ఓఆర్ఆర్ పై కారు ప్రమాదం

ఇన్ఫోసిస్ ఉద్యోగి సౌమ్యారెడ్డి మృతి... ఏడుగురికి తీవ్రగాయాలు;

Update: 2025-09-15 10:26 GMT

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేటలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి సౌమ్యారెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇన్ఫోసిస్ ఉద్యోగులు సరళ మైసమ్మ టెంపుల్ కి వెళ్లి వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద అంబర్ పేట వద్ద కారు అదుపు తప్పింది.బొంగుళూరు గేట్ నుంచి పోచమ్మ టెంపుల్ వైపు వెళుతుండగా ప్రమాదం సంభవించింది.

ఓఆర్‌ఆర్‌పై పల్టీలు కొట్టి కారు బోల్తా పడింది. అతి వేగం వల్లే కారు బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో నంద కిశోర్‌, వీరేంద్ర, ప్రనీష్‌, అరవింద్‌, సాగర్‌, ఝాన్సీ, శ్రుతి ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతురాలు సౌమ్యా రెడ్డి స్వస్థలం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఎనిమిది మంది ఒకే కారులో ప్రయాణించినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
Tags:    

Similar News