కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ ను వాయించేస్తున్నాయా ?

బీఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాయా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది చూస్తున్న వాళ్ళకి నిజమే అనిపిస్తోంది.

Update: 2024-04-26 06:00 GMT

బీఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాయా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది చూస్తున్న వాళ్ళకి నిజమే అనిపిస్తోంది. రెండుపార్టీలు బీఆర్ఎస్ ను దెబ్బమీద దెబ్బతీస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ కారుపార్టీలోని నేతలను వీలైనంతలో రెండుపార్టీలు లాగేసుకుంటున్నాయి. ఒకపుడు కాంగ్రెస్, బీజేపీలను దెబ్బకొట్టేందుకు కేసీయార్ ఏ పద్దతిని అయితే అనుసరించారో ఇపుడు పై రెండుపార్టీలు అవే పద్దతులను అనుసరిస్తు బీఆర్ఎస్ ను ఖాళీచేయించే పనిలోపడ్డాయి. ఇపుడు విషయం ఏమిటంటే బీఆర్ఎస్ సీనియర్ నేత, వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ లో చేరారు. ఈమె బీసీ సామాజికవర్గానికి చెందిన నేత. ఇప్పటికే ఇలాంటి నేతలు చాలామంది కాంగ్రెస్ లో చేరారు. పై రెండుపార్టీలు టార్గెట్ పెట్టి మరీ బీఆర్ఎస్ ను ఎందుకు దెబ్బకొడుతున్నాయంటే ఇపుడు పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు లక్ష్యంతోనే కాదు. తొందరలోనే జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కారుపార్టీని సాంతం దెబ్బతీయటమే అసలు లక్ష్యంగా పనిచేస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ కు చెందిన సుమారు 25 మంది మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్ కు జై కొట్టారు. దాంతో 25 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఈమధ్యనే కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఇంకా మెజారిటి కార్పొరేటర్లు కారుదిగలేదు. పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ కారుపార్టీలో నుండి వలసలు బాగా ఊపందుకుంటున్నాయి. ఇపుడు కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటు అభ్యర్ధులుగా సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్ గిరి, మెదక్, వరంగల్ పార్లమెంటు స్ధానాల్లో పోటీచేస్తున్న దానం నాగేందర్, రంజిత్ రెడ్డి, పట్నం సునీతా మహేందర్ రెడ్డి, నీలంమధు, కడియం కావ్య బీఆర్ఎస్ లో నుండి వచ్చినవారే.

అలాగే బీజేపీ తరపున జహీరాబాద్ స్ధానంలో పోటీచేస్తున్న బీబీ పాటిల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ బీజేపీలోకి మారి తన కొడుకు భరత్ ప్రసాద్ కు టికెట్ ఇప్పించుకున్నారు. మహబూబాబాద్ ఎంపీగా బీజేపీ తరపున పోటీచేస్తున్న సీతారామ్ నాయక్ ఇంతకుముందు బీఆర్ఎస్ ఎంపీగా పనిచేశారు. వర్ధన్నపేటకు రెండుసార్లు ఎంఎల్ఏగా పనిచేసిన కారుపార్టీ నేత ఆరూరి రమేష్ ఇపుడు బీజేపీలోకి మారి వరంగల్ ఎంపీగా పోటీచేస్తున్నారు. హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఎంఎల్ఏగా పనిచేసిన శానంపూడి సైదిరెడ్డి బీజేపీలోకి మారి భువనగిరి ఎంపీగా పోటీలో ఉన్నారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కారుపార్టీ నేతలను లాక్కోవటంపైనే టార్గెట్ పెట్టాయి. పార్లమెంటు ఎన్నికలు ముగిసేలోగా బీఆర్ఎస్ ను ఎంతవీలుంటే అంత బలహీనపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. పార్టీలో నుండి వలసలు పెరిగిపోతున్నకొద్దీ కేసీయార్లో ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోతోంది. అందుకనే మీడియాలో అయినా బహిరంగసభలు, పార్టీ మీటింగుల్లో పార్టీని వదిలేసిన నేతలను నోటికొచ్చినట్లు తిడుతున్నారు. ఒకపుడు ఇలాంటి నేతలనే కాంగ్రెస్, టీడీపీలో నుండి లాక్కున్న విషయాన్ని కేసీయార్ మరచిపోయినట్లున్నారు. అధికారం ఎక్కడుంటే ఆ పార్టీలోకి, ఏ పార్టీ పదవి, టికెట్ ఇస్తే ఆ పార్టీలోకి జంప్ చేసే నేతలకు పార్టీల పట్ల లాయల్టీ ఎందుకుంటుంది ? ముందుముందు ఇంకెంతమంది నేతలు కారుపార్టీని వదిలేస్తారో చూడాలి.

Tags:    

Similar News