Hyderabad Blast: సిగాచి యాజమాన్యంపై కేసు నమోదు
105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు;
By : ఎంకె ఫజల్
Update: 2025-07-01 16:41 GMT
పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ ఫిర్యాదు మేరకు పరిశ్రమ యాజమాన్యం సిగాచిపై బీడీఎల్ భానూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందగా, 33 మంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరో వైపు ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ దారుణ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం చిదంబరం షణ్ముఖానాథన్, సర్వేశ్వర్ రెడ్డి, వివేక్ కుమార్, ఓరుగంటి సుబ్బిరామి రెడ్డి, గుంతక ధనలక్ష్మి, అమిత్ రాజ్ సిన్హా, రవీంద్ర ప్రసాద్ సిన్హా, బిందు వినోదాన్ పై హత్యగా పరిగణింపబడని (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ) కేసు నమోదు చెయ్యాలంటూ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామా రావు ఇమ్మానేని పిటిషన్ వేశారు.
సిగాచి కెమికల్స్ ఘటనలో మృతుల కుటుంబాలకు 25, 00, 000 (25 లక్షలు) చొప్పున పరిహారం చెల్లించే విధంగా సిగాచి యాజమాన్యాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. అదే విధంగా ఈ ప్రమాదంలో గాయపడ్డ కార్మికులకు 10, 00, 000 (రూ.10 లక్షలు) చొప్పున పరిహారం చెల్లించాలని ఇమ్మానేని రామారావు కోరారు. రాష్ట్ర కార్మికులు, ఉపాధి కల్పన, కర్మాగారాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ ను ప్రతివాదిగా పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కంపెనీలు, కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలపై తనిఖీలు చేపట్టడానికి ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది రామా రావు ఇమ్మానేని తన పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సంఖ్య 15315/IN/2025 గా నమోదు చేసింది. దీనిపై త్వరలో ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) కూడా సుమోటోగా కేసు నమోదు చేసింది. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, జులై 30వ తేదీలోగా నివేదిక సమర్పించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్, కార్మిక శాఖ కమిషనర్, అగ్నిమాపక శాఖ డీజీ, జిల్లా ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇదే ఘటనపై న్యాయవాది కుమారస్వామి సైతం రాష్ట్ర హెచ్‌ఆర్‌సీకి మరో ఫిర్యాదు చేశారు. పరిశ్రమలో పాత యంత్రాలను వినియోగించడం, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడమే ప్రమాదానికి ప్రధాన కారణాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిగాచి కెమికల్ పరిశ్రమ యాజమాన్యంపైనా, సంబంధిత అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.