తెలంగాణ అభివృద్ధికి రాహుల్ గాంధీ మేధావుల కమిటీ
తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించేందుకు 8 మంది మేధావులతో సలహా కమిటీని సర్కారు నియమించింది.పేదరికాన్ని తగ్గించడానికి ఈ కమిటీ సలహాలు ఇవ్వనుంది.;
కాంగ్రెస్ పార్టీకి అంత్యంత కీలకమైన తెలంగాణను ఒక మోడల్ స్టేట్ గా మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మధ్య ‘గుజరాత్ మోడల్’ అని ఎలా ప్రచారం చేసుకున్నారో, తెలంగాణ మోడల్ తయారు చేసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగాలనుకుంటుంది. దీని కోసమే మొన్న కులగణనను పూర్తి చేశారు. ఇపుడు సాంఘీక న్యాయం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను మేధావులతో చర్చించి తెలంగాణకు ఒక విధానం రూపొందించాాలనుకుంటున్నారు. దీనికోసమే రాహుల్ గాంధీ సూచనల ప్రకారం దేశంలో వివిధ రంగాల్లో గణనీయమైన కృషి చేసిన మేధావులను ఏర్చి కూర్చి ఒక సలహా కమిటీని నియమించారు. దాని పేరు తెలంగాణ అభివృద్ధి ప్లానింగ్ సొసైటీ సలహా కమిటీని నియమిస్తూ (Telangana Development Planning Society:TGDPS) తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక శాఖ జీఓఎంఎస్ నంబరు 2 ను జారీ చేసింది.
ఎనిమిది మంది సీనియర్ ప్రొఫెసర్లు, మేధావులను తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సంఘం సలహా కమిటీలో సభ్యులుగా నియమించారు.
దేశంలోని రాష్ట్రాల్లో ఇలాంటి మేధావుల సలహా కమిటీ ఏర్పాటు కావడం గతంలో ఎపుడూ జరగలేదు. మేధావులతో కమిషన్లు వేసి నివేదికలు తెప్పించుకున్నారు తప్ప, ఇలా విశాల ధ్యేయంతో కమిటీ వేయడం ఇదే ప్రథమం. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం కమిటీ విపత్తుల నివారణ ప్రణాళికలను (preparation of disaster mitigation plans) ఈ కమిటీ తయారు చేస్తుంది. వాతావరణ మార్పుల వల్ల వస్తున్న పరిణామాలను (Analyze climate change impacts) విశ్లేషిస్తుంది. అభివృద్ధిలో ఉన్న లొసుగులను( conduct gap and growth analysis) అధ్యయనం చేస్తుంది. పథకాల కోసం పైలట్ ప్రాజెక్టులను (Pilot Projects) చేపడుతుంది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక రంగాల మీద పరిశోధనలు జరిపి సామాజిక న్యాయం అమలు చేసేందుకు(Research in State’s economic and social sectors) నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తుంది.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ సలహా కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు.
ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రొఫెసర్ శాంతా సిన్హా,ప్రొఫెసర్ హిమాన్షు,డాక్టర్ సుఖదేవ్ థోరట్, నిఖిల్ దే,ప్రవీణ్ చక్రవర్తి,ప్రొఫెసర్ భాంగ్యా భూక్యా, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సభ్యులుగా తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సంఘం సలహా కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
రాష్ట్రప్రభుత్వం వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ముందు తెలంగాణలోని మేధావులను సంప్రదించి, వారి అమూల్యమైన సలహాలు స్వీకరించాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. ప్రొఫెసర్ కంచ ఐలయ్య సాంఘిక న్యాయం కోసం పోరాడుతున్న బహుజన వాది. వై ఐ యామ్ నాట్ ఎ హిందూ (Why I Am Not a Hindu: A Sudra critique of Hindutva philosophy, culture and political economy (1996). పుస్తకంలో ఆయన ప్రఖ్యాతి చెందారు. బఫెలో నేషనలిజం (Buffalo Nationalism: A Critique of Spiritual Fascism), పోస్టు హిందూ ఇండియా (Post-Hindu India: A Discourse in Dalit-Bahujan Socio-Spiritual and Scientific Revolution) వంటి పుస్తకాలు రాశారు.
ప్రొఫెసర్ భాంగ్యా భూక్యా పేరున్న చరిత్రకారుడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ చరిత్రవిభాగంలో ప్రొఫెసర్. ఎ హిస్టరీ ఆఫ్ దక్కన్ గోండ్స్ ( A history of the Deccan Gonds) ఎ హిస్టరీ మాడ్రన్ తెలంగాణ ( History of Modern Telangana) ఎ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ ( A Cultural History of Telangana) పుస్తకాలను రాశారు.
ప్రొఫెసర్ థోరాట్ ప్రముఖ ఆర్థిక వేత్త, గతంలో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చెయిర్మన్ గా పనిచేశారు. ప్రవీణ్ చక్రవర్తి కాంగ్రె స్ పార్టీ డేటా ఎనలిటిక్స్ (Data Analytics) హెడ్. ప్రొఫెసర్ శాంతా సిన్హా బాల కార్మిక రంగంలో పని చేస్తువస్తున్నారు.2003లో రామన్ మెగసెసే అవార్డును అందుకున్నారు. ఎంవి ఫౌండేషన్ సంస్థాపకురాలు.
- ప్రొఫెసరుగా, విద్యావేత్తగా, పర్యావరణ వేత్తగా, సామాజిక కార్యకర్తగా కె పురుషోత్తం రెడ్డి తెలంగాణలో పేరొందారు. విద్యావేత్తగా ఎందరో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ప్రొఫెసర్ పర్యావరణ సమస్యల పరిష్కారానికి పోరాటం చేశారు.
ఈ కమిటీలోని మరొక ప్రొఫెసర్ హిమాన్షు.