‘వచ్చేది కాంగ్రెస్ డబుల్ ఇంజినే..’

త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే వస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Update: 2024-03-20 14:53 GMT
Source: Twitter

దేశమంతా ఎన్నికల నగారా మోగింది. 21 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది. అన్ని పార్టీలు కూడా తమ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన రాయికల్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశమంతటా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. రైతులు, నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే కేంద్రంలో కూడా యూపీఏ ప్రభుత్వమే రావాలని కోరారు.

యువత చేతుల్లోనే భవిష్యత్

దేశ భవిష్యత్తును నిర్ణయించేది దేశంలోని యువతేనని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులను రుణ విముక్తులని చేయడానికి యూసీఏ ప్రభుత్వం ఒకేసారి లక్ష రూపాయాల రుణమాఫీ చేసింది యూపీఏ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ‘‘దేశంలోని యువతకు ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి కల్పన చేయడం ప్రభుత్వం బాధ్యత. 2014 ఎన్నికల ప్రచారంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మరి బీజేపీ అధికారంలోకి వచ్చి పదేళ్లు గడిచాయి. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. బీజేపీ హయాంలో ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థలా మారిపోయింది. రైతులకు రుణమాఫీ ఇస్తే వారు సోమరిపోతులవుతారని బీజేపీ అంటోంది. కానీ అంబానీ, అదానీలకు లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తే వాళ్లు సోమరులు కారా’’అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయింది. కావున త్వరలో జరిగే ఎన్నికల్లో దేశమంతటా కాంగ్రెస్ విజయ దుందుబీ మోగిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావడం పక్కా అని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్, బీజేపీ పార్టీల కడుపు మండుతుంది

తెలంగాణలో గెలిచి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ అందిస్తున్న పాలన చూసి బీఆర్ఎస్, బీజేపీ పార్టీల కడుపు మండుతోందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు బీసీలు తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు. ‘‘మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్ గెలుపు కోసం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగింది. ఈటల రాజేందర్ గెలుపుకు సహకరించడానికే మల్కాజ్‌గిరీ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ ఓ డమ్మీ అభ్యర్థిని నిలబెడుతోంది’’అని వ్యాఖ్యానించారు. అనంతరం రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌లకు ఎప్పుడూ వ్యతిరేకమని, ఆ సంస్కృతి బీఆర్ఎస్, బీజేపీలదేనని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News