యాగం చేయిస్తున్న కేసీఆర్
ఫామ్ హౌసులో హోమాలు, యాగాలు చేయించటం కేసీఆర్ కు మొదటినుండి ఉన్న అలవాటే;
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌసులో గణపతి హోమం నిర్వహించారు. గణపతి నవరాత్రుల సందర్భంగ ఫామ్ హౌసులో హోమాలు, యాగాలు చేయించటం కేసీఆర్ కు మొదటినుండి ఉన్న అలవాటే. చాలామందికి ఉన్నట్లే కేసీఆర్(KCR) కు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. అందులోను ఇపుడు నలువైపులా కష్టాలు కమ్ముకుంటున్నాయి కదా కాబట్టి ఈ సమయంలో హోమాలు, యాగాలను మరింత గట్టిగా చేస్తారనటంలో సందేహాలు అక్కర్లేదు. ఒకవైపు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) విచారణల పేరుతో దెబ్బమీద దెబ్బకొడుతున్నాడు. మరోవైపు ప్రభుత్వ విచారణలను కోర్టుల ద్వారా అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటంలేదు.
ఇవన్నీ సరిపోవన్నట్లుగా కూతురు కల్వకుంట్ల కవిత పార్టీలో కీలకమైన తన్నీరు హరీష్ రావు, సంతోష్ పై అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. కవిత చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అన్నీ వైపుల నుండి సమస్యలు వచ్చి మీదపడుతున్న కారణంగా సహజంగానే కేసీఆర్ లో టెన్షన్ పెరిగిపోతోంది. వీటన్నింటికీ విరుగుడుగానో లేకపోతే పరిష్కారంగానో సతీసమేతంగా కేసీఆర్ హోమం, యాగం మొదలుపెట్టారు. గడచిన ఐదురోజులుగా కొడుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండి అవసరమైన ఏర్పాట్లు చేశారు. పార్టీలోని సీనియర్ నేతలంతా ఫామ్ హౌసులోనే ఉన్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కూతురు కవిత లేకుండానే కేసీఆర్ హోమం, యాగం చేస్తున్నారు. ఇప్పటివరకు ఫామ్ హౌసులో ఎప్పుడు ఎలాంటి హోమాలు, యాగాలు, పూజలు జరిగినా కవిత చాలా యాక్టివ్ పార్ట్ తీసుకునేవారు. అలాంటిది తాజా రాజకీయ పరిణామాల్లో పార్టీనుండి కవితను కేసీఆర్ సస్పెండ్ చేశారు. అలాగే కొన్ని నెలలుగా కవితకు ఫామ్ హౌసులోకి ఎంట్రీ నిషిద్ధమైపోయింది. సోదరుడు కేటీఆర్ పైన గతంలో చేసిన తిరుగుబాటు కారణంగా తండ్రికి కూడా కవిత దూరమైపోయారు. అందుకనే కవితను కేసీఆర్ ఒక్కసారిగా పిలిపించి మాట్లాడలేదు. కేసీఆర్ కూతురుతో మాట్లాడటంలేదు కాబట్టి ఆయన సతీమణి శోభ కూడా దూరంగానే ఉంటున్నట్లు సమాచారం.
తొందరలోనే స్ధానికసంస్ధల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించకపోతే పార్టీకి కష్టాలు మరింత పెరుగుతాయి. అలాగే ఇపుడు కమ్ముకున్న సమస్యలన్నీ తొలగిపోవాలనే కోరికతో 15 మంది ఋత్వికుల ఆధ్వర్యంలో కేసీఆర్ దంపతులు చండీయాగం చేస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. మరి హోమ ఫలం ఎలాగుంటుందో చూడాల్సిందే.