RS Praveen | ‘కాళేశ్వరం కూలలేదు.. కూల్చేశారు’
రేవంత్ రెడ్డి చేతకాని తనం వల్ల తెలంగాణలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిందన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.;
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చుట్టూ భారీ కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రాజెక్ట్‌ను కూల్చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు కలిసి కాళేశ్వరాన్ని కూల్చివేశాయని ఆయన అన్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు కూడా ఈ పార్టీలే కారణమని, పేలుళ్ల వెనక రేవంత్, కిషన్, బండి సంజయ్ ఉన్నారని ఆరోపణలు గుప్పించారు. మేడిగడ్డ పిల్లర్ కుంగటంపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. 21 అక్టోబర్ 2023న రవికాంత్ అనే ఇంజినీర్ అసిస్టెంట్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ ఎందుకు జరగట్లేదు? పిల్లర్‌కు క్రాక్ ఎందుకు వచ్చిందో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌లో ఎందుకు లేదు? అని ప్రశ్నలు కురిపించారు. ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ప్రభుత్వం.. పీసీ ఘోష్ కమిషన్ వేసిందన్నారు. కిషన్ రెడ్డి ఆదేశాల వల్ల ఒక్క రోజులోనే ఎన్‌డీఎస్‌ఏ.. మేడిగడ్డకు వచ్చిందని చెప్పారు.
“కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చివేయడానికి పన్నాగం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ సహజంగానే కుంగిపోతే ఎలాంటి శబ్దాలు రావు. కానీ అక్కడ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి” అని ప్రవీణ్ పేర్కొన్నారు. అసాంఘిక శక్తులు ఎవరో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఫోన్ డేటాను చెక్ చేస్తే అసలు నిజాలు బయటపడతాయని ఆయన అన్నారు. ‘‘మేడిగడ్డ ప్రాంతంలో ప్రజలు పేలుళ్ల శబ్దాలు విన్నారని చెబుతున్నప్పటికీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఈ విషయంపై ఎందుకు స్పందించలేదు. ప్రజలు విన్న శబ్దాలపై NDSA ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు మౌనం పాటిస్తోంది?” అని విమర్శించారు.