‘మెట్రో పాలిటన్ సిటీస్‌లో బతకలేని పరిస్థితి’
నాలాలకు ఆక్రమించి ఇళ్లు కడితే వరద నీళ్లు ఎక్కడికి వెళ్తాయి? అని రేవంత్ ప్రశ్నించారు.;
హైడ్రా పోలీస్ స్టేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఒక మంచి ఆలోచనతో హైడ్రాను తీసుకొచ్చినట్లు చెప్పారు. హైడ్రా అధికారులను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని మెట్రో పాలిటన్ సిటీస్‌లో జీవించలేని పరిస్థితులు ఉన్నాయని, అలాంటివి హైదరాబాద్‌లో రాకూడదనే హైడ్రాను స్థాపించామని వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ బుద్ధబవన్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్‌ను స్టార్ట్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ‘‘దేశ ప్రజలు స్వీకరించిన రాజ్యాంగాన్ని 100కుపైగా సవరణలు చేశాం. ప్రపంచంలో ఒక బలమైన దేశంగా ఎదిగేందుకు రాజ్యాంగం నిరూపించింది. పరిపాలనలో అవసరమైన మార్పులు తీసుకురావాలని పాలకులుగా నేను ఆలోచించా’’ అని చెప్పారు.
‘‘చాలా మంది ముఖ్యమంత్రులుగా విధులు నిర్వహించి చట్టాలు చేశారు, అవసరమైన సవరణలు చేశారు. ఆనాటి వరదలు నిజాంను కలిచివేసింది. వరదలను నివారించడానికి నిజాం మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో జంట జలాశయాలను నిర్మించారు. హైదరాబాద్ లో గొప్పగొప్ప నిర్మాణాలు నిజాం పాలనకు నిదర్శనం. మన పూర్వీకులు అందించిన వాటిని వదిలేసి కొత్త ప్రాంతాల వైపు వెళ్తున్నాం. ఓల్డ్ సిటీతో మనకు సంబంధం లేనట్లు వ్యవహారిస్తున్నారు. ఓల్డ్ సిటీ అంటే ఒరిజినల్ సిటీ. అధికారులు, శాఖల మధ్య సమన్వయ లోపం ఉంది, అందుకే ఇబ్బందులు తలెత్తుతున్నాయి’’ అని చెప్పారు.
‘‘శాఖల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తుంటే ఆశించిన ఫలితాలు రాలేదు. బెంగళూరు ప్రకృతి పరంగా చాలా గొప్పగా ఉంటుంది. వాన నీటిని ఒడిసిపట్టుకోకపోవడం వల్ల బెంగళూరులో వలసపోయే పరిస్థితి వచ్చింది. ముంబయి, దిల్లీలో ప్రకృతిని పరిరక్షించుకోకపోవడం వల్ల పార్లమెంటు నుంచి పాఠశాలల వరకు సెలవులు ఇవ్వాల్సి వచ్చింది. ఇది ప్రకృతి తప్పిదం కాదు మానవ తప్పిదం. ఉపద్రవం ముందు పాఠం నేర్చుకోకపోతే హైదరాబాద్ కు ఆ పరిస్థితి వస్తుంది. హైడ్రా అంటే పేదల ఇళ్లను కూల్చుతుందని కొంతమంది చిత్రీకరిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
‘‘హైడ్రా అంటే కూల్చడమే కాదు, ఆస్తుల రక్షణ, విపత్తుల నిర్వహణ కూడా. వర్షాలకు ఇళ్లల్లోకి నీళ్లొచ్చి ప్రజలు కట్టుబట్టలతో మిగిలారు. అప్పుడు 10 వేలు ఇస్తామన్నారు, 10 లక్షల ఆస్తి పోతే కన్నీరు మున్నీరుగా విలపించారు. కొందరు రాజకీయ అధికారాన్ని అడ్డంపెట్టుకొని పేదలకు అడ్డంగా గోడలు కట్టి ఇబ్బందిపెడుతున్నారు. నగరంలో చెరువులు, నాలాలు కబ్జాలకు గురయ్యాయి. లేక్ వ్యూ పేరుతో నడి చెరువులో ఇళ్లు కడుతున్నారు. నాలాలకు ఆక్రమించి ఇళ్లు కడితే వరద నీళ్లు ఎక్కడికి వెళ్తాయి. పాతికేళ్లుగా సాధించని బతుకమ్మకుంటను సాధించాం. చెరువులను మేం కాపాడటం తప్పా..?’’ అని ప్రశ్నించారు.
‘‘మూసీలో ఆక్రమణలు, చెరువులు, నాలాలను ఆక్రమించుకున్న వాళ్లకే హైడ్రా అంటే భయం. నగరంలో పని మీద వచ్చిన వాళ్లు గంటల తరబడి సమయం వృథా అవుతుంది. హైడ్రా విషయంలో కొంంతమంది కడుపుమంటతో దూషిస్తున్నారు, అవన్నీ నేను పట్టించుకోను. మూసీ నది ఉండటం మన నగరానికి వరం. సబర్మతి, యమునా నదులను పునరుద్దరిస్తే తప్పులేదు. మూసీ నదిని పునరుద్దరించుకుంటే తప్పేంటీ. మూసీ నది, చెరువులు, నాలాల ఆక్రమణల చేస్తుంటే రియల్ ఎస్టేట్ పడిపోతుందంటున్నారు. 400 ఎకరాల్లో ఒక పెద్ద ఐటీ కంపెనీ పెడుదామంటే ప్రకృతిని దెబ్బతీస్తున్నారంటున్నారు’’ అని అన్నారు.
‘‘రియల్ ఎస్టేట్ ఎలా పెరుగుతుందో చెప్పండి. ప్రైవేటు కంపెనీతో సుప్రీంకోర్టులో కొట్లాడి 400 ఎకరాలను సాధించాను. పేదవాడు మూసీలోనే బతకాలా మీరేమో విశాలమైన భవనాల్లో బతుకుతారు, పేదలు మూసీలోనే బతకాలా. మోదీ చేస్తే గొప్ప ... తెలంగాణ ప్రభుత్వం చేస్తే తప్పా..? మూసీ నది పరివాహక ప్రజలతో త్వరలోనే ఆత్మీయ సమ్మేళం. మూసీ నదిలో ఐదు కిలోమీటర్లకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి అపార్ట్ మెంట్లు కట్టి అక్కడి వాళ్లకు మంచి జీవితాలు ఇద్దాం. వారసత్వ సంపద కాపాడుకోవాలి. హైడ్రా మానవీయ కోణంలో వ్యవహారించాలి. పేదలను, పెద్దలను ఒకేలా కట్టొద్దు. పేదలకు ప్రత్యమ్నం చూపించాలి
పెద్దల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చిన వినొద్దు, ముఖ్యమంత్రిగా నేను మీ వెనుకున్నా’’ అని భరోసా ఇచ్చారు.