జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేయాలని తెలంగాణ మేధావుల విజ్ఞప్తి
పార్టీలకు, స్వలాభాలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎంపీలు ఓటేయాలని విజ్ఞప్తి.;
భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక దగ్గర పడుతోంది. అభ్యర్థులు సీపీ రాధాకృష్ణన్, బీ సుదర్శన్ రెడ్డి మధ్య ఆసక్తికర పోటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండి కూటమి అభ్యర్థి బీ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని ఎంపీలను కోరుతూ తెలంగాణ మేధావులు కోరారు. ఈ లేఖను 91 మంది సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వారు అనేక అంశాలను తమ లేఖలో ప్రస్తావించారు. సుదర్శన్ రెడ్డి దశాబ్దాల తరబడి న్యాయవ్యవస్థకు అద్భుతమైన సేవలు అందించారని గుర్తు చేశారు. అంతేకాకుండా రాజ్యాంగ విలువలు, నియమాలు, సామాజిక న్యాయాన్ని పాటించడంలో ఆయన తన మార్క్ చూపించుకున్నారని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి..
‘‘భారతదేశ ప్రజాస్వామ్య విధానాలను కాపాడటానికి ఎంపీలంతా మాతో కలిసి రావాలి. బాధ్యతాయుతమైన, దేశభక్తి ఉన్న పౌరులుగా మేము కోరేది ఇదే. ప్రతి నేత కూడా పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో ఏకమవండి. పదేళ్లలో భారత ప్రజాస్వామ్యం ఊహించని మలుపు తీసుకుంది. ఇది తీవ్ర ప్రతికూల పరిస్థితులకు, నిరంకుశ పాలనకు దారితీసింది. అధికారంలో ఉన్నవారి ప్రసంగాలు, ప్రస్తుత చర్యల పర్యావసానాలు కేవలం ప్రతిపక్షాలపై ప్రభావం చూపడంలేదు. ఎంపీల ట్రెజరీ బెంచ్‌లనూ ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ సందర్భంగానే ఎంపీలంతా కూడా సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం’’ అని వారు పేర్కొన్నారు.
‘ప్రభుత్వ ఆస్తి అనేది లేదు’
‘‘సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న సమయంలో సుదర్శన్ రెడ్డి ఎన్నో మైలు రాళ్ల వంటి తీర్పులను వెలువరించారు. వీటిలో ప్రజా ఆస్తిని వినియోగించే అంశంలో ప్రభుత్వానికి ఉన్న అధికారం ఎంత? అనే అంశంలో ఇచ్చిన తీర్పు కూడా ఒకటి. ఆ తీర్పు సందర్భంగానే ప్రభుత్వ బాధ్యతను ఆయన నొచ్చి చెప్పారు. ఆ సందర్భంలో ‘ప్రభుత్వ ఆస్తి అనేదీ ఏదీ లేదు. అంతా కూడా ప్రజా ఆస్తి మాత్రమే. దానికి ప్రస్తుత ప్రభుత్వం ట్రస్టీ మాత్రమే’ అని చెప్పారు. ఇలాంటి తీర్పులు ఇవ్వడానికి ధైర్యమే కాదు, పేదల పట్ల స్థిరమైన బాధ్యత, వారి పరిస్థితుల పట్ల ఆందోళన కూడా చాలా అవసరం’’ అని అన్నారు.
‘‘పేదల పట్ల శ్రద్ధ, రాజ్యాంగ సంక్షోభ సమయాల్లో స్వతంత్రంగా ఆలోచించే నేర్పరితనం చాలా ముఖ్యం. కొన్ని సంవత్సరాలుగా ఈ క్వాలిటీ ప్రభుత్వంలో మిస్ అయింది. చట్ట పాలన సూత్రాలు రాజీ పడితే వాటి ప్రభావం సాధారణ పౌరులపైనే కాదు, ఎంపీలనూ దుర్భలులను చేస్తుంది. రాజ్యాంగ స్థానాలు భయం లేదా అనుకూలత లేకుండా సభ్యులందరికి సమాన స్థాయిని అందించడానికి ఉద్దేశించబడ్డాయి’’ అని గుర్తు చేశారు.
అర్థవంతమైన చర్చలేవి..
‘‘రాజ్యసభలో విపక్షాలు, అధికార పక్షం మధ్య అర్థవంతమైన చర్చలు జరగడం లేదు. అవి జరుగుతాయన్న ఆశ చాలా సన్నగిల్లిపోయింది. ఈ పద్దతి రానున్న కాలంలో జరిగే చర్చలకు అడ్డంకిగా మారడమే కాకుండా, సభ్యులు తమ బాధ్యతలను నిర్వర్తించకుండా కూడా అడ్డుకుంటుంది. రాబోయే తరాలు తమ చరిత్రలో గుర్తుంచుకునే పాత్రను పోషించే అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. మనకు అలాంటి అవకాశం దక్కింది. పక్షపాత ధోరణులు, ప్రాధాన్యతలకు అతీతంగా మన మనస్సాక్షి పిలుపును పాటించడానికి ఇది ఒక మంచి అవకాశం అని మేము భావిస్తున్నాము. మీలో ప్రతి ఒక్కరూ మన పార్లమెంటరీ సంప్రదాయాలలోని ఉత్తమాలను లోతుగా ప్రతిబింబిస్తారని, అనుభూతి చెందుతారని, వాటిని పునరుద్ధరించడానికి దోహదపడతారని మేము హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాము. మన అంతర్గత స్వరాన్ని వినడానికి మరియు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేయడంలో పాల్గొనడానికి నిరాకరించడానికి ఇది మొదటి మరియు అవసరమైన అడుగు’’ అని పిలుపునిచ్చారు.
‘‘భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన, లోతుగా గౌరవించబడే ప్రజాస్వామ్య సంప్రదాయాలను పునరుద్ధరించడంలో, జస్టిస్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సమర్థించడం చాలా దూరం వెళ్తుందని మేము గట్టిగా భావిస్తున్నాము’’ అని పేర్కొన్నారు. ఈ అప్పీల్‌పై సంతకం చేసిన వారిలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హనుమంతరావు, ప్రొఫెసర్ బీఎన్ రెడ్డి, ప్రొఫెసర్ మొహమ్మద్ సులేమాన్ సిద్దికి, ప్రొఫెసర్ డీఎన్ రెడ్డి, సినియర్ జర్నలిస్ట్ టంకశాల అశోక్, ఫిలిం డైరెక్టర్ బీ సర్సింగ్ రావు, రైతు స్వరాజ్య వేదిక నేత కన్నెగంటి రవి ఉన్నారు.