దీపావళికి కాంగ్రెస్ ఇచ్చే కానుక ఏంటో చెప్పిన మంత్రి పొంగులేటి..
దీపావళి పండగ కానుకగా ఇందిరమ్మ ఇళ్లను మొదటి విడతగా ప్రారంభించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
దీపావళి పండగ కానుకగా ఇందిరమ్మ ఇళ్లను మొదటి విడతగా ప్రారంభించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. దీపావళి పండగ రోజు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారాయన. దీపావళి రోజు అమావాస్య కావడంతో ఆతర్వాత మంచి రోజు చూసుకుని గృహాల నిర్మాణానికి శ్రీకారం చుడతామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లను నిర్మించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి తెలిపారు. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేదలను అందించనున్నామని ఆయన అన్నారు.
అదే విధంగా గ్రామ సభలు నిర్వహించి మరీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను అత్యంత పారదర్శకంగా ఎంపిక చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని వెల్లడించారు పొంగులేటి. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా మరోసారి తన బాంబుల అంశాన్ని కూడా లేవనెత్తారు. అక్టోబర్ 31 అంటే దీపావళి పండగకు ముందే తాను చెప్పిన బాంబు తెలంగాణలో పేలనుందని అన్నారు. అదే విధంగా ఎవరికీ ఏ విధమైన భూములు కేటాయించట్లేదని కూడా మంత్రి వివరించారు.
మంత్రి పొంగులేటి ఏమన్నారంటే..
ప్రభుత్వ ఉద్యోగులకు 2020 నుంచి ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో ఒక డీఏ ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక పరిస్థితి కుదుటపడగానే అన్నీ క్లియర్ చేస్తాం.
జీవోలు 317, 46లపై సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై సుదీర్ఘంగా చర్చించాం. సుదూర ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన మెడికల్, స్పౌజ్, మ్యూచువల్ బదిలీలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. స్థానికత అంశం రాష్ట్రపతి పరిధిలో ఉన్నందున న్యాయసలహా తీసుకొని అసెంబ్లీలో చర్చించి ముందుకు వెళ్లాలని కేబినెట్ సమావేవంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.
నవంబరు 30 వరకూ రాష్ట్రంలో కుల గణన సర్వే పూర్తి చేయాలి. నవంబరు 4 నుంచి 19 వరకు రాష్ట్రమంతటా ఇంటింటి సర్వే చేపట్టాలి. దాదాపు 80వేల ఎన్యూమరేటర్లను సర్వే విధులకు డిప్యూట్ చేస్తారు. వారికి త్వరలో శిక్షణ ఇస్తారు.
ధాన్యం సేకరణకు సుమారు 6వేలకు పైగా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటికే కొన్ని ఏర్పాటయ్యాయి. మరికొన్నింటిని త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం..
గత ప్రభుత్వంలో రైస్ మిల్లర్ల దగ్గర రూ.20 వేల కోట్ల ధాన్యం మిగిలిపోయింది. దీనిపై క్యాబినెట్ విస్తృతంగా చర్చించింది. ఇతర రాష్ట్రాల్లో దీనిపై ఏవిధమైన నిర్ణయాలు తీసుకున్నారో పరిశీలించిన తర్వాత.. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రానికి మంచి జరిగేలా నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికీ డిఫాల్టర్లుగా ఉన్నవారిని మొత్తంగా తొలగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యాన్ని కేటాయించేటప్పుడు వారి స్థాయిలను బట్టి బ్యాంక్ గ్యారెంటీలు తీసుకొంటుంది.
హైదరాబాద్లో మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నాగోల్- శంషాబాద్, రాయదుర్గం-కోకాపేట్, ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట, మియాపూర్-పటాన్చెరు, ఎల్బీనగర్-హయత్నగర్.. మొత్తం 76.4 కి.మీ. విస్తరణ చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాజెక్టు చేపట్టాలని తీర్మానించింది. మొత్తం రూ.24,269 కోట్లతో ఈ ప్రతిపాదనలను రూపొందించారు. దీనికి సంబంధించిన డీపీఆర్ను కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపిస్తారు.
ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణానికి గోషామహల్ లో స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న స్థలాన్ని వైద్య ఆరోగ్యశాఖకు బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపింది.
ములుగులో గిరిజన విశ్వవిద్యాలయానికి 211 ఎకరాల కేటాయింపునకు, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గచ్చిబౌలి స్టేడియాన్ని ఈ యూనివర్సిటీకి వినియోగించాలని నిర్ణయం తీసుకుంది.
స్కిల్స్ యూనివర్సిటీకి అనుబంధంగా మధిర, వికారాబాద్, హుజూర్నగర్ ఐటీఐలను కొత్తగా మంజూరు చేసింది.
కొత్త కోర్టులకు, రెండు కాలేజీలకు అవసరమైన సిబ్బంది మంజూరుకు ఆమోదం తెలిపింది. రిజర్వాయర్లలో పూడిక పేరుకుపోయిన కారణంగా.. నీటి నిల్వ స్థాయి తగ్గిపోతోంది. పైలట్ ప్రాజెక్టు కింద.. కడెం ప్రాజెక్టులో పూడిక తొలగించాలని క్యాబినెట్ ఆమోదం తెలిపింది. భవిష్యత్లో మీడియం, మేజర్ ప్రాజెక్టుల్లోనూ ఈ ప్రక్రియను చేపడతారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కొత్తగా 142 పోస్టులను మంజూరు చేస్తూ మంత్రివర్గం ఆమోదించినట్లుగా తెలిసింది. వీటితో పాటు పలు ఇతర కీలక అంశాలను కూడా మంత్రి పొంగులేటి వెల్లడించారు.