చంద్రబాబు 'సిట్'ని కేంద్రం నమ్మలేదా? అందుకేనా ఆ ప్రతిపాదన?

తిరుమల తిరుపతి లడ్డూ వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను కేంద్రం విశ్వసించలేదా? అందుకేనా ఆ ప్రతిపాదన?

Update: 2024-10-05 04:47 GMT

తిరుమల తిరుపతి లడ్డూ వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను కేంద్రం విశ్వసించలేదా? అందుకే ప్రత్యామ్నాయ ప్రతిపాదన చేసిందా? తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వివాదమై సుప్రీంకోర్టు అక్టోబర్ 4 శుక్రవారం ఇచ్చిన తీర్పు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న చర్చ ఇది. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ వివాదంపై దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రతివాదులుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను చేర్చారు. అందరికీ నోటీసులు వెళ్లాయి. సుప్రీంకోర్టులో అన్ని పక్షాల లాయర్లు హోరాహోరీ వాదనలు వినిపించారు.

జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారించింది. సెప్టెంబర్ 18న ఎన్డీఏ శాసనసభ్యుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ- వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో గొడ్డు కొవ్వు, చేపనూనె కలిసిన నెయ్యిని వాడారన్నారు. దీంతో మొదలైన వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ధర్మాసనం "ఆరోపణలు, ప్రత్యారోపణల జోలికి మేం వెళ్లం. ...కోర్టును రాజకీయ యుద్ధభూమిగా ఉపయోగించుకోవడానికి మేము అనుమతించం" అని స్పష్టం చేస్తూ ఐదుగురితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు జరిపించేందుకు ఆదేశాలు ఇచ్చింది.
సుప్రీంకోర్టులో తొలిసారి సెప్టెంబర్ 30న విచారణ జరిగినపుడు ధర్మాసనంలోని న్యాయమూర్తులు చంద్రబాబు ఆరోపణలను తప్పుబట్టింది. బాధ్యత గలిగిన వ్యక్తి కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకోవాల్సింది కదా అని ప్రశ్నించింది. ఇంత విస్తృతమైన వ్యవహారాన్ని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సరిపోతుందా? అని ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండంటూ ఘాటుగానే వ్యాఖ్యానించింది.
అక్టోబర్ 3న తిరిగి విచారణ ప్రారంభమైనపుడు కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తనకు మరో 24 గంటలు సమయం కావాలని కోరారు. దీంతో సుప్రీంకోర్టు ఆ కేసుపై తీర్పును అక్టోబర్ 4 శుక్రవారానికి వాయిదా వేసింది.
కోర్టులో శుక్రవారం విచారణ ప్రారంభమైన తర్వాత టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి న్యాయవాది కపిల్ సిబల్, టీటీడీ తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా, రాష్ట్రప్రభుత్వం తరఫున రామమోహనరావు, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును కొనసాగించాలా లేక దర్యాప్తును స్వతంత్ర సంస్థకు బదిలీ చేయాలా అనే విషయాన్ని ధృవీకరించండి, కేంద్ర ప్రభుత్వ వాదన ఏమిటని-సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అడిగింది.
దానికి మెహతా బెంచ్‌తో ఇలా అన్నారు: “శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడారన్న చంద్రబాబు ఆరోపణలో ఏదైనా వాస్తవం ఉన్నట్లయితే, అది ఆమోదయోగ్యం కాదు… భక్తులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. ఆహార భద్రతా చట్టం కూడా ఇమిడి ఉంది... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సెట్ సభ్యులకు వ్యతిరేకంగా నేను ఏమీ కనుగొనలేదు. వారు ఆ పని చేయడానికి సమర్థులు, అర్హులు. అయితే సిట్ సభ్యుల కంటే సీనియర్లయిన కేంద్ర ప్రభుత్వ పోలీసు దళానికి చెందిన కొందరు సీనియర్ అధికారులు వారిని (ఏపీ రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులను) పర్యవేక్షించాలి. అఖిల భారత దృక్పథంతో పాటు ఆహార భద్రత చట్టం కూడా ఇందులో ఇమిడి ఉంది. అది విశ్వాసాన్ని ప్రేరేపిస్తుంది. దర్యాప్తు చురుగ్గా కొనసాగుతుందని నేను భావిస్తున్నాను..."
తుషార్ మెహతా అభిప్రాయం విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ పర్యవేక్షించే ఈ ప్రత్యేక బృందంలో సీబీఐ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సీనియర్ అధికారి ఒకరు ఉంటారు.
రాజకీయ విశ్లేషకుల భావన ఏమిటంటే..
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన టీమ్ స్థానంలో ఈ బృందం ఉంటుంది. సుప్రీం ఉత్తర్వుతో ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ అస్థిత్వంలో ఉండదు. "దేవుడిపై విశ్వాసం ఉన్న కోట్లాది మంది ప్రజల భావాలను నివృత్తి చేయడానికి మాత్రమే" ఈ కొత్త దర్యాప్తు బృందం అని సుప్రీంకోర్టు చెబుతున్నా ఇప్పటికే పని ప్రారంభించి రెండు రోజుల పాటు హడావిడి చేసి సేకరించిన సమాచారం ఇప్పుడు ఎందుకూ కొరగాకుండా పోతుందనేది అందరికీ తెలిసిందే అన్నారు సామాజిక విశ్లేషకుడు ఎం.శేషగిరిరావు.

తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వ న్యాయవాది. ఆయన కోర్టుకు చెప్పిన ప్రతి మాటా కేంద్రప్రభుత్వం మాటే. చంద్రబాబు నియమించిన సిట్ పై నమ్మకం ఉందంటూనే దానిపై కేంద్ర దర్యాప్తు సంస్థ పర్యవేక్షణ ఉండాలని తుపార్ మెహతా చెప్పారు. "అంటే చంద్రబాబు సిట్ పై నమ్మకం లేదని పరోక్షంగా చెప్పడమే. ఆ దర్యాప్తు బృందం స్థానంలో మరొకటి వస్తుంది. అందులో వీళ్లు ఉండవచ్చు లేదా కొత్తవారిని పెట్టుకోవచ్చు. మొత్తంగా చూసినపుడు కేంద్రం తీరు పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిన చందంగా ఉందన్నది" పేరు రాయడానికి ఇష్టపడని ఓ న్యాయవాది అభిప్రాయం. అటు చంద్రబాబు ఇటు వైఎస్ జగన్ జుట్టు ఇప్పుడు కేంద్రం చేతికి అందింది. సీబీఐ పర్యవేక్షణ అంటే కేంద్రం చెప్పినట్టు నడుచుకోవడమే అనే అభిప్రాయం ఉండనే ఉంది. జగన్ తో వైరం కొనితెచ్చుకునే కంటే చంద్రబాబునే అదుపులో ఉంచితే సరిపోతుందనే ధోరణే కేంద్ర ప్రభుత్వ వాదనలో కనిపించింది.
"రాజ్యసభలో వైసీపీ బలం 11 నుంచి 8కి తగ్గినా.. కేంద్ర ప్రభుత్వం మున్ముందు తెచ్చే ఏ బిల్లులు పాస్ కావాలన్న వైసీపీ సభ్యుల మద్దతు అనివార్యం. జగన్ పై ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. కేంద్రాన్ని తూలనాడే పరిస్థితి ఉండదు. చంద్రబాబు అలా కాదు. 2018లో ప్రధానికే సవాల్ విసిరి ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి సీబీఐని తన రాష్ట్రంలోకి రానివ్వనని భీష్మించి జీవో తెచ్చిన వాడు. 2024నాటికి తన అదే మోదీతో, బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. మోదీకి కూడా చంద్రబాబు బలం కావాల్సి వచ్చింది. మద్దతు ఇస్తున్నాం కదా అని తోక ఆడించే పరిస్థితి రాకుండా ఉండాలంటే చంద్రబాబు జుట్టు కూడా తమ చేతిలో ఉంచుకోవాలి. అందుకు ఈ కేసు పనికి వస్తుంది. చంద్రబాబు ఆరోపణల్లో నిజం లేదంటే ముఖ్యమంత్రి హోదాలో ఆయన అబద్ధం చెప్పినట్టు అవుతుంది. నిజం ఉందంటే వైఎస్ జగన్ ను నొప్పించినట్టవుతుంది. అందుకని సీబీఐ పర్యవేక్షణలో నడిచే దర్యాప్తు బృందాన్ని నియమిస్తే అది కొన్నేళ్ళ పాటు సాగుతుంది. అవసరమైనపుడు అస్త్రంగా వాడుకోవడానికి పనికి వస్తుంది" అని సీపీఐ నాయకుడు శ్రీధర్ బాబు అన్నారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి కాలపరిమితంటూ లేదు. కోర్టు కూడా ఇంత సమయం లోపల పూర్తి చేయాలని చెప్పలేదు. అందువల్ల తుది నివేదిక ఎప్పుడు వస్తుందో ఊహించడం కష్టం. "సిట్టూ లేదు బొట్టూ లేదని " వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందుకే అన్నారేమో అనే అనుమానాన్ని కూడా శ్రీధర్ వ్యక్తం చేశారు.
Tags:    

Similar News