సమావేశానికి సన్నద్ధం అవుతున్న తెంగాణ కేబినెట్
తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రివర్గం సమావేశానికి సన్నద్ధం అవుతోంది.;
తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రివర్గం సమావేశానికి సన్నద్ధం అవుతోంది. 5 జనవరి 2025న కేబినెట్ భేటీ జరగనుంది. ఇందులో రాష్ట్రంలో ఉన్న పలు కీలక సమస్యలు, అంశాలపై మంత్రివర్గం చర్చలు జరపనుంది. అనేక తీర్మానాల గురించి కూడా కేబినెట్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమావేశంలో రైతు భరోసారా, భూమిలేని పేదలకు నగదు, కొత్త రేషన్ కార్డులు, టూరిజం పాలసీ వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అసలు తెలంగాణలో ఎంత మంది రైతు భరోసా పథకానికి అర్హులు, రైతు భరోసా అందించడానికి ఎంత నిధులు కావాలి వంటి అనేక అంశాలపై వారు చర్చించనున్నారు. అంతేకాకుండా రైతు భరోసా పథకాన్ని ఒకేసారి అమలు చేయాలా? విడతల వారీగానా? అన్న అంశంపై కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కొత్త రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి, దరఖాస్తుల స్వీకరణపై చర్చించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలన్న ప్రతిపాదనపై క్యాబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ కమిషన్, బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలపై మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటిపై మంత్రులు పరస్పర అభిప్రాయాలను పంచుకోనున్నారు. అదే విధంగా యాదగిరి గుట్ట బోర్డు విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకోనుంది. దాదాపు 20 మంది సభ్యులతో యాదగిరి గుట్ట పాలక మండలిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. కొత్త టూరిజం, కొత్త విద్యుత్ పాలసీలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగొచ్చని తెలుస్తోంది.