‘కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అందుకే ఇచ్చాం’

సీబీఐ విచారణ, పార్టీ అంతర్గత విషయాలపై మహేష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు.;

Update: 2025-09-05 11:11 GMT

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి సిఫార్సు చేసింది. ఈ మేరకే అధికారిక లేఖ కూడా రాసింది. అయితే రాష్ట్రదర్యాప్తు సంస్థలను కాదని, సీబీఐకే ఎందుకు సిఫార్సు చేసింది? అన్న ప్రశ్న రాష్ట్రంలో తీవ్ర చర్చలకు దారితీసింది. తాజాగా దీనికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. తాము ఆలోచన లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థకు సిఫార్సు చేయలేదన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరిగిందన్న విషయాన్ని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక స్పష్టం చేసిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం అందరి అభిప్రాయ సేకరణ చేసి సీబీఐకి సిఫార్సు చేశామని చెప్పారు.

 ‘‘కాళేశ్వరం అంశాన్ని సీబీఐతో కాకుండా రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తే బద్నాం చేసేవారు. దాంతో ఈ విషయాన్ని విచారించడానికి సీబీఐ కంటే మరో మార్గం కనిపించడం లేదు. సీబీఐలో కూడా చాలా లొసుగులు ఉన్నాయి. కానీ ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని భావిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మరో చర్చకు దారితీశాయి.

కాంగ్రెస్ భయమదేనా..

కాళేశ్వరం విచారణను ఎవరికి అప్పగించాలి? అన్న అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మేధోమథనమే చేసింది. అన్ని కోణాల్లో ఆలోచించి, చర్చించిన తర్వాతే సీబీఐకి అందించాలని నిర్ణయానికి వచ్చిందని మహేష్ కుమార్ వ్యాఖ్యలతో స్పష్టం అవుతుంది. అంతేకాకుండా ఆయన అన్నట్లు కాళేశ్వరం వ్యవహారాన్ని విచారించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అండర్‌లో ఉండే దర్యాప్తు సంస్థలకు ఇస్తే నిజంగానే రాష్ట్రమంతా గగ్గోళెత్తి ఉండేదేమో. ఎందుకంటే.. ఈ వ్యవహారాన్ని విచారించడానికి కాంగ్రెస్ సర్కార్ దగ్గర సీఐడీ, సిట్ ఇలా చాలా మార్గాలు ఉన్నాయి. వాటిలో దేనికైనా విచారణ అందించి ఉంటే దర్యాప్తు సంస్థలను తమ చేతిలో పెట్టుకుని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ప్రతిపక్షాలు గోలగోల చేసే అవకాశాలు లేకపోలేదు. అంతేకాకుండా అవినీతి జరగలేదు కాబట్టే రాష్ట్ర సంస్థలతో దర్యాప్తు మమ అనిపించి, తాము అనుకున్నది చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని ఆరోపణలు వినిపించేవి. దాంతో పాటుగానే ఈ వ్యవహారాన్ని సీబీఐకి ఇవ్వాలన్న డిమాండ్లు కూడా పెరిగి ఉండేవి. ఇవన్నీ ఆలోచించే.. అదేదో ముందే సీబీఐకి ఇచ్చేస్తే.. ఈ తలనొప్పులన్నీ ఉండవు కదా అని కాంగ్రెస్ భావించింది. ఆ విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పష్టం చేశారు.

దాంతో పాటుగానే ‘‘స్థానిక సంస్థల ఎన్నికలూ దగ్గర పడుతున్నాయి. ఈ నెల కాకపోతే వచ్చే నెల అయినా వాటిని నిర్వహించాల్సిందే. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటుకోవాలని భావిస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఇది ఒక ప్రిస్టేజీ ఇష్యూ కూడా. ఇప్పుడు కనుక కాళేశ్వరం విచారణను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే.. అది ప్రతిపక్షాల చేతుల్లో ఆయుధంలా మారుతుందని, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తమనే దెబ్బకొడుతుందని కాంగ్రెస్ గ్రహించింది. ఆ అవకాశం లేకుండా ఉండటం కోసమే ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది’’ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హైదరాబాద్ చేరుకున్న సీబీఐ డైరెక్టర్..

కాళేశ్వరం విచారణ సిఫార్సు అందడంతోనే సీబీఐ రంగంలోకయితే దిగేసింది. ఇందులో భాగంగానే సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్.. ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అధికారులతో ఆయన శుక్రవారం భేటీ అయ్యారు. కాళేశ్వరం అంశంపై ఆయన చర్చించారు. ఒకవైపు రాష్ట్రమంతా కాళేశ్వరం విచారణ అంశం హాట్ టాపిక్‌గా ఉన్న క్రమంలో ఆయన పర్యటన, అధికారులతో భేటీ కీలకంగా మారాయి.

Tags:    

Similar News