తెలంగాణపై చలిపంజా,ప్రబలుతున్న ఫ్లూ..అలర్ట్ జారీ

తెలంగాణలో వీస్తున్న చలి గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి.కనిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు తక్కువగా నమోదవడంతో ఫ్లూ ప్రబలుతోంది.

Update: 2024-11-21 11:39 GMT

తెలంగాణ రాష్ట్రంలో గురువారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గడంతో పలు జిల్లాల్లో ఫ్లూ వ్యాధులు ప్రబలుతున్నాయి. కాలానుగుణ ఫ్లూ,ఇన్ఫ్లుఎంజా వంటి అంటువ్యాధులు ప్రబలడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగుల రద్దీ పెరిగింది. ఫ్లూ ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ బి రవీంద్రనాయక్ సూచించారు.


చలిగాలుల అలర్ట్
తెలంగాణలో వైద్యఆరోగ్యశాఖ చలిగాలుల అలర్ట్ ప్రకటించింది.కనిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నప్పుడు శీతల తరంగాలు వీస్తున్నాయి.తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం పొగమంచు కురుస్తోంది.రాష్ట్రంలోనే అత్యల్పంగా మెదక్ జిల్లాలో గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 12.0 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రామగుండంలో గురువారం 14.5 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలోనూ 12.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. హకీంపేట, దిండిగల్, హైదరాబాద్ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 15.7 డిగ్రీలకు తగ్గింది. హన్మకొండ, నిజామాబాద్ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి ప్రజలను వణికిస్తోంది.

మరో నాలుగు రోజుల పాటు చలిగాలులు
తెలంగాణ రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం మరో నాలుగు రోజుల పాటు ఉండవచ్చని హైదరాబాద్ భారత వాతావరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తెలంగాణ అంతటా మరో నాలుగు రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఆయన అంచనా వేశారు.

పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆరోగ్య సలహా
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉన్నందున కొన్ని జిల్లాల్లో తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తికి దారితీయవచ్చని తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ బి రవీంద్రనాయక్ హెచ్చరించారు.

ఫ్లూ లక్షణాలు
ఇన్ఫ్లుఎంజా వైరస్ లక్షణాలు తీవ్రమైన జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శరీరనొప్పులు, అలసట ఉంటుంది. దగ్గు లేదా తుమ్మినప్పుడు వ్యక్తుల మధ్య ఇన్ఫ్లుఎంజా వ్యాధి సులభంగా వ్యాపిస్తుంది.కాలానుగుణ ఫ్లూ ఉన్న వ్యక్తులు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని, ద్రవపదార్థాలు పుష్కలంగా తాగాలని వైద్యులు సూచించారు.ఫ్లూ వ్యాధి సోకినప్పుడు గర్భిణీ స్త్రీలు, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి.

వైద్యుల హెచ్చరిక
ఫ్లూ వల్ల అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం లేదా పెదవుల నీలం రంగు, కఫంలో రక్తం లేదా ప్రవర్తన మారినవారు వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచించారు.
- ఫ్లూ సోకిన వారు మీ నోరు, ముక్కును రుమాలు లేదా టిష్యూ పేపర్‌తో కప్పుకోవాలి.
- ఫ్లూ సోకిన రోగులు చేతులను తరచుగా సబ్బు, నీటితో కడగాలి.
- కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకడం మానుకోవాలి.
- రద్దీగా ఉండే ప్రదేశాల్లో తిరగొద్దు.జ్వరం, దగ్గు, తుమ్ములు ఉంటే బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండండి.
- నీరు పుష్కలంగా తాగండి, పౌష్టికాహారం తినండి.



Tags:    

Similar News