బీఆర్ఎస్ ఎంఎల్సీపై కేసు
హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామంలో జరిగిన కోడిపందేల నిర్వహణపై పోలీసులు ఎంఎల్సీపై కేసు నమోదుచేశారు;
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎంఎల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదుచేశారు. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామంలో జరిగిన కోడిపందేల నిర్వహణపై పోలీసులు ఎంఎల్సీపై కేసు నమోదుచేశారు. కేసునమోదుచేసిన పోలీసులు పోచంపల్లి(BRS MLC)కి నోటీసులు కూడా జారీచేశారు. నోటీసులు అందిన రోజు నుండి నాలుగురోజుల్లో విచారణకు హాజరుకావాలని అందులో స్పష్టంగా చెప్పారు. తొల్కట్ట గ్రామంలో ఎంఎల్సీకి 11 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. అందులో ఎంఎల్సీ(Pochampalli Srinivasula reddy) కోడిపందేల(Cock fight)తో పాటు క్యాసినో కూడా నడిపిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో రాజేంద్రనగర్ పోలీసులు ఒక్కసారిగా అర్ధరాత్రి తర్వాత దాడిచేయటంతో కోడిపందేల్లో పాల్గొంటున్న వాళ్ళల్లో 64మంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఇదే ఫామ్ హౌస్ లో రెండేళ్ళుగా కోళ్ళపందేలు, క్యాసినో(Casino) నడుస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పందేలు నిర్వహిస్తున్న భూపతిరాజు, శివకుమార్ కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోచంపల్లిని పోలీసులు ఏ1గా చూపించారు. పోచంపల్లిపై సెక్షన్-3, గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసులు నమోదుచేశారు. ఫామ్ హౌస్ ను శివకుమార్ వర్మ లీజుకు తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల దాడిలో రు. 30 లక్షల నగదు, కోటిరూపాయలు విలువచేసే క్యాసినో కాయిన్లు, 55 లగ్జరీ కార్లు, 86 పందెంకోళ్ళు, పందెంకోళ్ళకు కట్టే 46 కత్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కోళ్ళపందేల్లో టీడీపీకి చెందిన కొందరు ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వాళ్ళు ఎవరన్న విషయం మాత్రం బయటకురాలేదు.