తెలంగాణకు జర్మనీ కంపెనీ..

వైద్య పరికరాలను ఇక్కడే తయారు చేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్న సీఎం రేవంత్.;

Update: 2025-09-05 09:13 GMT

తెలంగాణను వైద్య రంగంలో మరింత అభివృద్ధి చెసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు జర్మనీకి చెందిన ప్రసిద్ధ వైద్య పరికరాల తయారీ సంస్థ బెబిగ్ మెడికల్(BEBIG Medical) తెలంగాణలో తన యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం నిదర్శనమన్నారు. ఈ మేరకు బెబిగ్ మెడికల్ సంస్థ ఛైర్మన్, సీఈఓ జార్జ్ చాన్ నేతృత్వంలోని బృందం.. సీఎం రేవంత్‌ను ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీలో సంస్థకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. తెలంగాణను అభివృద్ధిలో పరుగులు పెట్టించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

వైద్య పరికరాల ఉత్పత్తి యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు. కంపెనీ యూనిట్ ఏర్పాటుకు అనువైన స్థలం, ఇతర అంశాలకు సంబందించి అధ్యయనం చేసి నివేదిక అందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ ఈక్విప్‌మెంట్‌తో పాటు, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే రేడియేషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను కోరారు. ఈ యూనిట్ ద్వారా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని సీఎం అన్నారు. ఇటువంటి మరిన్ని సంస్థలను కూడా తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని, ప్రతి సంస్థకు ప్రభుత్వం తరపు నుంచి పూర్తి సహకారం లభిస్తుందని ఆయన చెప్పారు.

అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని రేవంత్ చెప్పారు. తెలంగాణ, హైదరాబాద్ పోటీ పక్క రాష్ట్రాలు, నగరాలతో కాదని, ప్రపంచంతో పోటీ అని ఆయన అన్నారు. అందుకే తెలంగాణ రైజింగ్ 2047 అజెండాతో ముందుకు వెళ్తోందని ఆయన చెప్పారు.

Tags:    

Similar News