యూపీ రాజకీయాల్లో తెలంగాణ ఆడపడుచు సత్తా చాటేనా?

తెలంగాణకి చెందిన ఓ మహిళ కూడా యూపీ రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. ఈ విషయం ఇప్పుడు తెలంగాణలో ఆసక్తిగా మారింది.

Update: 2024-04-20 04:55 GMT
Source: Twitter

తెలుగు రాష్ట్రాలకి చెందిన కొందరు హీరోయిన్లు ఇతర రాష్ట్రాలకి చెందిన ప్రముఖుల్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. వీరిలో కొంతమంది అత్తింటి వారి సొంత రాష్ట్రాల నుండే రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. జయప్రద, సుమలత వంటి అలనాటి హీరోయిన్లే దీనికి ఉదాహరణ. అయితే నటీమణులే కాదు.. తెలంగాణకి చెందిన ఓ మహిళ కూడా యూపీ రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. ఈ విషయం ఇప్పుడు తెలంగాణలో ఆసక్తిగా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణ నల్గొండ జిల్లాకి చెందిన శ్రీకళారెడ్డి అనే మహిళ యూపీకి చెందిన ధనంజయ్ సింగ్ ని 2017 లో వివాహమాడారు. ధనంజయ్ కి శ్రీకళ మూడవ భార్య. మొదటి భార్య చనిపోవడంతో రెండవ భార్యని వివాహం చేసుకుని, కొన్నేళ్ళకి విడాకులిచ్చి శ్రీకళని పెళ్లి చేసుకున్నారు. ఈయన గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి పార్లమెంటు సభ్యుడిగా రాజకీయాల్లో రాణించారు.

గ్యాంగ్ స్టర్ గా కూడా ధనంజయ్ యూపీలో పాపులర్. 2024 వరకు ఆయనపై 41 కేసులు రికార్డ్ అవగా, 10 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మార్చి 2024లో, కిడ్నాప్, దోపిడీ కేసులో అతనికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడింది. ఈ కేసుల కారణంగానే తన భార్య శ్రీకళని లోక్ సభ బరిలోకి దించారు. ఆమె బీఎస్పీ తరపున జాన్ పూర్ సెగ్మెంట్ లో పోటీ చేయనున్నారు.

శ్రీకళ పుట్టింటి పొలిటికల్ బ్యాగ్రౌండ్..

శ్రీకళారెడ్డి తండ్రి నిప్పో బ్యాటరీ సంస్థ అధినేత జితేందర్ రెడ్డి. పారిశ్రామికవేత్తగానే కాదు, పొలిటీషియన్ గా కూడా పేరు సంపాదించుకున్నారు. ఆయన గతంలో హుజుర్ నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. శ్రీకళ తల్లి లలితా రెడ్డి గ్రామ సర్పంచ్ గా పని చేశారు.

శ్రీకళ ప్రాధమిక విద్య చెన్నైలో, హైదరాబాద్ లో బీకామ్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత పై చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేసిన తర్వాత ఇండియాకి వచ్చి కుటుంబ వ్యాపారాలపై ద్రుష్టి పెట్టారు. ధనంజయ్ తో పరిచయం పెళ్ళికి దారి తీసింది. ధనంజయ్ కి అప్పటికే రెండు పెళ్లిళ్లు కాగా శ్రీకళని మూడో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం 2017 లో పారిస్ లో జరగగా.. రిసెప్షన్ చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు సినిమా సెలెబ్రిటీలతో పాటు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.

శ్రీకళారెడ్డి మూడేళ్ల క్రితం ఉత్తర్‌ప్రదేశ్ లో జడ్పీ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఆర్థికంగా బలమైన కుటుంబం కావడంతో పాటు రాజకీయ నేపథ్యం ఉండటంతో బీఎస్పీ అధినేత్రి మాయావతి శ్రీకళారెడ్డికి టిక్కెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. భర్తకంటే ఆమె పేరిటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని సమాచారం. రూ.6.71 కోట్లకు పైగా చరాస్తులు, రూ.780 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.1.74 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నాయని ఆమె అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మరోవైపు ధనంజయ్‌కు రూ.5.31 కోట్ల స్థిరాస్తులు, రూ.3.56 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి.

యూపీ రాజకీయాల్లో అడుగుపెట్టిన తెలంగాణ ఆడపడుచు ఎంతవరకు సత్తా చాటగలరో జూన్ 4 న తెలియనుంది.

Tags:    

Similar News