పార్టీ మారింది, వరంగల్ సీటు కొట్టేసింది కావ్య

కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మహారాష్ట్రకి చెందిన అకోలా నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది.

Update: 2024-04-01 17:44 GMT

కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మరో ఇద్దరు పార్లమెంటు అభ్యర్థులను ఖరారు చేసింది. మహారాష్ట్రకి చెందిన అకోలా నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇద్దరు అభ్యర్థులతో కూడిన జాబితాను ఏఐసిసి సోమవారం రాత్రి ప్రకటించింది. అకోలా నియోజకవర్గానికి డాక్టర్ అభయ్ కాశీనాథ్ పాటిల్ ని ఎంపిక చేయగా వరంగల్ లోక్ సభ టికెట్ తాజాగా కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి కుమార్తె కావ్యకి కేటాయించింది.



కడియం కావ్యకి తొలుత బీ ఆర్ ఎస్ నుంచి వరంగల్ పార్లమెంటు టికెట్ ఇవ్వగా.. ఆమె తన అభ్యర్థిత్వాన్ని వదులుకుంది. పార్టీ చుట్టుముట్టిన అవినీతి ఆరోపణలు, నియోజకవర్గంలో పార్టీ లోకల్ నాయకుల సహకారం లేని కారణంగా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కేసీఆర్ కి లేఖ రాసింది. అనంతరం కాంగ్రెస్ నేతల ఆహ్వానం మేరకు తండ్రీకూతుళ్ళు బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. కాగా వరంగల్ లోక్ సభ టికెట్ హామీతోనే కడియం పార్టీ మారినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే బీఆర్ఎస్ లో సీనియర్ నాయకుడైన కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి కష్టకాలంలో ఉన్నప్పుడు స్వార్ధం చూసుకుంటున్నారని తప్పుబడుతున్నారు. జంపింగులపై స్పందించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ "నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం" అంటూ ధీమా వ్యక్తం చేశారు. "ఇది ఆకులు రాలే కాలం, ఆకులు రాలితే కొత్త ఆకులు వస్తాయి, కడియం శ్రీహరి లాంటివాళ్లు వెళ్ళిపోయాక క్యాడర్ లో జోష్ పెరిగిందంటూ" సీనియర్ నేత హరీష్ రావు చురకలంటించారు.

Tags:    

Similar News