‘రాజకీయ అవసరాలకు మాత్రమే ఈ బిల్లు’

బీసీలకు రిజర్వేషన్లను అనేవి 9వ షెడ్యూల్‌లో చేర్చితేనే పరిష్కారమవుతుందన్న మాజీ మంత్రి కేటీఆర్.;

Update: 2025-08-31 06:18 GMT

బీసీ రిజర్వేషన్లు అనేవి ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిందేమీ కాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలోనే బీసీలకు 34శాతం రిజర్వేషన్లు తీసుకురావాలని ప్రయత్నిస్తే కాంగ్రెస్‌‌కు చెందిన నేత హైకోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ముందు ఉంచింది. ఈ క్రమంలో జరిగిన చర్చల్లో కేటీఆర్ పలు కీలక అంశాలను లేవనెత్తారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. గతంలో ఆర్డినెన్స్, ఇప్పుడు బిల్లు రెండూ కూడా కంటితుడుపు చర్చలేనని అన్నారు. ఆర్డినెన్స్‌పై సంతకం చేయని గవర్నర్ ఇప్పుడు బిల్లుపై మాత్రం ఎలా సంతకం చేస్తారని ప్రశ్నించారు. అదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన చట్టమే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు అడ్డంకిగా మారిందని కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ బిల్లు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే కాంగ్రెస్ ప్రవేశపెట్టిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీసీ సబ్‌ప్లాన్ తేవాలి..

‘‘బీసీ బిల్లులో ఆర్థికపరమైన అంశాలు లేవు. న్యాయపరమైన చిక్కులు లేకుండా బిల్లును శాస్త్రీయంగా చేయాలి. అప్పుడు ఏ కోర్టు నుంచి సమస్యలు రావు. మా నేత గంగుల కమలాకర్ చెప్పింది కూడా అదే. బీసీల గురించి బీఆర్ఎస్ ఇప్పుడు కొత్తగా ఏం మాట్లాడటం లేదు. ఎప్పటి నుంచి బీసీలకు న్యాయం చేయాలని పోరాటం చేస్తోంది. 2004లో యూపీఏలో భాగస్వామిగా కేసీఆర్ మూడున్నర సంవత్సరాలు పనిచేశారు. 2004 డిసెంబర్ 17న కేసీఆర్ ఉమ్మడి ఏపీ నుంచి బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య ప్రతినిధి బృందాన్ని ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అపాయింట్‌మెంట్ తీసుకుని కృష్ణయ్యను తీసుకుని వెళ్లి ప్రధానిని కలిశారు. ఆనాడు కేంద్రంలో ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉండాలని కేసీఆర్ కోరారు. అప్పుడు అనుసంధానం చేసుకుని పనిచేస్తే బీసీలకు మేలు జరుగుతుందని తెలిపారు. పార్టీ పెట్టిన కొత్తల్లోనే కేసీఆర్.. బీసీ పాలసీని కూడా తీసుకొచ్చారు’’ అని కేటీఆర్ గుర్తు చేశారు.

తొలిసారి బీసీ స్పీకర్‌ను నియమించింది కేసీఆర్..

‘‘రాష్ట్రంలో స్పీకర్‌గా ఒక బీసీ నాయకుడికి అవకాశం కల్పించిన నేత కేసీఆర్. 2014లో మధుసూదనాచారికి అవకాశం కల్పించారు. అదే విధంగా మండ‌లిలో చైర్మ‌న్‌గా స్వామి గౌడ్‌ను ఎంపిక చేశారు. చ‌రిత్ర‌లో తొలిసారి బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన బీఎస్ ప్ర‌సాద్‌ను అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ చేశాం. ఇప్పుడు స‌భ‌లో కేసీఆర్ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్నారు.. మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత‌గా బీసీ నాయ‌కుడు మ‌ధుసూద‌నాచారి ఉన్నారు. డిప్యూటీ చైర్మ‌న్‌గా బండా ప్ర‌కాశ్ ఉన్నారు. బీసీ బిడ్డ‌ల‌కు ప‌ద‌వులు ఇచ్చి మా నిబ‌ద్ధ‌త చాటుకున్నాం’’ అని కేటీఆర్ తెలిపారు.

రెండు సార్లు తీర్మానం పంపాం..

‘‘బీసీ రిజర్వేషన్ల కోసం కేసీఆర్ హయాంలోనే రెండు సార్లు ఏకగ్రీవంగా తీర్మానాలు పంపాం. జన గణనతో పాటు కుల గణన కూడా చేయాలని ఒక తీర్మానంలో కోరాం. అదే విధంగా చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని మరో తీర్మానంలో కోరాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా కిర‌ణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో పంచాయ‌తీరాజ్, మున్సిప‌ల్ చ‌ట్టం తెచ్చారు. 50 శాతానికి రిజ‌ర్వేష‌న్లు మించ‌కూడ‌దు అని 2010లో రాజ్యాంగ ధ‌ర్మాస‌నం తీర్పు ఇచ్చింది. పార్ల‌మెంట్‌లో రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేస్తే అది చ‌ట్ట‌బ‌ద్ధం అవుతుంది. బీసీల‌కు న్యాయం చేయాల‌నుకుంటే.. పార్ల‌మెంట్‌లో కాంగ్రెస్, బీజేపీ త‌ల‌చుకుంటే జ‌రుగుతుంది. 9వ షెడ్యూల్‌లో చేర్చితేనే ప‌రిష్కారం అవుతుంది. ఇది సీఎం, మంత్రుల‌కు తెల్వ‌దు అనుకోవ‌డం లేదు. కానీ ఇరుక్కుపోయారు. కామారెడ్డిలో బీసీ డిక్ల‌రేష‌న్‌లో పెట్టిన‌ప్పుడు కేంద్రంలో అధికారంలోకి వ‌స్తే చేస్తామ‌ని చెప్పేది ఉండే. కానీ ఆరు నెల‌ల్లో చేస్తామ‌ని చెప్పారు. దాంతో బీసీ వ‌ర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News