Komatireddy | రేవంత్ సీరియస్.. కోమటిరెడ్డికి డేంజర్ బెల్స్ ?
రాజగోపాలరెడ్డికి క్రమశిక్షణ కమిటి నోటీసు ఇవ్వబోతున్నట్లు అర్ధమవుతోంది;
మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి(Komatireddy)కి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా ? తాజాగా పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh) మీడియాకు చెప్పింది చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకీ మహేష్ ఏమన్నారంటే ‘రాజగోపాలరెడ్డి వ్యవహారం చూడమని క్రమశిక్షణ కమిటి ఛైర్మన్ మల్లురవికి చెప్పాను’ అని అన్నారు. ‘రాజగోపాలరెడ్డి ఎందుకు అలా మాట్లాడుతున్నారు ? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నా’రు ? అన్న విషయాలను క్రమశిక్షణ కమిటి చూసుకుంటుంది అన్నారు.
ఇపుడు విషయం ఏమిటంటే క్యాబినెట్ లో చోటు దక్కలేదన్న కోపంతో మండిపోతున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తనిష్టం వచ్చినట్లుగా ఎనుముల రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు. రేవంత్ ఏదంటే దానికి భిన్నంగా మాట్లాడుతు రేవంత్ ను బహిరంగంగా తప్పుపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. పదేళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఏదో సందర్భంలో రేవంత్ అన్నారు. వెంటనే మరుసటి రోజే మీడియాతో రాజగోపాల్ మాట్లాడుతు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉంటానని తానే చెప్పుకోవటం ఏమిటని రేవంత్ ను నిలదీశారు. ఇలా చెప్పుకుని పద్దతి కాంగ్రెస్ లో లేదన్నారు. తర్వాత బ్లాక్ మెయిలర్లుగా తయారైన కొందరు నకిలీ జర్నలిస్టులను రేవంత్ తప్పుపట్టారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టుల పేరుతో కొందరు ఇబ్బందిగా తయారయ్యారని రేవంత్ మండిపడ్డారు.
వెంటనే రాజగోపాల్ స్పందించి రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోను, కాంగ్రెస్ అధికారంలోకి రావటంలోను సోషల్ మీడియా మీడియాది కీలకపాత్ర అన్న విషయాన్ని రేవంత్ మరచిపోకూడదన్నారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళకు తాను మద్దతుగా నిలబడుతున్నట్లు ప్రకటించారు. ఇలా ఒకటికాదు చాలాసార్లు రేవంత్ టార్గెట్ గానే ఎంఎల్ఏ మాట్లాడుతున్నారు. ఒకసారి తనకు మంత్రిపదవి ఎందుకు ఇవ్వటంలేదని నిలదీస్తారు. మరోసారి తనక మంత్రిపదవి ముఖ్యమే కాదంటారు.
తాజాగా రేవంత్ గురించి మాట్లాడుతు మునుగోడు అభివృద్ధికి నిధులే ఇవ్వటంలేదని ఒక సభలో ఆరోపించారు. ‘నిధులు, పదవులు అన్నీ మీకేనా..మా నియోజకవర్గానికి ఏమీలేదా’ ? అంటు మండిపడ్డారు. ఇలాంటి అనేక ఉదాహరణలను తొందరలోనే క్రమశిక్షణ కమిటి పరిశీలించబోతోంది. బొమ్మ చెప్పింది చూస్తుంటే తొందరలోనే రాజగోపాలరెడ్డికి క్రమశిక్షణ కమిటి నోటీసు ఇవ్వబోతున్నట్లు అర్ధమవుతోంది. విచారణకు హాజరుకావాలని కమిటి నోటీసులు ఇస్తే దానికి రాజగోపాలరెడ్డి ఏ విధంగా రియాక్టవుతారో చూడాలి.