గణేష్ నిమజ్జనం రోజు ‘మెట్రో’ నాన్ స్టాప్ సర్వీసులు

అన్ని ఏర్పాట్లు చేసినట్టు సీపీ సీవీ ఆనంద్ వెల్లడి;

Update: 2025-09-05 10:25 GMT

మరికొద్ది సేపట్లో జంటనగరాలు గణపతి బప్పా మోరియా ఆదా లడ్డూ చోరియా అనే నినాదాలతో మారు మ్రోగనున్నాయి. నవరాత్రి ఉత్సవాలు ముగుస్తున్న నేపథ్యంలో రేపు శనివారం నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

గణేశ్‌ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌ మెట్రో శుభవార్త చెప్పింది. రేపు ఒక్కరోజే లక్షలాది మంది నిమజ్జన వేడుకలు చూడటానికి వస్తారు. ఆర్టీసి బస్సులు నడపొద్దని నిర్ణయించడంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి రేపు(శనివారం) ఉదయం ఆరు నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సర్వీసులు నడుస్తాయని తెలిపింది. దీంతో నిమజ్జనాన్ని చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఊరట లభించింది.

గణేశ్ ఉత్సవాలకు సంబంధించి గత 20 రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేశామని హైదరాబాద్‌ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ తెలిపారు. వినాయక నిమజ్జనాలకు సంబంధించి చెరువులను అన్నింటినీ పరిశీలించినట్లు చెప్పారు. చెరువులతో బాటు జీహెచ్ ఎంసీ ఏర్పాటు చేసిన కృత్రిమ చెరువులు పరిశీలించినట్టు చెప్పారు. రేపటి నిమజ్జనానికి అన్ని అయ్యాయని వివరించారు.

‘‘ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేసినట్టు సిపి వివరించారు. పోలీసుల సూచనల మేరకు మండపాల నుంచి వెళ్లాలి. వాహనాలు, విగ్రహాలు ఎత్తు ఎక్కువగా ఉంటే పోలీసుల అనుమతితో నిమజ్జనానికి తీసుకెళ్లాలి. హైదరాబాద్‌లో ప్రతి ఏరియాపై మ్యాప్ వేసుకొని రూట్స్ డిసైడ్ చేశాం అని సివి ఆనంద్ వివరించారు. మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు తప్పనిసరిగా అనుసరించాలి అని పేర్కొన్నారు. రోడ్లపై డైవర్షన్ ఉన్న చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశాం అని వివరించారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట లోపు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి చేస్తాం అన్నారు. మండప నిర్వాహకులు తొందరగా బయలుదేరి నిమజ్జన స్థలికి చేరుకోవాలన్నారు. 29 వేల మందితో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నాం. శనివారం సుమారు 50వేల విగ్రహాల నిమజ్జనాలు జరుగుతాయి’’ అని సీవీ ఆనంద్‌ అంచనా వేశారు.

శోభాయాత్రలో 40 లక్షల మంది

శనివారం హైదరాబాద్‌లో జరిగే గణేశ్‌ నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భాగ్యనగర్ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ తెలిపారు. 34 ప్రధాన చెరువులతో బాటు 64 ప్రాంతాల్లో కృత్రిమ నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 40లక్షల మంది భక్తులు పాల్గొంటారని ఆయన తెలిపారు. అన్న ప్రసాదాలు, తాగునీటి వసతి, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News