మీకు తెలుసా.. హైదరాబాద్ నగరమూ పంటలు పండిస్తోంది
హైదరాబాద్ అగ్రికల్చర్ స్కాండల్ . ఈ జిల్లాలో ఒక్క ఎకరా సాగు భూమి లేదు. అయినా, 2023-2024 సం.లో రూ.1,541.95 కోట్ల పంట రుణాలు ఇచ్చారు. ఇదె సాధ్యం.
అసెంబ్లీ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా 2024 ఆగస్ట్ 15 నాటికి తెలంగాణ రైతులకు రెండు లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేయడానికి విధి విధానాలు ఫైనల్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించారు. రుణమాఫీ హామీ అమలు చేయాలంటే కనీసం 30 వేల కోట్ల రూపాయల అవసరముంటుందని ఒక అంచనా.
రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి, లేదా కొత్తగా అప్పు చేసి ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్దం అవుతున్నప్పుడు, ఆ నిధులు సద్వినియోగం కావాలని, ఈ రుణమాఫీ తో రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడి, సంతోషంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఇలాంటి సమయంలో తెలంగాణ లో సంస్థాగత రుణ వ్యవస్థ గురించీ, పంట రుణాల అందుబాటు గురించీ, రైతులలో ఏ శ్రేణి రైతులు సంక్షోభంలో ఉన్నారనే విషయం గురించీ లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
రైతుల కోణంలో ఆలోచించినప్పుడు వ్యవసాయంలో అత్యంత కీలకమైనది పెట్టుబడి. ప్రతి సీజన్ లో పంట సాగు ఖర్చులు భారీగా పెరిగిపోతూ, సాగు పై రైతులు ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సి వస్తున్నది. ఒక వైపు భూమి కౌలు ధరలు పెరిగాయి. మరో వైపు ఎరువులు, పురుగు విషాలు, విత్తనాల ధరలు, యంత్రాల కిరాయిలు, సాపేక్షికంగా కూలీ ఖర్చులు పెరిగి రైతుపై మరింత భారాన్ని పెంచుతున్నాయి. ప్రకృతి వైపరిత్యాల నష్టాలు ఉండనే ఉన్నాయి.
2022 లో వెలువడిన జాతీయ నమూనా సర్వే సంస్థ (NSSO) 2018-2019 సంవత్సర నివేదిక ప్రకారం తెలంగాణ లో 92 శాతం రైతు కుటుంబాలు అప్పులలో ఉన్నాయి. రైతు కుటుంబ సగటు అప్పు 1,50,000 రూపాయలు.
ఇప్పటి వరకూ రైతు కుటుంబాలు పంట పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, బంధువులు,స్నేహితులు, ఇన్ పుట్ డీలర్స్, వాణిజ్య బ్యాంకులు/సహకార బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటున్నాయి. .
ఇప్పటి వరకూ బ్యాంకు రుణాలు మాత్రమే, ముఖ్యంగా పంట రుణాలు లక్ష రూపాయల వరకూ జీరో శాతం వడ్డీతో, ఒక లక్ష నుంచి మూడు లక్షల వరకూ పావలా వడ్డీతో లభిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీ రాయితీ డబ్బులు సకాలంలో బ్యాంకులకు చెల్లిస్తేనే రైతులకు వడ్డీ రాయితీ రుణాలు అందినట్లుగా భావించాలి.
ఉదాహరణకు గత ప్రభుత్వం వడ్డీ రాయితీ డబ్బులను సకాలంలో బ్యాంకులకు చెల్లించకుండా 750 కోట్ల రూపాయల వరకూ బకాయి పడింది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు కనుక, కేంద్రం కూడా చెల్లించడం మానేసింది. ఫలితంగా రైతుల పంట రుణాలపై వడ్డీ భారం రైతులే మోయవలసి వస్తున్నది.
రైతు కుటుంబాలు వ్యవసాయ అవసరాల కోసం ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాయి. వీటికి వడ్డీ రేట్లు ఎక్కువ. రుణ మాఫీ చేసినప్పుడు ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రకటిస్తే తప్ప, రైతులు బంగారం కుదువ పెట్టి తీసుకునే ఈ బ్యాంకు రుణాలకు సాధారణంగా రుణ మాఫీ వర్తించదు.
రైతులకు బ్యాంకులు కాలిక/ పెట్టుబడి రుణాలు కూడా ఇస్తాయి. ఇవి వ్యవసాయంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం సాధారణంగా ఇస్తారు. (పొలంలో షెడ్లు, బోరు/ బావి, ట్రాక్టర్ కొనుగోలు, డ్రిప్ లాంటివి) వీటికి వడ్డీ రేట్లు ఎక్కువ. సాధారణంగా ప్రభుత్వం ముందుగానే ప్రకటిస్తే తప్ప ఈ రుణాలు రుణ మాఫీ పరిధిలోకి రావు.
బ్యాంకులు వ్యవసాయ రంగ అనుబంధ రుణాలను కూడా ఇస్తాయి. పశువుల కొనుగోలు, చేపల పెంపకం, సహకార సంఘాల నిర్వహణ లాంటివి ఈ కోవలోకి వస్తాయి. వీటి వడ్డీ రేట్లు కూడా ఎక్కువ. సాధారణంగా ఇవి కూడా రుణ మాఫీ పరిధిలోకి రావు. బ్యాంకుల నుంచి కాకుండా రైతులు తీసుకునే మిగిలిన రుణాలన్నీ ప్రైవేట్ రుణాలే. వీటికి రుణమాఫీ వర్తించదు. వీటికి వడ్డీ రేట్లు చాలా ఎక్కువ.
సాధారణంగా బ్యాంకులు ఒక సీజన్ లో పంట రుణం ఇచ్చే ముందు రైతు నుంచి పంట రుణం కోసం దరఖాస్తు తీసుకుని రశీదు ఇవ్వాలి. బ్యాంకు అధికారి రైతు పొలాన్ని సందర్శించాలి. అక్కడ నిజంగా ఎవరు సాగు చేస్తున్నారో (యజమాని/కౌలు రైతు), అసలు ఆ భూమిని సాగు చేస్తున్నారో లేదో, ఏ పంట వేస్తున్నారో చూసి బ్యాంకుకు నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక ఆధారంగా బ్యాంకులు సాగు చేస్తున్న రైతుకు, సాగు చేస్తున్న పంటకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణం ఇవ్వాలి. స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ ప్రతి సంవత్సరం అన్ని పంటలకు ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు ఈ సంవత్సరం వరి, పత్తి పంటలకు ఎకరానికి 45,000 రూపాయలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ గా నిర్ణయించారు. రైతులకు ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే పంట రుణాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.
కానీ బ్యాంకు అధికారులు ఈ పద్ధతిని పాటించడం లేదు. సాధారణంగా ఎవరు సాగు చేస్తున్నారు, ఏ పంట వేస్తున్నారు అనేది ఫీల్డ్ కు వెళ్ళి చూడకుండానే, భూమి యజమానులకు వారు చెప్పిన పంట ఆధారంగా పంట రుణం అందిస్తున్నారు. కానీ బ్యాంక్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేసినట్లుగా రైతు నుంచి ప్రతి సీజన్ లో 500 రూపాయలు చార్జ్ మాత్రం వసూలు చేస్తున్నారు.
ఇక్కడ కూడా రైతులకు ఉండే పలుకుబడి ఆధారంగా బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తున్నాయి. నిరక్షరాశ్యులైన చిన్న సన్నకారు రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా తమకు తోచినంత ఇస్తున్నాయి. చాలా మంది భూమి యజమానులు, స్వయంగా వ్యవసాయం చేయకపోయినా, బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీలకు, లేదా వడ్డీ లేకుండా పంట రుణాలు తెచ్చుకుంటున్నారు. ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. నిజంగా ఆ భూమిని సాగు చేస్తున్న కౌలు రైతులకు మాత్రం బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదు.
పూర్తి నగర జిల్లా అయిన హైదరాబాద్ జిల్లాలో ఒక్క ఎకరం సాగు భూమి లేకపోయినా, 2023-2024 సంవత్సరంలో డిసెంబర్ 31 నాటికి రూ.1,541.95 కోట్ల పంట రుణాలు ఇచ్చారు. అంటే ఈ జిల్లాలో కూడా పంటలు పుష్కలంగా పండుతున్నాయని మనకు బ్యాంకులు చెప్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో గత ఖరీఫ్ లో కేవలం 18,199 ఎకరాలలో మాత్రమే పంటలు సాగయినా రూ.242 కోట్ల పంట ఋణాలకు లక్ష్యంగా పెట్టుకుని బ్యాంకులు ఆ జిల్లాలో రూ.2386.48 కోట్ల పంట రుణాలు ( 984 శాతం) ఇచ్చాయి. మరో వైపు రాష్ట్రంలో ఇస్తున్న మొత్తం వ్యవసాయ రుణాలలో కూడా ఎక్కువ భాగం పొందుతూ (రూ. 8,711 కోట్లు) మొదటి స్థానంలో ఉంది. మరో అర్బన్ జిల్లా రంగారెడ్డి రూ.5,989 కోట్లు పొందుతూ రెండవ స్థానంలో ఉంది.
భూమి లేని కౌలు రైతులకు, లేదా రైతులు చేసే కౌలు భూములకు బ్యాంకులు అసలు పంట రుణాలు ఇవ్వడం లేదు. నిజానికి వీరిని జాయింట్ లయబిలిటీ గ్రూపులుగా మార్చి రుణాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. కానీ బ్యాంకులు ఈ గ్రూపులకు కూడా తగిన స్థాయిలో రుణాలు ఇవ్వడం లేదు. పైగా ఈ JLG రుణాలకు వడ్డీ రాయితీ వర్తించదు. ఈ రైతులు రుణ మాఫీ పరిధి లోకి రావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులలో కౌలు రైతులే ఎక్కువ ఉండడానికి కారణం పెట్టుబడి సహాయం, పంట రుణాలు లాంటివి అందకపోవడమే. నిజంగా సంక్షోభంలో ఉన్న ఈ రైతులకు రుణమాఫీ వర్తించడం లేదు.
ఈ నేపధ్యంలో ఆగస్ట్ 15 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయే పంట రుణాల మాఫీ పథకం సంక్షోభంలో ఉన్న నిజమైన రైతులకు ఉపయోగపడుతుందా అనేది అసలు ప్రశ్న. రైతులను కుంగదీస్తున్న ప్రైవేట్ రుణాలను పట్టించుకోని ఈ పథకం నిజంగా రైతులను రుణాల ఊబి నుంచి బయట పడేస్తుందా అనేది ప్రభుత్వం ఆలోచించాలి .
ఈ నేపధ్యంలో రైతుల రుణ మాఫీ పథకం అమలు కోసం సరైన మార్గదర్శకాలను రూపొందించాలి. వ్యవసాయం చేయకుండానే, పంట రుణాలు తీసుకుంటున్న పెద్ద రైతులకు రుణ మాఫీ పథకం నిధులు ఎట్టి పరిస్థితుల్లో చేరకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలి. రెండు లక్షల లోపు పంట రుణాల మాఫీకి హామీ ఇచ్చాము కనుక, హామీని అమలు చేయడం లక్ష్యంగా మాత్రమే పెట్టుకుని రుణ మాఫీ అందరికీ వర్తింపచేయడం అనవసరం.
రుణమాఫీకి అర్హులను నిర్ణయించడానికి తప్పకుండా కొన్ని అంశాలను ప్రాతిపదికగా పెట్టుకోవాలి. అప్పుల ఊబిలో ఉన్న నిజమైన రైతులను ఉద్దేశించి రుణ మాఫీ మార్గ దర్శకాలను రూపొందించాలి. వాస్తవంగా పంటలను సాగు చేస్తున్న సన్నకారు, చిన్నకారు రైతుల వివరాలను సేకరించి, రెండు లక్షల లోపు వారి రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి. 2014 నుండీ రాష్ట్రంలో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల బ్యాంకు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి. ఆయా కుటుంబాల విచారణ చేపట్టి రైతు ఆత్మహత్యలను గుర్తించాలి. మిగిలిన రైతుల రుణ మాఫీ విషయంలో రాష్ట్ర వ్యవసాయ కుటుంబాల రుణ విముక్తి కమిషన్ సిఫారసుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధులు అత్యంత విలువైనవిగా పరిగణించాలి. వాటిని ఎట్టి పరిస్థితులలో వృధాగా ఖర్చు పెట్టకూడదు. అర్హులైన రైతులకు రుణమాఫీ చేసి, మిగిలిన నిధులను వ్యవసాయ రంగ ఇతర పథకాలకు ఉపయోగించాలి. కౌలు, పోడు రైతులు సహా వాస్తవ సాగు దారులకు మాత్రమే, ఇకపై బ్యాంకులు పంట రుణాలు అందించేలా ప్రభుత్వం చూడాలి. అంటే, ప్రతి సీజన్ లో వాస్తవ సాగుదారుల వివరాలను ప్రభుత్వం సేకరించి బ్యాంకులకు అందచేయాలి. ముఖ్యంగా కౌలు రైతులకు కూడా వడ్డీ లేని పంట రుణాలు అందేలా చూడడానికి ఆయా బ్యాంకులకు ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలి.
అసైన్డ్ భూముల యజమానులకు కూడా బ్యాంకులు తప్పకుండా పంట రుణాలు, ఇతర వ్యవసాయ రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. దేవాదాయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు కూడా ప్రభుత్వం పంట రుణాలు ఇచ్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. కౌలు రైతులను JLG లుగా ఏర్పరిచి, వారికి ఇచ్చే రుణాలను కూడా పంట రుణాలుగా పరిగణించి వడ్డీ రాయితీ పథకాలను అమలు చేయాలి. అలాగే సన్న చిన్నకారు రైతుల గోల్డ్ లోన్ లను కూడా పంట రుణాలుగా పరిగణించి, పావలా వడ్డీ పథకాన్ని అమలు చేయాలి. గత ప్రభుత్వం బకాయి పెట్టిన వడ్డీ రాయితీ మొత్తాలను వెంటనే బ్యాంకులకు చెల్లించి రైతులపై వడ్డీ భారాన్ని తగ్గించాలి. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా వ్యవసాయ కమిషన్ ను ఏర్పాటు చేసి, రైతు రుణ మాఫీ మార్గదర్శకాలు సహా అన్ని వ్యవసాయ రంగ అంశాలను లోతుగా చర్చించి, నిజమైన రైతుల సంక్షేమం కోసం నిర్ణయాలు చేయాలి.