ఎమ్మెల్సీ కవితకి హైకోర్టులోనూ నిరాశే

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు బెయిల్ పిటిషన్ కి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది.

Update: 2024-05-10 13:46 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు బెయిల్ పిటిషన్ కి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. ఢిల్లీ హై కోర్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. కవిత బెయిల్ పిటిషన్ పై వాదనల కోసం ఈడీ కొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈడీ అభ్యర్ధన మేరకు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హై కోర్టు మే 24 కి వాయిదా వేసింది.

ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై మే 6 న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. వాదనల అనంతరం పిటిషన్ ని డిస్మిస్ చేసింది. దీంతో కవిత ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై హై కోర్టులో సవాల్ చేశారు. ఈ క్రమంలోనే నేడు విచారణ జరిపిన ధర్మాసనం వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15 న ఈడీ అధికారులు కవితని హైదరాబాద్ లోని ఆమె నివాసంలో అరెస్టు చేశారు. ఆమెని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా ఇరు వర్గాల వాదనలపై విచారణ జరిపిన న్యాయస్థానం జుడీషియల్ కస్టడీకి ఆదేశాలిచ్చింది. మరోవైపు సీబీఐ కూడా ఆమెపై కేసు నమోదు చేసి ఏప్రిల్ 11 న అరెస్టు చేసింది. ఈ రెండు దర్యాప్తు సంస్థల కేసులకు సంబంధించి ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మే 7 వ తేదీతో ఆమె జుడీషియల్ కస్టడీ ముగియనుండగా.. కస్టడీని పొడిగించాలన్న దర్యాప్తు సంస్థల అభ్యర్ధన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు మే 14 వ తేదీ వరకు ఆమె కస్టడీని పొడిగించింది.

అయితే, కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా తన వాదనలు వినిపించుకునేందుకు ప్రత్యక్షంగా కోర్టులో హాజరయ్యే అవకాశం కల్పించాలని కోర్టుని కోరారు. ఈ అభ్యర్ధనను స్వీకరించిన న్యాయస్థానం ఆమె నేరుగా తన వాదనలు వినిపించేందుకు అనుమతిచ్చారు. దీంతో ఆమె కోర్టులో ప్రత్యక్షంగా హాజరయ్యారు.

Tags:    

Similar News