‘కేసీఆర్ అరెస్ట్‌పై నాకు భయం లేదు’

భయపడితే నాయకులం కాలేమన్న కేటీఆర్.;

Update: 2025-09-15 08:51 GMT

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. అందుకోసం అంతా కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమలు కాని కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను ప్రజలకు గుర్తు చేయాలని అన్నారు. ప్రచారంలో ఓటర్లతో ముచ్చట పెట్టాలని, వారి కష్టాలను తెలుసుకుని, వారిని కాంగ్రెస్ పెడుతున్న కష్టాలను వివరించాలని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ సిగ్మంట్‌కు చెందిన పార్టీ కేడర్‌తో కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. రానున్న ఉపఎన్నికలో పార్టీ సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలో ఓటర్లకు వివరించాలని, అదే విధంగా హామీల పేరుతో కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని కూడా ప్రజలకు అవగతం అయ్యేలా చెప్పాలని తెలిపారు.

ఎన్నో కేసులు పెట్టింది కాంగ్రెస్..

‘‘గతంలో పీజేఆర్, కేసీఆర్, గోపినాథ్ కొట్లాడినట్లు ఉపఎన్నికల్లో కొట్లాడాలి. భయపడితే నాయకులం కాలేం. నాపై కాంగ్రెస్ సర్కార్ ఎన్నో కేసులు పెట్టింది. కేసీఆర్ అరెస్ట్ అవుతారని కూడా ప్రచారం చేసింది. ఆ విషయంలో నేను భయపడను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. మీ ఇళ్లు కూల్చడానికి మీరే లైసెన్స్ ఇచ్చినట్లు అవుతుందని హెచ్చరించారు. హైడ్రా పేరు మీద సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వేల ఇళ్లు కూలగొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు వ్యతిరేకంగా పని చేయటమే ఇందిరమ్మ రాజ్యమా? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ సెగ్మెంట్‌లో బీఆర్ఎస్‌ పార్టీలో పంచాయితీలు ఉన్న మాట వాస్తవం. అవన్నీ మైక్ ముందు చెప్తే బాగోదు’’ అని అన్నారు కేటీఆర్.

రేవంత్ లాంటి సీఎంను ఎన్నడూ చూడలే..

‘‘పంచాయితీలు ఏమైనా ఉంటే మీ నాయకులు విష్ణువర్థన్ రెడ్డి, సుధీర్ రెడ్డి సమక్షంలో పరిష్కరించుకోవాలి. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని అడిగితే.. తనను కోసుకుని తినమని రేవంత్ అంటున్నారు. ఇలాంటి సీఎంని నేను ఎన్నడూ చూడలేదు. ఎన్నికలప్పుడు ప్రజల్లో తిరిగే కాంగ్రెసోళ్లు.. ఎన్నికలు ముగిశాక కనుచూపుమేరలో ఎక్కడా కనిపించరు. కేసులకు భయపడొద్దు.. కార్యకర్తలను బీఆర్ఎస్ ఎప్పుడూ వదులుకోదు’’ అని కేడర్‌ను ఉద్దేశించి కేటీఆర్ తెలిపారు.

Tags:    

Similar News