బీసీ రిజర్వేషన్లలో కాంగ్రెస్ కుట్ర.. కవిత ఘాటు విమర్శలు
కులగణన సర్వే వివరాలను ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదు?
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు చేశారు. బీసీ రిజర్వేషన్ల ఖరారు విషయంలో కాంగ్రెస్ భారీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీసీలను మోసం చేయడానికి సిద్ధమైందని విమర్శించారు. అందుకే ఇప్పటి వరకు కులగణన సర్వే వివరాలను బయట పెట్టలేదని, ఇందులో కుట్ర కోణం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. బీసీ రిజర్వేషన్లను తమకు అనుకూలంగా ఉన్న చోట ఖరారు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, మిగిలిన చోట్ల రిజర్వేషన్లను నామమాత్రంగా చేయాలని చూస్తున్నారని కవిత విమర్శనాస్త్రాలు సంధించారు. కానీ బీసీలకు అన్యాయం జరుగుతుంటే తాము చూస్తూ ఊరుకోమని కవిత హెచ్చరించారు. బీసీల హక్కుల కోసం తెలంగాణ జాగృతి పోరాడుతుందని, రిజర్వేషన్ల లక్ష్యంగానే జాగృతి ముందుకు సాగుతుందని ఆమె తెలిపారు.
ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి..
‘‘తమకు అనుకూలంగా ఉన్న చోట రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ప్రకటించే లోపే కులగణన సర్వే వివరాలు వెల్లడించి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. హడావిడిగా ఎన్నికలు నిర్వహించి రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తే బీసీలకు అన్యాయం చేసినట్టే.. గ్రామపంచాయతీల వారీగా కుల గణన వివరాలు వెల్లడించాలి. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ జాగృతి మొదటి నుంచి చిత్తశుద్ధితో పని చేస్తున్నది.. రిజర్వేషన్ల పెంపు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తుంది’’ అని పునరుద్ఘాటించారు.
మోసం చేయొద్దు..
‘‘బీసీల హక్కులను ప్రభుత్వం కాపాడాలి. రాజకీయ కుట్రలతో మోసం చేయొద్దు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. న్యాయం కోసం ప్రశ్నించాలి. పోరాడాలి. ఇది కేవలం రిజర్వేషన్ల సమస్య కాదు. సమానత్వం, న్యాయం కోసం చేస్తున్న పోరాటం. ఈ పోరాటాన్ని తెలంగాణ జాగృతి ముందుకు తీసుకెళ్తుంది. కాంగ్రెస్.. ఇలాంటి కుట్రలు ఎన్ని పన్నినా అవి విఫలమే అవుతాయి. చివరకు న్యాయమే విజయం సాధిస్తుంది’’ అని కవిత అన్నారు.