‘రేవంత్ పగటి కలలు కనడం మానుకో’

డైవర్షన్ పాలిటిక్స్ తప్ప తెలంగాణకు రేవంత్ రెడ్డి ఏం చేశాడని నిలదీసిన బీఆర్ఎస్ నేత.;

Update: 2025-07-20 08:36 GMT

‘పదేళ్లు నేనే సీఎం’ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన మాటలను ప్రతిపక్ష నేతలతో పాటు కొందరు సొంత పార్టీ నేతలు కూడా తీవ్రంగా తప్పుబడుతున్నారు. కాగా తాజాగా రేవంత్ మాటలపై మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణ రెడ్డి ఘాటుగా స్పందించారు. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ పగటి కలలు కంటున్నారంటూ చురకలంటించారు. ఇప్పటికయినా పగటి కలలు కనడం పాని పాలనపై దృష్టి పెట్టంటూ హితవు పలికారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప ఇంకేం చేశావో చెప్పాలి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని ప్రజలందరికీ కష్టాలు మొదలయ్యాయని, రైతన్నలు కన్నీటి సేద్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా దొరక్క రైతులు నానా అవస్థలు పడుతుంటే.. ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చింది తప్పితే.. వారి సమస్యల పరిష్కారం కోసం ఏం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘రైతుల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికయినా దృష్టి సారించాలి. లేనిపక్షంలో వారి తరుపున మేము రోడ్డెక్కుతాం. రైతులను మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఇప్పటి వరకు వరంగల్ రైతు డిక్లరేషన్‌ ఊసే ఎత్తెడం లేదు. ప్రభుత్వం చేతకాని తనాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. హామీల అమలేదని నిలదీస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏ సమావేశం, సభకు హాజరైనా కేసీఆర్, కేటీఆర్‌లను నానా మాటలు అని ప్రజల దృష్టిని మళ్లించడమే రేవంత్ ప్రధాన అజెండా అవుతోంది. కేసీఆర్ నామస్మరణ లేకుండా ఆయన ఏ సభను ముగించరు. రేవంత్‌కు పాలనపై రవ్వంత అనుభవం కూడా లేదు. పది సంవత్సరాలు సీఎంగా ఉంటానని చెప్పడానికి రేవంత్ ఎవరు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారు. రేవంత్ రెడ్డి పగటికలలు కనడం మానుకోవాలి. రాష్ట్రంలో వర్షపాతంపై అసలు రివ్యూ చేశారా?’ అని గండ్ర ప్రశ్నించారు.

Tags:    

Similar News