జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనంపై రాజుకున్న రగడ

కంటోన్మెంట్ ప్రజల కల సాకారం అయింది. ఈ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Update: 2024-06-30 13:30 GMT

కంటోన్మెంట్ ప్రజల కల సాకారం అయింది. ఈ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కేవలం తెలంగాణలోనే కాదు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ తోపాటు దేశంలోని అన్ని కంటోన్మెంట్‌లలో ఉన్న పౌర ప్రాంతాలను సమీప మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేసేందుకు కేంద్ర డిఫెన్స్ మినిస్ట్రీ శనివారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు డిఫెన్స్‌ ఏరియా డైరెక్టర్‌ జనరల్‌ ప్రతిపాదనలు, మంగళ, గురువారాల్లో రక్షణ శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన కీలక సమావేశ తీర్మానాలను.. శుక్రవారం ఆమోదిస్తూ.. అన్ని కంటోన్మెంట్ల సీఈవోలకు శనివారం సర్క్యులర్‌ (నంబర్‌ 8078) జారీ చేశారు. దీంతో.. జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ విలీనానికి కీలక అడుగు ముందుకుపడింది.


అయితే కంటోన్మెంట్ విలీనం విషయంలో రాజకీయ రగడ మొదలైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. మా ప్రయత్నాలు ఫలించాయని ఇరు పార్టీలు మోత మోగిస్తున్నాయి. ఆధారాలతో నిరూపించుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. కంటోన్మెంట్ విలీనం ఘనతను తమ ఖాతాలో వేసుకునేందుకు మాటల యుద్ధం చేసుకుంటున్నాయి. సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు, ఎన్ కౌంటర్లు ఇచ్చుకుంటున్నాయి.

రేవంత్ కృషి వల్లే... -కాంగ్రెస్

కాంగ్రెస్ ఏమంటోందంటే... "నగరం నలుమూలల అభివృద్ధి విషయంలో కంటోన్మెంట్‌ లోని రక్షణ శాఖ భూములు అడ్డంకిగా ఉంటున్నాయి. దీంతో ఈ అంశాన్ని ఢిల్లీ వెళ్లినప్పుడల్లా రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మార్చి 5న రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని స్వయంగా కలిసి కంటోన్మెంట్‌ అంశాన్ని తేల్చాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 25న రక్షణ శాఖ కార్యదర్శి వర్చువల్‌గా నిర్వహించిన కీలక సమావేశంలోనూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ‘‘విలీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని వివరించారు. ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి రక్షణశాఖ భూములను సేకరించడంలోనూ రేవంత్‌ ప్రత్యేక చొరవ చూపించారు. మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడే రేవంత్‌కు కంటోన్మెంట్‌ సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. సీఎం అయ్యాక కేంద్రంతో సంప్రదింపుల్లో వేగం పెంచారు. కేంద్రం కంటోన్మెంట్ల విలీనానికి ఆమోదం తెలపడం వెనక రేవంత్‌ రెడ్డి కృషి ఫలితమే అని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేనిది, కాంగ్రెస్ ఆరు నెలల్లో సాధించిందని ఆ పార్టీ శ్రేణులు కాలర్ ఎగరేస్తున్నారు.

మాది ఏడేళ్ల పోరాటం అంటోన్న బీఆర్ఎస్

"కంటోన్మెంట్ ప్రాంత విలీనం కోసం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించింది. కంటోన్మెంట్ ప్రజల చిరకాల స్వప్నం సాకారం చేయడానికి మంత్రి కేటీఆర్ అవిశ్రాంత పోరాటం చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కృషి చేసిందో… అప్పటి మంత్రి కంటోన్మెంట్ విలీనానికి ఎంత పట్టుదలతో పోరాటం చేసారో… కేటీఆర్ కలిసిన ఐదుగురు రక్షణ మంత్రులకు తెలుసు, రక్షణ శాఖ అధికారులకు తెలుసు, మంత్రి పలుమార్లు రాసిన లేఖలు ప్రచురించిన పత్రికలకు తెలుసు, కంటోన్మెంట్ ప్రజలకు తెలుసు, మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. వేరొకరి శ్రమ ఫలితాన్ని తమ ఖాతాలో వేసుకొనే పార్టీల కుసంస్కారం అందరికీ తెలుసు" అంటూ బీఆర్ఎస్ వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.

Tags:    

Similar News