సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు.. పది రోజులే టైమ్..
హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
పుష్ప-2 ప్రీమియర్ సమయంలో జరిగిన ఘటనకు సంబంధించి హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. థియేటర్ యాజమన్యం నిర్లక్ష్యం కారణంగా డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్స్ సమయంలో అక్కడ తొక్కిసలాట జరిగిందని, ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరో చిన్నారి చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నారని ఆయన తన నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందుకు గానూ థియేటర్ లైసెన్స్‌ను రద్దు చేయదలుచుకున్నామని, అలా చేయకూడదంటే అందుకు సరైన వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందుకు గానూ సంధ్య థియేటర్‌కు పది రోజుల డెడ్‌లైన్ కూడా పెట్టారు పోలీసులు. ఈ సమయంలోపు సంధ్య థియేటర్ యాజమన్యం నుంచి ఎటువంటి స్పందన రాకుంటే వెంటనే ఆ థియేటర్ లైసెన్స్ రద్దు చేస్తారు అధికారులు. ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
అందుకే నోటీసులు..
సంధ్య థియేటర్‌కు ఇరువైపులా రెస్టారెంట్‌లు ఉన్నాయని, ఇలాంటి సమయంలో ఇక్కడకు నటీనటులు వస్తే భద్రత కల్పించలేమని చిక్కడపల్లి పోలీసులు రాతపూర్వకంగా సంధ్య థియేటర్ సమాచారం ఇచ్చినట్లు ఇప్పటికే ఒక నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయినప్పటికీ అక్కడకు అల్లు అర్జున్ రావడమే కాకుండా ఎటువంటి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారు. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం కీలకంగా మారింది. అయితే సంధ్య థియేటర్‌లో 70ఎంఎం, 35 ఎంఎం రెండు థియేటర్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 2,520 సీటింట్ కెపాసిటీ ఉంటుంది. థియేటర్‌లోకి మహిళలు వెళ్లడానికి ప్రత్యేక ఎంట్రీ, డిస్‌పలే బోర్డులు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ప్రేక్షకులు థియేటర్‌లోకి వెళ్లడానికి ఒకే మార్గం ఉంది. ఎక్కవ మంది ప్రేక్షకులను థియేటర్ రప్పించుకోవడానికి తహతహలాడుతున్న యాజమాన్యం.. రద్దీని నియంత్రించడానికి ఏమాత్రం చర్యలు తీసుకోలేదని పోలీసులు దర్యాప్తులో తేలింది. అల్లు అర్జున్ వచ్చిన క్రమంలో తొక్కిసలాట జరగడానికి భద్రతా ఏర్పాట్ల లోపం కూడా ఒక ప్రధాన కారణంగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఈ ఘటనలో ఒక మహిళ మరణించడం, బాలుడు ఇప్పటికీ అపస్మారక స్థితిలో ఉండటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై సీపీ సీవీ ఆనంద్ అప్‌డేట్ ఇచ్చారు.
సమయం పడుతుందన్న వైద్యులు: సీవీ ఆనంద్
‘‘శ్రీతేజకు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారు. డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజకు ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయింది. వెంటిలేటర్ సహాయంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు చెప్తున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై అతి త్వరలోనే వైద్యులు బులెటిన్ విడుదల చేస్తారు’’ అని సీవీ ఆనంద్ వివరించారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆయన వెల్లడించారు.