కాళేశ్వరంపై విచారణ బాధ్యత సీబీఐకు...సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.;

Update: 2025-09-01 00:48 GMT
అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపే బాధ్యతను దేశంలోనే అత్యుతన్న దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకు అప్పగించాలని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్ నివేదికపై శాసనసభలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత తదుపరి విచారణకు ఈ మొత్తం వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు శాసనసభలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రకటించారు.


జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ నివేదిక
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, అవినీతి ఆరోపణలపై విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను నియమించింది.దీనిపై విచారణ కమిషన్ తన నివేదికను జులై 31, 2025 వ తేదీన ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 4, 2025 వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశం ఆ నివేదికను ఆమోదించింది. తదుపరి చర్చ కోసం నివేదికను శాసనసభ ముందు ఉంచాలని నిర్ణయించింది. ఆ మేరకు ఈ అంశంపై శాసనసభలో చర్చ జరిగింది.

కాళేశ్వరంపై క్రిమినల్ చర్యలు
జస్టిస్ ఘోష్ కమిషన్ తన నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్థావించింది. మూడు బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చిచెప్పింది.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక ప్రకారం మేడిగడ్డ నిర్మాణ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యతా నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ, విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి.

సీబీఐకు ఎందుకు అప్పగిస్తున్నామంటే...
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్ రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్రాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్‌లో, వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఫీఎఫ్ సీ ,ఆర్ ఈ సీ వంటి ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కి అప్పగించడం సముచితమని, అందుకే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ శాసనసభ నిర్ణయం తీసుకుంటున్నదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఎన్నో రకాలైన అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండటం వల్ల సీబీఐ విచారణకు ఆదేశించాలని నిర్ణయించడం జరిగింది. నిజాయితీతో కూడిన విచారణ జరగాలని కోరుకుంటున్నాం’’అని కమిషన్‌ నివేదికపై చర్చకు సమాధానంగా ముఖ్యమంత్రి చెప్పారు.

అసెంబ్లీలో ఘోష్ విచారణ కమిషన్ నివేదిక
అంతకుముందు జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్ నివేదికను నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభ ముందుంచారు. అనంతరం స్పీకర్ అనుమతి మేరకు మంత్రి స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు.తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలాన్ని మార్చడం నుంచి మేడిగడ్డ స్పీయర్స్ కుంగిపోయిన పరిణామాల వరకు, తదనంతరం జస్టిస్ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ నియామకం వరకు వివరాలను సభలో తెలిపారు.చర్చపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ, ఘోష్ కమిషన్ ఏర్పాటు నేపథ్యం, కమిషన్ సమర్పించిన 665 పేజీల నివేదికలోని సారాంశాన్ని, జరిగిన చర్చ వివరాలను ప్రస్థావించారు.నివేదికల్లో అనేక అంశాలతో మల్టిపుల్ కాంప్లికేషన్స్ తో ముడిపడి ఉన్నందున ఎలాంటి శషభిషలకు తావులేకుండా ఒక స్పష్టమైన, నిర్ధిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలనుకున్న ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్టు సీఎం తెలిపారు.


Tags:    

Similar News