మీరు ఎవరికి ఓటేసినా గెలిచేది బీజేపీనే: అర్వింద్
ఓట్ల చోరీ వివాదం సమయంలో వైరల్ అవుతున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కామెంట్స్.;
‘ఓటరు ఎవరికి ఓటు వేసినా.. గెలిచేది మాత్రం బీజేపీనే. కమలాన్ని వికసించకుండా ఎవరూ ఆపలేరు’ అంటూ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఒకవైపు ఓటర్ల జాబితా, ఈవీఎంల మోసం వంటి వివాదాలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న క్రమంలో అర్వింద్ వ్యాఖ్యలు తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో అవకతవకలంటూ విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలేనా అన్న చర్చలకు దారితీస్తున్నాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం.. ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలు పాల్పడిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి తెరలేపాయి.
బీజేపీతో కుమ్మక్కయి ఈసీ వీటికి పాల్పడిందంటూ రాహుల్ సహా విపక్షలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇదే సమయంలో బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈవీఎంల పనితీరుపై కూడా విపక్షాలు తీవ్ర అపనమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. ఈవీఎం విధానం తొలగించి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదం దేశమంతా తీవ్ర దుమారం రేపుతున్న క్రమంలో తెలంగాణ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు చెందిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పుడు చూస్తున్న నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. ఆయన మాటలు వింటే బీజేపీ ఎలా గెలిచిందో అర్థమవుతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
బీజేపీ విజయం తథ్యం: అర్వింద్
‘‘మీరు ఓటు నోటాకు వేసినా నేనే గెలుస్తా. కారుకు వేసినా, హస్తం గుర్తుకు వేసినా గెలిచేది మాత్రం బీజేపీనే. మేము మీ ప్రయోజనాల కోసమే వచ్చాం. వచ్చేది మోదీనే’’ అని ధర్మపురి అర్వింద్ ఆ వీడియోలో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగింది అనడానికి ఈ ఒక్క వీడియో సరిపోతుందంటూ కొందరు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో అసలు కథ ఇది..
అయితే ప్రస్తుతం ఓటర్ల జాబితా, ఈవీఎంల వివాదాలు నడుస్తున్న క్రమంలో వైరల్ అవుతున్న అర్వింద్ వీడియో ఇప్పటిది కాదు. దాదాపు రెండు సంవత్సరాల క్రితంది. 2023 ఆగస్టు నెలలో కాంగ్రెస్ నేత జైరాం రమేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. అర్వింద్ చేసిన వ్యాఖ్యలివి. కాగా ప్రస్తుతం వివాదం తీవ్రతరంగా నడుస్తున్న క్రమంలో ఈ వీడియోను విపక్షాలు ఆయుధంలా వినియోగించుకుంటున్నాయి. ఎన్నికల్లో బీజేపీ చేస్తున్న అక్రమాలకు గతంలో అర్వింద్ చేసిన వ్యాఖ్యలు నిదర్శనమని విపక్షాలు మండిపడుతున్నాయి.