట్లు తగ్గినప్పటికీ బీఆర్ఎస్ కే ఆధిక్యం వచ్చింది. కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాకలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 97,879 ఓట్లు వస్తే ఇప్పుడు 66,714 ఓట్లు వచ్చాయి. అయినా బీఆర్ఎస్ కే ఆధిక్యం లభించింది. 

Tags:    

Similar News