Indiramma Illu |ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ‘గూడు’ కట్టుకున్న అవినీతి

2004 నుంచి 2014వరకు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో గూడు కట్టుకున్న అవినీతిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తాజాగా ముందుకు వచ్చింది.;

Update: 2025-01-30 06:49 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టించి ఇవ్వ‌డానికి 2004 సంవ‌త్స‌రంలో పెద్ద ఎత్తున ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని అప్పటి కాంగ్రెస్ సర్కారు చేపట్టింది. ఇందులో భాగంగా 2004 నుంచి 2014వ సంవత్సరం వ‌ర‌కు పదేళ్లలో 33.4 ల‌క్ష‌ల ఇళ్లను మంజూరు చేశారు. అయితే ఈ కార్య‌క్ర‌మం మంచి ఉద్ద్యేశ్యంతో చేప‌ట్టినా, అధికారులు,రాజ‌కీయ నాయ‌కులు కుమ్మ‌క్కు అవడంతో ఈ పథకంలో అవినీతి అక్రమాలు సాగాయని ఆరోపణలు వచ్చాయి.

- ఉమ్మడి రాష్ట్రంలో 33.4 ల‌క్ష‌ల ఇళ్లను మంజూరు చేయగా దానిలో 20.49 ల‌క్ష‌ల ఇళ్లు పూర్తి అయిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. కాని అందులో కూడా కొన్ని ఇళ్ల నిర్మాణ ప‌నులు ప్రారంభించలేదు.ఇంకా కొన్నిఇళ్లు స‌గంలోనే నిలిచిపోయాయి.

ఇళ్ల నిర్మాణం పేరిట నిధుల స్వాహా
ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని ఇళ్లు నిర్మాణం చేపట్టకపోయినా, నిర్మించినట్లు, ఎప్పుడో క‌ట్టిన ఇల్లు కూడా కొత్త‌గా క‌ట్టిన‌ట్లు చూపించి డబ్బులు స్వాహా చేశారు. దీనికి స్థానిక రాజ‌కీయ‌నాయ‌కులు స‌హాయ స‌హ‌కారాలు ఇచ్చారు.క‌ట్టని ఇళ్ళు క‌ట్టిన‌ట్లు, పాత ఇళ్లను కొత్త‌గా క‌ట్టిన‌ట్లు చూపిస్తూ వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్ప‌డ్డారని ఆరోపణలు వచ్చాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

సీఐడీ విచారణకు ఆదేశం
తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన వెంట‌నే అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలపై విచారణకు ఆదేశింాచరు. జి.ఓ. నంబరు 9 26-7-2014 తేదీన ఈ కేసుపై విచారణ బాధ్యతను సి.ఐ.డి.కి అప్పగించారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి దోషుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల‌ని, అలాగే సంబంధిత అధికారుల‌ నుంచి స్వాహా సొమ్మును వ‌సూలు చేసి,వారిపై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్ట‌డానికి ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వాల‌ని అప్పటి ప్రభుత్వం సీఐడీని కోరింది.

హైకోర్టులో ఫోరం పిల్ దాఖలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జ‌రిగిన నాటికి చాలా గ్రామాల్లో పూర్తి కాని ఇందిర‌మ్మ ఇళ్లు ల‌క్ష‌ల సంఖ్య‌లో అర్థాంత‌రంగా మిగిలాయి. తెలంగాణలోని గత బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని ప‌క్క‌న పెట్టి కొత్త‌గా డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. అసంపూర్తిగా మిగిలిన‌ ఇందిర‌మ్మ‌ ఇళ్లకు నిధులు మంజూరు చేసి వాటిని పూర్తి చేయాల‌ని లేకుంటే ప్ర‌భుత్వ‌ధ‌నం వృధా అవుతుంద‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ నాటి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు ఎన్ని అర్జీలు ఇచ్చినా ఫ‌లితం లేక‌పోయింది. దీంతో చివ‌ర‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోర్టును ఆశ్ర‌యించింది. కోర్టు ఆదేశంతో గత ప్రభుత్వం నిధులు విడుద‌ల చేయ‌డంతో చాలామ‌టుకు ఇళ్ల నిర్మాణ ప‌నులు పూర్తి చేసి ల‌బ్ధిదారుల‌కు ఇళ్లు కేటాయించారు.

సీఐడీ విచారణపై చర్యలేవి?
సి.ఐ.డి. విచార‌ణ చురుకుగా సాగినా త‌రువాత ముందుకు సాగ‌లేదు. తెలంగాణ రాష్ట్రంలో 12,000 గ్రామాలుండ‌గా కేవ‌లం 36 గ్రామాల్లో త‌నిఖీలు జ‌రిపి, ఇళ్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, పాత ఇళ్లను కొత్త‌గా క‌ట్టిన‌ట్లు చూపిస్తూ డ‌బ్బులు తీసుకున్నార‌ని పాత ఇళ్లు ఎప్పుడు క‌ట్టారు అన్న విష‌యం తేల్చ‌డానికి ఇంజ‌ినీర్లు కావాల‌ని తెలుపుతూ సీఐడీ విచార‌ణ ఆపివేసింది. రూ.235.90 కోట్ల అవినీతి జరిగిందని విచారణ కమిటీ తేల్చింది. ఇళ్లు ఎప్పుడు క‌ట్టారు అన్న విష‌యం గ్రామ‌పంచాయితీలో గాని గ్రామ పెద్ద‌ల‌ను విచారించినా త‌గిన స‌మాచారం దొరుకుతుంది. అయితే సి.ఐ.డి. వారు అటువంటి ప్ర‌య‌త్నం ఏమీ చేయ‌కుండా ఇంజ‌నీర్లు కావాల‌ని ఒక రిపోర్టు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల పేరిట వేల కోట్ల రూపాయిల అవినీతి జ‌రిగినా, ప‌ది సంవ‌త్స‌రాల‌ నుంచి ఎటువంటి విచార‌ణ జ‌రుప‌క ద‌స్త్రాన్ని ప‌క్క‌న ప‌డేశారు. రాష్ట్ర స‌చివాల‌యంలో ఇలా అవినీతిపై చ‌ర్య‌లు తీసుకోకపోవ‌డంతో అవినీతి ప‌రుల‌కు ప్రోత్సాహ‌మిచ్చిన‌ట్లు అవుతుందని యం పద్మనాభరెడ్డి ఆరోపించారు.

అక్రమాలపై చర్యలు తీసుకోండి
ప్ర‌స్థుత‌ కాంగ్రెస్ ప్ర‌భుత్వం పేద‌ల కోసం మళ్లీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప‌థ‌కాల‌న్నీ ల‌బ్ధిదారుల‌కు చేరాలంటే అధికార యంత్రాంగం నిబద్ధ‌త‌తో ప‌నిచేయాల్సిన అవ‌స‌ర‌ముందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సూచించింది. ఇందిర‌మ్మ ఇళ్ళ నిర్మాణంలో 2004 నుంచి 2014 వ‌ర‌కు జ‌రిగిన అవినీతి, ఆక్ర‌మ‌ణ‌ల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించి వేల కోట్ల రూపాయిల అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డ దోషుల‌ను శిక్షించాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని కోరింది. ఈ మేరకు ఫోరం పక్షాన తాను లేఖ రాశానని యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.


Tags:    

Similar News