హైకోర్టులో సీఎం రేవంత్ పిటిషన్
పార్లమెంటు ఎన్నికల సమయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకెక్కిన బీజేపీ నేత. ఆ కేసును కొట్టేయాలంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి పిటిషన్.;
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. హైకోర్టును ఆశ్రయించారు. తనపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రస్తుతం విచారణలో ఉన్న కేసు కొట్టేయాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కూడా కోరారు. కాగా ఆయన పిటిషన్‌పై గురువారం విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గతేడాది పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ బీజేపీ అధికారంలోకి రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తుందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేతలు అప్పట్లోనే తీవ్రంగా ఖండించారు.
కాగా రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు.. ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లను బీజేపీ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రసంగం ఆడియో, వీడియో క్లిప్పింగ్‌లను సైతం కాసం వెంకటేశ్వర్లు.. కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి ఇప్పుడు పిటిషన్ దాఖలు చేశారు.