బతుకమ్మ కుంటను ప్రారంభించిన సీఎం
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని హామీ.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన నిర్మించిన బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భూకబ్జాలకు గురవుతున్న బతుకమ్మ కుంటను హైడ్రా స్వాధీనం చేసుకుని పునఃనిర్మించింది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఈ కుంటను సీఎం రేవంత్ రెడ్డి.. పలువురు నేతలు, అధికారులతో కలిసి ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం బతుకమ్మ కుంటను ప్రజలకు అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆడబిడ్డలను మన సంతోషంలో భాగస్వాములను చేసినప్పుడే బతుకమ్మ పండుగ నిండుదనం. వీ హనుమంతరావు తన జీవితాశయంగా బతుకమ్మ కుంట కోసం పోరాడారు’’ అని గుర్తు చేశారు.
‘‘హైడ్రా ఏర్పాటు చేసినపుడు కొంతమందికి అర్థం కాలేదు.. కొంతమంది అర్థమైనా కబ్జాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. చాలా మంది మాపై చాలా విమర్శలు చేశారు. ఒడిదుడుకులు వచ్చినపుడు సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటూ వెళ్లాలి. కోవిడ్ తరువాత వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. మన వ్యవస్థ 2 సెంటీమీటర్ల వర్షాన్ని తట్టుకునేందుకు మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయి. కానీ ప్రస్తుతం ఒకేసారి కుంభవృష్టి కురుస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితులను ముందుగానే అంచనావేసి పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందించుకున్నాం’’ అని చెప్పారు.
‘‘ఒకప్పుడు జీవధారగా ఉన్న మూసీ ఇప్పుడు మురికి కూపంగా మారింది. చెరువులను విడిపించడం, నాలాలను విస్తరించడం, మూసీ పునరుజ్జీవనం చేయడం మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా మూసీపునరుజ్జీవానికి కలిసి రావాలి. కొంత మందికి పేదరికం ఎక్స్ కర్షన్ లాంటిది.. కానీ మాకు అలా కాదు. పేదరికం విలువ ఏమిటో నాకు తెలుసు. వర్షం వస్తే గంటలో మూసీ పరివాహక కాలనీలు జలమయం అవుతున్నాయి. భవిష్యత్ లో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా మనం అభివృద్ధి చేసుకోవాలి’’ అని అన్నారు.
‘‘అంబర్ పేట మూసీ పరివాహక ప్రాంతాల పేదలకు పునరావాసం కల్పించేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మా మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆదేశిస్తున్నా. రాజకీయాలకు అతీతంగా అంబర్ పేటను అభివృద్ధి చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తాం. పేదలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మాయగాళ్లు మహానగరంలో చాలామంది ఉంటారు. వాళ్ల ముఠా నాయకుడు ఇంకొకరు ఉండొచ్చు. మాయమాటలు చెప్పి ప్రభుత్వ భూములను అగ్గువ సగ్గువకు అమ్మితే కొనకండి’’ అని సూచించారు.
‘‘మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజలెవరినీ మేం కష్టపెట్టం.. మా పేదలకు అండగా నిలబడుతుంది. బతుకమ్మ కుంటకు వి.హనుమంతరావు పేరు పెట్టాలని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సూచించారు. వారి సూచన మేరకు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా. ఆనాడు హనుమంతరావు గారి సూచన మేరకే ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా మార్చాం. ఆయన గౌరవానికి భంగం కలగకుండా వారి సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకెళ్తాం’’ అని చెప్పారు.