‘న్యాయం అంటే శిక్షలు విధించడమే కాదు’

బాధితుల జీవితానికి భరోసా కల్పించడం కూడా న్యాయంలో భాగమేనని సీఎం రేవంత్ అన్నారు.;

Update: 2025-07-05 07:10 GMT

న్యాయం కోర్టుల్లో జరుగుతుందని, కానీ రక్షణ మాత్రం ప్రతి దశలోనూ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పిల్లలు, మహిళల రక్షణకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, వారి రక్షణే తమకు ప్రాధాన్యం అని వెల్లడించారు. పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించడం, బాలల హక్కులపై చర్చించడం కోసం ‘వాయిస్ ఫర్ ద వాయిస్ లెస్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్నా రేవంత్ రెడ్డి.. పిల్లలు, మహిళల రక్షణ అంశాన్ని తమ ప్రభుత్వం కలలో కూడా మరువలేదని, వారికి భద్రత కల్పించడానికి అధికారులు, అధికార యంత్రాంగం రాత్రింబవళ్లు శ్రమిస్తోందని వ్యాఖ్యానించారు. ఇటువంటి నేరాలను నియంత్రించడమే కాదని, బాధితులకు చట్టపరంగా అన్ని రకాలుగా రక్షణ కల్పించాలని చెప్పారు.

‘‘వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్ అనే థీమ్ తో… తమ బాధను చెప్పుకోలేని వారికి రక్షణ కల్పించేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఎంతో కీలకమైన అంశంపై సదస్సు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసు, ఇతర నిర్వహకులను అభినందిస్తున్నా. ఇలాంటి నేరాలను నియంత్రించడమే కాకుండా బాల బాధితులకు చట్టపరమైన అన్ని రకాల రక్షణ కల్పించాల్సి ఉంది. లైంగిక వేధింపుల నుంచి అన్ని రకాలుగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వం పిల్లలు, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. బాలికల సంరక్షణ కోసం తెలంగాణ “భరోసా” ప్రాజెక్టును తీసుకొచ్చింది. అనుసంధానంగా 29 కేంద్రాలు పనిచేస్తున్నాయి’’ అని వెల్లడించారు.

‘‘ఈ కేంద్రాల ద్వారా పోలీసు సహాయమే కాకుండా న్యాయ పరమైన సహాయం, వైద్య సహాయం, కౌన్సెలింగ్‌ వంటి సేవలను అందిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భరోసా కేంద్రం ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కేసులను వేగవంతంగా పరిష్కరించడమే కాకుండా పిల్లలకు సంపూర్ణ రక్షణ, వారిలో విశ్వాసం, అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడం ఈ కేంద్రాల లక్ష్యం. పోక్సో చట్టం, జ్యువెనైల్ చట్టాలు మన ప్రగతిశీల సాధనాలుగా పనిచేస్తున్నాయి. అయితే ఆచరణలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ చట్టాలు బాధితులకు ఎలాంటి హాని కలిగించకుండా, వారి భవిష్యత్తుకు రక్షణగా సంపూర్ణ సహాయకారిగా ఉండాలి’’ అని తెలిపారు.

‘‘సోషల్ మీడియా ద్వారా పిల్లలపై జరిగే దురాగతాలు, దుర్వినియోగం చేస్తున్న వారి పట్ల ఎలాంటి కరుణ చూపకుండా దోషుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. న్యాయం కేవలం కోర్టుల్లోనే కాకుండా ప్రతి దశలోనూ రక్షణ ఉండాలి. పోలీస్ స్టేషన్, బాలల సంక్షేమ కేంద్రాలతో అన్ని ప్రక్రియల ద్వారా పిల్లలకు న్యాయం దక్కాలి. రక్షణ కల్పించాలి. గౌరవ న్యాయమూర్తులు, పోలీసు అధికారులు బాలల సంక్షేమ కమిటీలు, ఇతర అభివృద్ధి భాగస్వామ్య సభ్యులందరికీ... విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి విషయాల్లో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం. న్యాయమంటే కేవలం శిక్షలు విధించడం వరకే కాదు. బాధితుల జీవితానికి భరోసా కల్పించాలి. వారికి అవసరమైన రక్షణ, సమాజంలో తగిన గౌరవం కల్పించేలా చర్యలు తీసుకుని వారి బాల్యాన్ని తిరిగి పొందేలా చర్యలు ఉండాలి’’ అని చెప్పారు.

Tags:    

Similar News