సిగాచి మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం -సీఎం రేవంత్
పాశమైలారం సిగాచి కంపెనీలో ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపిన సీఎం;
By : V V S Krishna Kumar
Update: 2025-07-01 07:33 GMT
పరిశ్రమలలో భద్రతా లోపాలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.పాశమైలారం సిగాచి కంపెనీలో ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు.ప్రమాద ఘటన తనను కలిచి వేసిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
మృతుల కుటుంబాలకు రూ .కోటి పరిహారం
సిగాచి కంపెనీ ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా వుంటుందని సీఎం హామీ ఇచ్చారు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు పరిహారం గా అందజేస్తామన్నారు. తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు ౧౦ లక్షల రూపాయలు, కొద్దిగా గాయపడిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం వుంటుందన్నారు. మంత్రులు, అధికారులు దగ్గరుండి సహాయక చర్యలు చేపడుతున్నారన్న సీఎం ,బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుంటుందన్నారు.కంపెనీ యాజమాన్యం కూడా పరిహారం ఇవ్వాలని ఆదేశించామన్నారు.పరిశ్రమల్లో భద్రత విషయంలో యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రమాదం జరిగిన తరువాత కూడా సిగాచి కంపెనీ యాజమాన్యం ఇక్కడికి రాకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని సీఎం తెలిపారు.
గాయపడి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అధికారులు చికిత్స అందేలా చూస్తున్నారని సీఎం తెలిపారు. కంపెనీలో ప్రమాదం ఎలా జరిగింది, ఎవరి నిర్లక్ష్యం అయినా వుందా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోందన్నారు. ఇంతటి ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాల చరిత్రలో జరగలేదని , బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.