Harish self goal|హరీష్ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా ?
అసెంబ్లీ జరిగిన చర్చలు, జరిగిన అవినీతిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయిస్తున్నట్లు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రకటన చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది
అసెంబ్లీ జరిగిన చర్చలు, జరిగిన అవినీతిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయిస్తున్నట్లు రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన ప్రకటన చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్(BRS) 2023 ఎన్నికలకు ముందు ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) టోల్ గేట్లను ప్రైవేటుసంస్ధకు అప్పగించింది. ఈ విషయమై అప్పట్లోనే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ(Congress Party) చాలా ఆరోపణలు చేసింది. అప్పటిమంత్రి కేటీఆర్(KTR), మున్సిపల్ శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ టార్గెట్ గా రేవంత్ అండ్ కో చాలా ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలు ఎంతగోల చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుపోయింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
అధికారంలోకి వచ్చింది మొదలు ఎప్పుడు అవకాశం దొరికినా ఓఆర్ఆర్ అవినీతిని పదేపదే ప్రస్తావిస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాల్లో కూడా బీఆర్ఎస్ అవినీతి, అక్రమాల మీద చర్చ జరిగినపుడు ఓఆర్ఆర్ అవినీతిని కాంగ్రెస్ సభ్యులు ప్రస్తావించారు. ఇదేవిషయమై ప్రత్యేకంగా రేవంత్ కూడా మాట్లాడారు. రేవంత్ మాట్లాడుతున్నపుడు బీఆర్ఎస్ ఎంఎల్ఏ హరీష్ రావు(Harish Rao) జోక్యంచేసుకుని ఊరికే అవినీతి ఆరోపణలు చేసేబదులు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనవసరమైన ఆరోపణలు చేసేబదులు విచారణచేయిస్తే వాస్తవాలు బయటపడతాయని చాలెంజ్ చేశారు. చాలెంజ్ కు రేవంత్ వెంటనే స్పందిస్తు హరీష్ రావు కోరికమేరకు ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన అవినీతిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయిస్తున్నట్లు ప్రకటించారు.
రేవంత్ ప్రకటేతో బీఆర్ఎస్ సభ్యులకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లయ్యింది. గడచిన ఏడాదిగా రేవంత్ అండ్ కో ఎప్పుడు మాట్లాడిన ఔటర్ అవినీతిని ప్రస్తావించి వదిలేస్తున్నారు. ఏదో సందర్భంవచ్చినపుడు ఓఆర్ఆర్ అవినీతిని ప్రస్తావిస్తున్నారు కాని ప్రత్యేకంగా విచారణ జరిపించే అంశాన్ని ఎన్నడు చెప్పలేదు. అలాంటిది ఔటర్ అవినీతిపై విచారణ చేయించాలని హరీష్ చేసిన చాలెంజ్ కు రేవంత్ వెంటనే స్పందించి దర్యాప్తు చేయిస్తున్నట్లు ప్రకటించటాన్ని కారుపార్టీ ఎంఎల్ఏలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఔటర్ అవినీతి అంశంపై హరీష్ సెల్ఫ్ గోల్(Harish Self Goal) వేసుకున్నారనే చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది. ఔటర్ అవినీతిపై విచారణ చేయించండని హరీష్ చాలెంజ్ చేయకపోతే రేవంత్ దర్యాప్తు చేయిస్తామని ప్రకటన చేసుండేవారు కాదని బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది.
అనవసరంగా రేవంత్ ను రెచ్చగొట్టి హరీష్ చాలెంజ్ చేయటం వల్లే ఇపుడు ప్రభుత్వం విచారణచేయిస్తున్నట్లు ప్రకటించిందని బీఆర్ఎస్ ఎంఎల్ఏలు అభిప్రాయపడుతున్నారు. దర్యాప్తు చేయిస్తున్నట్లు రేవంత్ ప్రకటించిన తర్వాత తప్పనిసరి పరిస్ధితుల్లో బీఆర్ఎస్ వెల్ కమ్ చేసింది. ఈ విషయం కేటీఆర్ ప్రకటనలోనే తెలిసిపోతోంది. శుక్రవారం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతు ఔటర్ రింగ్ రోడ్డులో అవినీతి జరిగిందని ప్రకటించిన రేవంత్ విచారణకు ఆదేశించటం చాలా మంచిదన్నారు. కాకపోతే ప్రభుత్వ అధికారులతో కాకుండా విచారణను సిట్టింగ్ జడ్జితో చేయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరిధిలో ఉండే అధికారులు విచారణ చేస్తే రేవంత్ ఆలోచనలకు తగ్గట్లుగానే రిపోర్టు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అనుమానం వ్యక్తంచేశారు. విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే సిట్టింగ్ జడ్జితో చేయించాలని డిమాండ్ చేశారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఎవరితో విచారణ చేయించాలన్నది పూర్తిగా రేవంత్ ఇష్టంమీదే ఆధారపడుంటుంది. ప్రభుత్వఅధికారులతో విచారణ చేయించాలన్నా, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నా పూర్తిగా రేవంత్ నిర్ణయమే అనటంలో సందేహంలేదు. ఔటర్ అంశంపై అసలు విచారణ చేయించే ఉద్దేశ్యమే రేవంత్ కు లేదు. అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ ఛాలెంజ్ చేయటంతోనే రేవంత్ కూడా వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు. విచారణలో బయటపడే విషయాలు ఏమిటన్నది పక్కనపెట్టేస్తే ఒకేరోజు ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో అవినీతిపై కేటీఆర్ మీద ఏసీబీ(ACB Case) కేసుదు నమోదుచేయటం, ఔటర్ అవినీతిపై విచారణ జరిపిస్తామని రేవంత్ ప్రకటించటంతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.