కేటీఆర్ గతం మరచిపోయారా ?

పదిమంది ఎంఎల్ఏలు(Defection MLAs) ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Rvanth)ని కలిసినపుడు మూడురంగుల కండువాలను కప్పుకున్న ఫొటోలను ట్విట్టర్ లో పోస్టుచేశారు;

Update: 2025-09-12 13:38 GMT
Revanth with alleged defection BRS MLAs

ఫిరాయింపులపై బీఆర్ఎస్ ప్రతిరోజు నానా గోలచేస్తోంది. తాజాగా అంటే శుక్రవారం ట్విట్టర్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) రెచ్చిపోయారు. బీఆర్ఎస్(BRS) నుండి కాంగ్రెస్ లోకి పదిమంది ఎంఎల్ఏలు ఫిరాయించారని మండిపడ్డారు. పదిమంది ఎంఎల్ఏలు(Defection MLAs) ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Rvanth)ని కలిసినపుడు మూడురంగుల కండువాలను కప్పుకున్న ఫొటోలను ట్విట్టర్ లో పోస్టుచేశారు. ఆపోస్టును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి పంపారు. ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్న రాహుల్ ఎంఎల్ఏ చోరీ గురించి ఏమంటారంటు నిలదీశారు. ఎంఎల్ఏల చోరీ ఓట్లచోరీ(Vote Theft)కన్నా తక్కువా అంటు రాహుల్ ను ప్రశ్నించారు.

ఇదంతా బాగానే ఉందికాని ఇక్కడే అందరిలో ఒక సందేహం వస్తోంది. అదేమిటంటే కేటీఆర్ గతాన్ని మరచిపోయారా అని. ఏమిటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్, టీడీపీల నుండి ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలను లాక్కున్న విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ, కాంగ్రెస్ నుండి 18 మంది ఎంఎల్ఏలు, 20మంది ఎంఎల్సీలు, నలుగురు ఎంపీలను పార్టీల ఫిరాయింపులకు కేసీఆర్ యధేచ్చగా ప్రోత్సహించారు. పార్టీ ఫిరాయింపులపై అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలు స్పీకర్లకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేసినా ఎలాంటి ఉపయోగాలు కనబడలేదు. దాంతో చేసేదిలేక పైరెండుపార్టీల ఎంఎల్ఏలు మాట్లాడకుండా కూర్చున్నారు.

కాలం ఎల్లకాలం ఒకేలాగ ఉండదన్న సూత్రాన్ని అప్పట్లో కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరచిపోయినట్లున్నారు. కాలం అందరి సరదాలను తీర్చేస్తుందన్నట్లుగా అయిపోయింది పరిస్ధితి. అప్పట్లో తాము ఏదైతే చేశామో ఇపుడు అవే పనులు కేసీఆర్, కేటీఆర్ కు ఎదురు తిరుగుతున్నాయి. అప్పట్లో యధేచ్చగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సాహించిన కేసీఆర్, కేటీఆర్ ఇపుడు అవే ఫిరాయింపుల దెబ్బకు నెత్తినోరు మొత్తుకుంటున్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన 10 మంది ఎంఎల్ఏల మీద అనర్హత వేటు పడాల్సిందే అని గోలగోల చేస్తున్నారు.

కేటీఆర్ వైఖరి అచ్చంగా గురివిందగింజను గుర్తుచేస్తోంది. ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామని అధికారంలో ఉన్నపుడు ఏకపక్షంగా చేసిన పనులన్నీ ఇపుడు ఎదురు తిరుగుతుండటాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. తాము అధికారంలో ఉన్నపుడు పార్టీల ఫిరాయింపులను ప్రోత్సహించకుండా ఉండుంటే ఇపుడు కేటీఆర్ వాదనకు బలం ఉండేది అనటంలో సందేహంలేదు. అధికారంలో ఉన్నపుడు ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఫిరాయింపులు తప్పని ధర్మపన్నాలు చెబితే ఎవరు పట్టించుకుంటారు ?

Tags:    

Similar News