రేవంత్ హీరో అయిపోయారా ?

తెలంగాణాలో ఇపుడు జరిగిందిదే. పార్టీలు, పబ్లిక్ అని తేడా లేకుండా అన్నీవర్గాల్లోను రేవంత్ రెడ్డికి హీరో ఇమేజి వచ్చేసింది.

Update: 2024-08-30 04:36 GMT
Revanth and brother Tirupati reddy

తెలంగాణాలో ఇపుడు జరిగిందిదే. పార్టీలు, పబ్లిక్ అని తేడా లేకుండా అన్నీవర్గాల్లోను రేవంత్ రెడ్డికి హీరో ఇమేజి వచ్చేసింది. దీనికి కారణం ఏమిటంటే ‘హైడ్రా’ ను ఏర్పాటుచేయటమే. చెరువులు, కుంటలు, కాల్వలును ఆక్రమించి చేసిన అక్రమకట్టడాలను కూల్చేయటం కోసం ఏర్పాటుచేసిందే హైడ్రా. ఎప్పుడైతే హైడ్రా తన పనిని ప్రారంభించిందో అప్పటినుండి రేవంత్ కేంద్రంగా వివాదాలు పెరిగిపోతున్నాయి. శంకర్ పల్లి మండలంలోని జన్వాడ ఫాంహౌస్ కూల్చివేతకు హైడ్రా నోటీసులు ఇవ్వటంతో హైడ్రా చర్యలను రేవంత్ తో ముడిపెడుతు రాజకీయ దుమారం మొదలైంది. ఎందుకంటే జన్వాడ ఫాంహౌస్ కేటీఆర్ ది కావటమే కారణం. రకరకాల కారణాలతో జన్వాడ ఫాంహౌసుకు హైడ్రా వెళ్ళలేదు కాని ఊహించని రీతిలో ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చేయటం సంచలమైంది.



 ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నాగార్జున తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి కట్టాడని అందరికీ తెలుసు. ఆ సెంటర్ పై చాలా ఫిర్యాదులు అందాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కాకుండా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల తర్వాత సర్వేలు జరిపారు, ఆక్రమణలు నిజమే అని తేలింది కూడా. అయినా సరే ఏ ప్రభుత్వమూ కన్వెన్షన్ సెంటర్ జోలికి వెళ్ళలేదు. ఇలాంటి స్ధితిలో చెప్పాపెట్టకుండా హైడ్రా కన్వెన్షన్ సెంటర్ను కూల్చేయటంతో జనాల్లో ఒక్కసారిగా రేవంత్ అంటే హోరీ వర్షిప్ పెరిగిపోయింది. సంవత్సరాల తరబడి ఏ ప్రభుత్వమూ చేయలేని పనిని నాలుగు గంటల్లో రేవంత్ చేసేశాడనే టాక్ జనాల్లో పెరిగిపోయింది. అంతకుముందే ఓల్ సిటీలో ఎంఐఎం ఎంఎల్ఏ ముబిన్ కు చెందిన అక్రమనిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేసింది. చెరువులను ఆక్రమించి నిర్మిస్తున్న భారీ నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేయటంతో జనాలో సానుకూలత పెరిగిపోయింది.



ఎప్పుడైతే జన్వాడ ఫాంహౌస్ కూల్చివేతకు హైడ్రా నోటీసులు ఇచ్చిందో అప్పటినుండి రాజకీయ రచ్చ మొదలైంది. రేవంత్ ను బీఆర్ఎస్ కీలకనేతలు కేటీఆర్, హరీష్ రావు తదితరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళెంత వ్యతిరేకిస్తున్నారో మామూలు జనాలు అంతగా మద్దతు పలుకుతున్నారు. ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ తో పాటు హైదరాబాద్ సిటీలో హైడ్రా, రేవంత్ కు మద్దతుగా ర్యాలీలు జరుగుతున్న విషయం తెలిసిందే. పపదేళ్ళ బీఆర్ఎస్ హయాంలోనే చెరువులు, కుంటలు, కాల్వల ఆక్రమణలు పెరిగిపోయి అక్రమనిర్మాణాలు విపరీతంగా వెలిసినట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. జనాల మూడ్ చూసి, హైడ్రాకు వస్తున్న మద్దతు చూసి బీఆర్ఎస్ నేతలకు ఏమి చేయాలో దిక్కుతోచటంలేదు. అందుకనే రేవంత్ సోదరులు కూడా చెరువును ఆక్రమించి నిర్మించిన ఇంట్లోనే ఉంటున్నాడని కేటీఆర్ ఆరోపించారు. దానికి సమాధానంగా రేవంత్ మాట్లాడుతు తన బంధువులైనా సరే అక్రమనిర్మాణాల్లో ఉంటే కూల్చేయమని హైడ్రాను ఆదేశించారు.



 ఇందులో భాగంగానే రెవిన్యు అధికారులు రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డికి నోటీసులు జారీచేశారు. నెలరోజుల్లోపు తానే ఇంటిని కూల్చేసుకోకపోతే హైడ్రానే కూల్చేస్తుందని నోటీసులో స్పష్టంగా చెప్పింది. తిరుపతిరెడ్డి కూడా కూల్చివేతకు సానుకూలంగానే స్పందించారు. తాజా డెవలప్మెంటుతో కేటీఆర్ తదితరులకు ఏమి మాట్లాడాలో తెలీలేదు. దీనివల్ల ఏమైందంటే జనాల్లో రేవంత్ ఇమేజి మరింతగా పెరిగిపోయింది. సీఎం సోదరుడి ఇంటిని కూడా కూల్చేస్తామని రెవిన్యు శాఖ నోటీసులు ఇవ్వటం మామూలు విషయం కాదనే చర్చ పెరిగిపోతోంది. అక్రమనిర్మాణాలను తొలగించటంలో సొంత సోదరుడి ఇంటినే కూల్చేయాలని రేవంత్ ఆదేశించాడనే ఇమేజి బాగా పెరిగిపోయింది.


 



ఇక బీజేపీ విషయం చూస్తే కమలనాదుల పరిస్ధితి చాలా విచిత్రంగా తయారైంది. హైడ్రాను కొందరు సమర్ధిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. దాంతో హైడ్రా యాక్షన్ పై పార్టీలో ఒకస్టాండ్ అంటు లేదన్న విషయం అర్ధమైపోయింది. అందుకనే హైడ్రాపై బీజేపీలో నేతలకు దిక్కుతోచటంలేదు. సీపీఐ కూడా హైడ్రా యాక్షన్ కు మద్దతుగానే మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీకి వేరేదారిలేదు కాబ్టటి మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, సీనియర్ నేతలంతా రేవంత్ ను సమర్ధిస్తున్నారు. ఇక పర్యావరణ వేత్తలు, ఎన్జీవోలు, నీటి వనరులను పరిరక్షించాలని పెద్దఎత్తున పోరాటాలు చేస్తున్న నిపుణులు కూడా రేవంత్ కు మద్దతుగా భారీ ర్యాలీలు తీశారు. దాంతో ఏ కోణంలో చూసినా రేవంత్ హీరో అయిపోయారని అర్ధమవుతోంది.

Tags:    

Similar News