మొంథా తుపాన్ : తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరం దాటిన మొంథా తుపాన్ తెలంగాణను కూడా వణికిస్తోంది.

Update: 2025-10-30 05:48 GMT
భారీవర్షాలతో రోడ్డును ముంచెత్తిన వరదనీరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అల్లాడించిన మొంథా తుపాన్ అవశేషమైన అల్పపీడనం తెలంగాణను వణికిస్తోంది. మొంథా అవశేషమైన అల్పపీడనం దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతంపై ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ గురువారం ఉదయం 05.30 గంటల సమయానికి తూర్పు విదర్భ, పక్కనే ఉన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతంపై పడిందని ఐఎండీ హైదరాబాద్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఉత్తర దిశగా తూర్పు మధ్యప్రదేశ్, పక్కనే ఉన్న ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపు కదులుతూ రాబోయే 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని ఆయన వివరించారు. మొంథా తుపాన్ అవశేషమైన అల్పపీడనం ప్రభావం తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేసింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. వరి, సోయాబీన్, పత్తి పంటలు దెబ్బతిన్నాయి.




 తెలంగాణలో 30 ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో అతి భారీ వర్షాలు

మొంథా తుపాన్ ప్రభావం వల్ల వరంగల్, హన్మకొండ, కరీంనగర్, మహబూబాబాద్, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లోని 30 ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురిశాయి. 204.50 మిల్లీమీటర్ల కంటే అధికంగా వర్షాలు కురిశాయని ఐఎండీ హైదరాబాద్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు గురువారం ఉదయం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిశాయని ఆయన తెలిపారు. హన్మకొండ జిల్లాలో 50 శాతం ప్రాంతాల్లో అతి భారీవర్షం కురిసింది. వరంగల్ జిల్లాల్లో 42.9 శాతం, జనగామ జిల్లాలో 40 శాతం అతి భారీ వర్షాలు కురిశాయని ఆయన వివరించారు.



 44 మండలాల్లో అతి భారీవర్షాలు

తెలంగాణలోని 14 మండలాల్లో అతి భారీవర్షాలు కురిశాయని హైదరాబాద్ వాతావరణశాఖ గురువారం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. 14 ప్రాంతాల్లో 204.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరో 30 మండలాల్లో 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 46 మండలాల్లో 64.5 నుంచి 115.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 123 మండలాల్లో 15.6 నుంచి 64.4 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. 81 స్టేషన్లలో 01 నుంచి 15.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఎ ధర్మరాజు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 368 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని ఆయన వివరించారు.



 వర్షపాతం రికార్డులివి...

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో అత్యధికంగా 422.0 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని ఐఎండీ అధికారులు చెప్పారు.కరవు పీడిత మండలంగా పేరొందిన భీమదేవరపల్లిలో కరవు తీరా వర్షాలు కురిశాయి. వంగర చెరువు గండి పడే ముప్పు ఏర్పడటంతో పోలీసులు అడ్డుగా ఉన్న చెత్తను తొలగించి నీటిని దిగువకు వదలడంతో ప్రమాదం తప్పింది. పర్వతగిరి మండలం కల్లెడలో 415.5 మిల్లీమీటర్లు, నెక్కొండ మండలం రెడ్లవాడలో 358.5 మిల్లీమీటర్లు, ఖిలా వరంగల్ ఉర్సులో 347.3 మిల్లీమీటర్లు, ధర్మసాగర్ లో 332.8 మిల్లీమీటర్లు, సంగెం మండలం కాపులకనపర్తిలో 332.8 మిల్లీమీటర్లు, వర్దన్నపేట మండలం వర్థన్నపేటలో 324.0 మిల్లీమీటర్లు, సంగెంలో 310.5మిల్లీమీటర్లు,సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో 304.3 మిల్లీమీటర్లు, జనగామలో 294.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. అతి భారీవర్షాల వల్ల వరదలు వెల్లువెత్తాయి. పలు జనవాసాలు, కాలనీలను వరద నీరు ముంచెత్తింది.


Tags:    

Similar News